అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు | Farmers happy with the prices of tobacco at Prakasham district | Sakshi
Sakshi News home page

అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు

Published Wed, Jun 21 2023 1:20 AM | Last Updated on Wed, Jun 21 2023 6:39 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్‌ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు.

ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి.

ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్‌ ఎగురేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్‌, ఇటు లో గ్రేడ్‌ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత సీజన్‌లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్‌ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు.

ధరల పెరుగుదల ఇలా..

వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్‌–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్‌ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి.

16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్‌లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్‌లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది.

డిమాండ్‌ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది.

వ్యాపారుల్లో పెరిగిన పోటీ...

పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్‌ జగన్‌ చెక్‌ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు.

దీనిని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్‌ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది.

70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి

ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్‌ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్‌ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్‌ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్‌ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్‌ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్‌ కిలోల పొగాకు అదనంగా వచ్చింది.

బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం

ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు.

– మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం

పొగాకు సరాసరి ధరలు

సంవత్సరం ధర (రూ)

2018–19 126

2019–20 124.55

2020–21 148.54

2021–22 172.49

2022–23 239.43

(వేలం ఇంకా కొనసాగుతోంది)

5182 హెక్టార్లలో అదనంగా సాగు

ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్‌బీఎస్‌), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్‌ఎల్‌ఎస్‌)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement