markfed andhra pradesh
-
‘గ్యారెంటీ’ అప్పు రూ.5,200 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ.5,200 కోట్ల రుణం పొందేందుకు పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్ఫెడ్లకు అనుమతినిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతుల మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులతో పాటు 2024–25 సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ రుణాన్ని వినియోగిస్తామని తెలిపింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.అప్పులు మినహా మరో మార్గం లేదు..రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇటీవలే రూ.1,000 కోట్లు విడుదల చేశాం. మరో రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందేందుకు పౌర సరఫరాల సంస్థను అనుమతిస్తూ గత నెల 28వ తేదీన ప్రభుత్వం జీవో నెం.6 జారీ చేసింది. ఈ రుణం కోసం ప్రభుత్వ హామీ కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25లో ధాన్యం కొనుగోలు కోసం వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ హామీతో రూ.3,200 కోట్ల కొత్త రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను సవరించి మెరుగైన విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మేలు చేసేందుకు అప్పులు చేయడం మినహా మరో మార్గం లేదు. ఉచిత పంటల బీమా స్థానంలో మెరుగైన పంటల బీమా పథకాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏర్పాటయ్యే కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, గనుల పాలసీలు రద్దుఏపీ ల్యాండ్ టైటిలింగ్ 2022 చట్టం రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక, గనుల పాలసీ 2019, మరింత మెరుగైన ఇసుక విధానం 2021ని రద్దు చేయడంతో పాటు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్æ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం 2024 తెస్తాం. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తూ ఈ నెల 8న జారీ చేసిన జీవో నెం.43 ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి గుల్బెంకియన్ అవార్డు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో అమలులో ఉన్న ప్రకృతి సాగును 2029 నాటికి కనీసం 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.కౌన్సిల్లో బలం లేదు.. నిజమే‘‘కౌన్సిల్లో మాకు బలంలేని మాట వాస్తవమే. అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా?’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించగా నాడు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారని ఎదురు ప్రశ్నించారు. హౌసింగ్‌లో అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైందని మంత్రి చెప్పారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. భూముల ధరలు కనీసం రూ.ఐదారు లక్షలకు పైగా పెరిగాయన్నారు. ఎయిర్, రైల్ ట్రాఫిక్ 30 శాతం పెరిగిందన్నారు.ఇసుకలో తలదూర్చొద్దు!ఇసుక వ్యవహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి కొంతకాలం సజావుగా సాగనివ్వాలన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో వివిధ రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉందని, వచ్చే 3 నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొత్త విధానాన్ని తెద్దామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తావనకు రావడంతో కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాల్సి ఉందని, అవన్నీ బయటకు చెప్పలేనని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు సరిగా జనంలోకి తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఆగస్టు ఒకటో తేదీన ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు.ఐదు రోజులు అసెంబ్లీఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ సమావేశాల్లోనే పెడదామని చెప్పారు. పంటల బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసం చేసిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1,600 కోట్లు రుణం తెచ్చి రూ.వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగతాది ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు తెలిసింది. కిలో రూ.43 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా వచ్చే మంత్రివర్గం సమావేశం నాటికి దీంతోపాటు భూ అక్రమాలపైనా విచారణకు ఆదేశించడంపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. -
అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్, ఇటు లో గ్రేడ్ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు. ధరల పెరుగుదల ఇలా.. వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది. డిమాండ్ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వ్యాపారుల్లో పెరిగిన పోటీ... పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది. 70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్ కిలోల పొగాకు అదనంగా వచ్చింది. బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. – మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం పొగాకు సరాసరి ధరలు సంవత్సరం ధర (రూ) 2018–19 126 2019–20 124.55 2020–21 148.54 2021–22 172.49 2022–23 239.43 (వేలం ఇంకా కొనసాగుతోంది) 5182 హెక్టార్లలో అదనంగా సాగు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్ఎల్ఎస్)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు. -
కేరళకు ఆంధ్రా ధాన్యం
