
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
ఒంగోలు వన్‌టౌన్: ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్‌లు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు.
నేడు వక్ఫ్ చట్ట సవరణపై నిరసన
ఒంగోలు వన్‌టౌన్: వక్ఫ్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ఈద్ నమాజ్ అనంతరం పాత కూరగాయల మర్కెట్ సెంటర్‌లో ఉన్న మౌలానా అబుల్ కలాం అజాద్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్లు ముస్లిం ప్రజా సంఘాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లరిబ్బన్‌లు ధరించి శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
జీవ సమాధికి యత్నం !
● అడ్డుకున్న పోలీసులు
తాళ్లూరు: ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు సమాధిలోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని సమాధి నుంచి బయటకు తీసుకొచ్చిన ఘటన తాళ్లూరు మండలం విఠలాపురంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విఠలాపురంలో స్థానిక భూదేవి ఆలయం వద్ద కై పు కోటిరెడ్డి అనే వ్యక్తి తాను సజీవ సమాధి అవుతున్నానని చెప్పి అందుకు ఏర్పాట్లు చేసుకుని గుంత తవ్వి అందులోకి దిగి పైన రేకు వేసేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రజలు దానిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఎందుకు ఇలా చేస్తున్నావని గ్రామస్తులు అడిగితే ఈ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని, కులమతాలు లేకుండా అందరూ ఐకమత్యంతో మెలగాలని కోరుకుంటూ నేను దీక్ష తీసుకొని సజీవ సమాధి అవుతున్నానని చెప్పాడు. ఈలోపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతనిని లోపలి నుంచి బయటికి తీసి ఇకపై ఇటువంటి పనులు మళ్లీ చేయవద్దంటూ హెచ్చరించారు. ఇదంతా ప్రచారం కోసం చేసిన ప్రయత్నమని ఎస్సై మల్లికార్జునరావు తెలిపారు. అతను ఆరోగ్యంగానే ఉన్నాడు.
రాష్ట్రంలో బీజేపీ అజెండా అమలు చేస్తున్న కూటమి
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్రంలో బీజేపీ అజెండాను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే సైదా విమర్శించారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైదా మాట్లాడారు. ఒంగోలు నగరంలోని కబాడీపాలెం వద్ద ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం కూల్చివేయడం దారుణమన్నారు. తమకు సమాచారం ఇస్తే తామే ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసేవారిమన్నారు. విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి ఏర్పాటు చేయకపోతే ఉద్యమం నిర్వహిస్తామన్నారు.

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు