- మార్క్‌ఫెడ్ నెత్తిన మల్టీప్లెక్స్ భారం
- రూ.450 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం
- సంస్థ వద్ద నిధుల్లేవు.. రుణాలింకా మంజూరు కాలేదు
- డీపీఆర్‌లు లేకుండానే అంచనా వ్యయంలో 25 శాతం చెల్లింపు
- వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు తెచ్చిన రుణాల వినియోగం!
- కమీషన్ల కోసం పాలకమండలి కక్కుర్తి
- వెనకుండి నడిపిస్తున్న అధికార పార్టీ నేతలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రైతులకు సేవలు చేయాల్సిన మార్క్‌ఫెడ్ దారి తప్పుతోంది. కమీషన్ల కక్కుర్తితో ‘కమర్షియల్’ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకొని వేగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. పూర్తయిన నిర్మాణాలను కారుచౌకగా కొట్టేయడానికి అధికార పార్టీ నేతలు వ్యూహం పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్కెఫెడ్‌కు విజయవాడతోపాటు రాష్ట్రంలోని మరో ఐదు ప్రాంతాల్లో విలువైన స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో విజయవాడలో ఉన్న స్థలంలో మల్టీప్లెక్స్, మిగిలిన చోట్ల కల్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని మార్క్‌ఫెడ్ పాలకమండలి ఇటీవల తీర్మానించింది. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. విలువైన మార్క్‌ఫెడ్ స్థలాలు కొట్టేయడానికి ఇదో రాచమార్గమని, రుణాలు తీసుకొని మార్కెఫెడ్ నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత వాటిని చౌకగా లీజుకు తీసుకోవాలని వ్యూహం రూపొందించినట్లు తెలిసింది.
నిర్మాణ పనులు చేపడితే భారీగా కమీషన్లు కొట్టేయడానికి పాలకవర్గం.. అధికార పార్టీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే పాలకమండలి తీర్మానం చేసిన మరుసటి రోజే.. కన్సల్టెంట్ ఫీజు పేరిట రూ. 2.5 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మంతా పాలకవర్గం సభ్యులే నొక్కేశారని మార్క్‌ఫెడ్‌లో ప్రచారం జరుగుతోంది. తీర్మానం చేసి 10 రోజులు తిరగకముందే.. ప్రాజెక్టు నివేదికలు సిద్ధం కాకపోయినా, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(ఈపీఐ)కి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. కన్సల్టెంట్ ద్వారా మొత్తం అంచనా వ్యయంలో 25 శాతం(రూ. 110 కోట్లు) చెల్లించారు.
ఈ అడ్డగోలు చెల్లింపులను సంస్థలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, పాలకమండలి, ఎండీ, జీఎం కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తూ చేసేది లేక మౌనంగా ఉండిపోతున్నారు. అందరూ కుమ్మక్కు కావడం వల్లే ఈ మొత్తం చెల్లించగలిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు, ప్రభుత్వం ఎంపిక చేసిన నోడల్ ఏజన్సీలకు యూరియాను నిల్వ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీపై వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల నుంచి ఈ రూ.110 కోట్లు చెల్లించడం గమనార్హం.
ప్రభుత్వ అనుమతి లేకుండానే..
భారీ ప్రాజెక్టులు.. అవి కూడా వాణిజ్య కార్యకలాపాలు చేయడానికి నిర్మించే వాటికి ప్రభు త్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన ఉంది. ఒకవేళ అనుమతి లభించకపోతే భారీ కమీషన్లు పోతాయనే భయంతోనే హడావుడిగా సొమ్ములు చెల్లించేస్తున్నారని సమాచారం. అసలు వ్యాపారం వదలి కొసరు వ్యాపారం చేయడానికి ప్రభుత్వం నుంచి అ నుమతులు ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని అధికార పార్టీ నేతలు గట్టిగా హా మీ ఇవ్వడం వల్లే.. పాలకవర్గం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది.
ప్రాథమిక దశలోనే ఉంది
కమర్షియల్ ప్రాజెక్టు చేపట్టాలని పాలకమండలి తీర్మానం చేసిన మాట నిజమే. ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రాజెక్టు కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం.
- మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు
బ్యాంకులు రుణాలిస్తాయనే గ్యారంటీ లేదు
మార్క్‌ఫెడ్ చేపడుతున్న భారీ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు రుణాలు ఇవ్వడానికి ఏ బ్యాంకూ ముందుకు రాలేదు. గత 10 రోజులుగా అన్ని బ్యాంకులతో సంస్థ పాలకమండలి మాట్లాడినా ఫలితం లేదు. అయినా సరే ఏదో విధంగా రుణం అందుతుందనే నమ్మంతో ప్రస్తుతం సంస్థ వద్ద ఉన్న ఇతర రుణాలను మళ్లించడం గమనార్హం. భారీ ప్రాజెక్టు చేపట్టే ముందే ఆర్థిక వనరులను సమీక్షించుకోకపోవడాన్ని కిందిస్థాయి అధికారులు తప్పుబడుతున్నారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా ఏదో సంస్థను కన్సల్టెంట్ ద్వారా ఎంపిక చేసుకొని, భారీగా సొమ్ము చెల్లిస్తే మునిగిపోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.