సాక్షి, అమరావతి/ తణుకు అర్బన్: రాష్ట్రంలో పండించే జయ రకం ధాన్యం (ఎంటీయూ 3626 బొండాలు), బియ్యాన్ని తమకు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో కేరళ ఒప్పందం చేసుకుంది. కేరళ పర్యటనలో భాగంగా మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ బాబు.ఏ సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. ఏపీలో పండించే జయ బొండాలకు కేరళలో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తమకు జయ బొండాలతోపాటు పలురకాల నిత్యావసరాలు తమకు సరఫరా చేయాలని కోరారు. ఏపీ మంత్రితో పాటు అధికారుల బృందాన్ని కేరళ పర్యటనకు ఆహ్వానించారు. కేరళ మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... జయ రకం ధాన్యంతోపాటు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు వంటి నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి, అధికారుల బృందం కేరళ పర్యటనకు వెళ్లగా... ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రత్యేక భేటీలో సుదీర్ఘంగా చర్చించి పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో జయ బొండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు పెద్ద ఎత్తున మేలు జరుగనుంది. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేసే నిత్యావసరాలను కేరళ పౌరసరఫరాల సంస్థ మావెల్లి స్టోర్స్ ద్వారా మార్క్‌ఫెడ్ బ్రాండ్‌తోనే వినియోగదారులకు అందించనుంది. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కేరళ మంత్రి అనిల్‌తో కలిసి మావెల్లి స్టోర్స్‌ను సందర్శించి, అక్కడి వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు. -
కమీషన్లు కొట్టేయడానికి కొత్త ప్లాన్
మార్క్‌ఫెడ్ నెత్తిన మల్టీప్లెక్స్ భారం రూ.450 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం సంస్థ వద్ద నిధుల్లేవు.. రుణాలింకా మంజూరు కాలేదు డీపీఆర్‌లు లేకుండానే అంచనా వ్యయంలో 25 శాతం చెల్లింపు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు తెచ్చిన రుణాల వినియోగం! కమీషన్ల కోసం పాలకమండలి కక్కుర్తి వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు సాక్షి, విజయవాడ బ్యూరో: రైతులకు సేవలు చేయాల్సిన మార్క్‌ఫెడ్ దారి తప్పుతోంది. కమీషన్ల కక్కుర్తితో ‘కమర్షియల్’ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకొని వేగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. పూర్తయిన నిర్మాణాలను కారుచౌకగా కొట్టేయడానికి అధికార పార్టీ నేతలు వ్యూహం పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్కెఫెడ్‌కు విజయవాడతోపాటు రాష్ట్రంలోని మరో ఐదు ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో విజయవాడలో ఉన్న స్థలంలో మల్టీప్లెక్స్, మిగిలిన చోట్ల కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని మార్క్‌ఫెడ్ పాలకమండలి ఇటీవల తీర్మానించింది. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. విలువైన మార్క్‌ఫెడ్ స్థలాలు కొట్టేయడానికి ఇదో రాచమార్గమని, రుణాలు తీసుకొని మార్కెఫెడ్ నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత వాటిని చౌకగా లీజుకు తీసుకోవాలని వ్యూహం రూపొందించినట్లు తెలిసింది. నిర్మాణ పనులు చేపడితే భారీగా కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. అధికార పార్టీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే పాలకమండలి తీర్మానం చేసిన మరుసటి రోజే.. కన్సల్టెంట్ ఫీజు పేరిట రూ. 2.5 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మంతా పాలకవర్గం సభ్యులే నొక్కేశారని మార్క్‌ఫెడ్‌లో ప్రచారం జరుగుతోంది. తీర్మానం చేసి 10 రోజులు తిరగకముందే.. ప్రాజెక్టు నివేదికలు సిద్ధం కాకపోయినా, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(ఈపీఐ)కి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. కన్సల్టెంట్ ద్వారా మొత్తం అంచనా వ్యయంలో 25 శాతం(రూ. 110 కోట్లు) చెల్లించారు. ఈ అడ్డగోలు చెల్లింపులను సంస్థలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, పాలకమండలి, ఎండీ, జీఎం కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ చేసేది లేక మౌనంగా ఉండిపోతున్నారు. అందరూ కుమ్మక్కు కావడం వల్లే ఈ మొత్తం చెల్లించగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు, ప్రభుత్వం ఎంపిక చేసిన నోడల్ ఏజన్సీలకు యూరియాను నిల్వ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీపై వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల నుంచి ఈ రూ.110 కోట్లు చెల్లించడం గమనార్హం. ప్రభుత్వ అనుమతి లేకుండానే.. భారీ ప్రాజెక్టులు.. అవి కూడా వాణిజ్య కార్యకలాపాలు చేయడానికి నిర్మించే వాటికి ప్రభు త్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన ఉంది. ఒకవేళ అనుమతి లభించకపోతే భారీ కమీషన్లు పోతాయనే భయంతోనే హడావుడిగా సొమ్ములు చెల్లించేస్తున్నారని సమాచారం. అసలు వ్యాపారం వదలి కొసరు వ్యాపారం చేయడానికి ప్రభుత్వం నుంచి అ నుమతులు ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని అధికార పార్టీ నేతలు గట్టిగా హా మీ ఇవ్వడం వల్లే.. పాలకవర్గం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక దశలోనే ఉంది కమర్షియల్ ప్రాజెక్టు చేపట్టాలని పాలకమండలి తీర్మానం చేసిన మాట నిజమే. ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం. - మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు బ్యాంకులు రుణాలిస్తాయనే గ్యారంటీ లేదు మార్క్‌ఫెడ్ చేపడుతున్న భారీ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. గత 10 రోజులుగా అన్ని బ్యాంకులతో సంస్థ పాలకమండలి మాట్లాడినా ఫలితం లేదు. అయినా సరే ఏదో విధంగా రుణం అందుతుందనే నమ్మంతో ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న ఇతర రుణాలను మళ్లించడం గమనార్హం. భారీ ప్రాజెక్టు చేపట్టే ముందే ఆర్థిక వనరులను సమీక్షించుకోకపోవడాన్ని కిందిస్థాయి అధికారులు తప్పుబడుతున్నారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా ఏదో సంస్థను కన్సల్టెంట్ ద్వారా ఎంపిక చేసుకొని, భారీగా సొమ్ము చెల్లిస్తే మునిగిపోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.