పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్ ద్వారా రుణాలకు కూటమి సర్కారు హామీ
ధాన్యం బకాయిలతోపాటు ఖరీఫ్‌లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఇసుక, గనుల విధానాలు రద్దు.. మెరుగైన పంటల బీమాపై ముగ్గురు మంత్రులతో కమిటీ
‘ఉచిత’ ఇసుకపై జారీ చేసిన జీవో–43కి ఆమోదం.. 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రూ.5,200 కోట్ల రుణం పొందేందుకు పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్‌లకు అనుమతినిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతుల మేలు కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత రబీలో ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపులతో పాటు 2024–25 సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ రుణాన్ని వినియోగిస్తామని తెలిపింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
అప్పులు మినహా మరో మార్గం లేదు..
రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇటీవలే రూ.1,000 కోట్లు విడుదల చేశాం. మరో రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రూ.2 వేల కోట్ల రుణం పొందేందుకు పౌర సరఫరాల సంస్థను అనుమతిస్తూ గత నెల 28వ తేదీన ప్రభుత్వం జీవో నెం.6 జారీ చేసింది.
ఈ రుణం కోసం ప్రభుత్వ హామీ కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25లో ధాన్యం కొనుగోలు కోసం వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి ప్రభుత్వ హామీతో రూ.3,200 కోట్ల కొత్త రుణం కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలను సవరించి మెరుగైన విధానం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మేలు చేసేందుకు అప్పులు చేయడం మినహా మరో మార్గం లేదు. ఉచిత పంటల బీమా స్థానంలో మెరుగైన పంటల బీమా పథకాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏర్పాటయ్యే కమిటీ నెల రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, గనుల పాలసీలు రద్దు
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ 2022 చట్టం రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇసుక, గనుల పాలసీ 2019, మరింత మెరుగైన ఇసుక విధానం 2021ని రద్దు చేయడంతో పాటు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్æ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం 2024 తెస్తాం.
ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తూ ఈ నెల 8న జారీ చేసిన జీవో నెం.43 ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రానికి గుల్బెంకియన్ అవార్డు రావటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో అమలులో ఉన్న ప్రకృతి సాగును 2029 నాటికి కనీసం 20 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
కౌన్సిల్‌లో బలం లేదు.. నిజమే
‘‘కౌన్సిల్‌లో మాకు బలంలేని మాట వాస్తవమే. అయితే అసెంబ్లీలో చేసిన చట్టాలను కౌన్సిల్ అడ్డగించే అవకాశం లేదు కదా?’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి మద్దతిచ్చిన టీడీపీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించగా నాడు విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇచ్చారని ఎదురు ప్రశ్నించారు.
హౌసింగ్‌లో అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సంపద సృష్టి విషయంలో కట్టుబడి ఉన్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్ మొదలైందని మంత్రి చెప్పారు. కేవలం నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. భూముల ధరలు కనీసం రూ.ఐదారు లక్షలకు పైగా పెరిగాయన్నారు. ఎయిర్, రైల్ ట్రాఫిక్ 30 శాతం పెరిగిందన్నారు.
ఇసుకలో తలదూర్చొద్దు!
ఇసుక వ్యవహారాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి కొంతకాలం సజావుగా సాగనివ్వాలన్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో వివిధ రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉందని, వచ్చే 3 నెలలకు కోటి టన్నుల ఇసుక అవసరమని చెప్పారు.
అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొత్త విధానాన్ని తెద్దామన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తావనకు రావడంతో కొన్ని విషయాలు వాళ్లతో మాట్లాడాల్సి ఉందని, అవన్నీ బయటకు చెప్పలేనని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ కార్యక్రమాలను కొందరు సరిగా జనంలోకి తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఆగస్టు ఒకటో తేదీన ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు.
ఐదు రోజులు అసెంబ్లీ
ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును ఈ సమావేశాల్లోనే పెడదామని చెప్పారు. పంటల బీమా పథకం అమలు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతుల్ని మోసం చేసిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ.1,600 కోట్లు రుణం తెచ్చి రూ.వెయ్యి కోట్లు మాత్రమే రైతులకిచ్చారని, మిగతాది ఎక్కడుందో తెలుసుకోవాల్సి ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ బియ్యం ఎగుమతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్లు తెలిసింది. కిలో రూ.43 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన సూచించగా వచ్చే మంత్రివర్గం సమావేశం నాటికి దీంతోపాటు భూ అక్రమాలపైనా విచారణకు ఆదేశించడంపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment