కేరళలో బియ్యం రకాలను పరిశీలిస్తున్న మంత్రి కారుమూరి, కేరళ మంత్రి, అధికారులు
సాక్షి, అమరావతి/ తణుకు అర్బన్: రాష్ట్రంలో పండించే జయ రకం ధాన్యం (ఎంటీయూ 3626 బొండాలు), బియ్యాన్ని తమకు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో కేరళ ఒప్పందం చేసుకుంది. కేరళ పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ బాబు.ఏ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు ఎంవోయూ చేసుకున్నారు.
ఏపీలో పండించే జయ బొండాలకు కేరళలో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తమకు జయ బొండాలతోపాటు పలురకాల నిత్యావసరాలు తమకు సరఫరా చేయాలని కోరారు. ఏపీ మంత్రితో పాటు అధికారుల బృందాన్ని కేరళ పర్యటనకు ఆహ్వానించారు. కేరళ మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... జయ రకం ధాన్యంతోపాటు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, అధికారుల బృందం కేరళ పర్యటనకు వెళ్లగా... ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రత్యేక భేటీలో సుదీర్ఘంగా చర్చించి పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో జయ బొండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు పెద్ద ఎత్తున మేలు జరుగనుంది.
ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాలను కేరళ పౌరసరఫరాల సంస్థ మావెల్లి స్టోర్స్ ద్వారా మార్క్‌ఫెడ్ బ్రాండ్‌తోనే వినియోగదారులకు అందించనుంది. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేరళ మంత్రి అనిల్‌తో కలిసి మావెల్లి స్టోర్స్‌ను సందర్శించి, అక్కడి వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment