
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లకు బీమా ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి వాహన మిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
తమకు వచ్చే వేతనం నుంచి ఎండీయూ వాహనాల ప్రీమియాన్ని ఏటా బ్యాంకులు జమ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విన్నవించారు.
ఇదే విషయాన్ని మంత్రి కారుమూరి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సీఎం సానుకూలంగా స్పందించారు. బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో.. ఎండీయూ ఆపరేటర్లకూ ప్రీమియం మొత్తం రూ.9 కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లించనుందని మంత్రి కారుమూరి శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.