గుంటూరు ఈస్ట్: తెలంగాణ ప్రభుత్వం లక్షలాదిమంది ప్రేక్షకుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సినిమా థియేటర్‌లలో మల్టీప్లెక్స్ దోపిడీకి చెక్ పెట్టింది. కాని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం పట్టించుకోవడం లేదు. అయితే విజయవాడలో కొందరు ప్రేక్షకులే వినియోగదారుల ఫోరంలో కేసువేసి అధిక ధరలపై విజయం సాధించడం గమనార్హం. రాజధాని నగరమైన గుంటూరులో కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఫోరంలో కేసు వేస్తే తప్ప మల్టీ దోపిడీకి తెరపడేలా లేదు.
మల్టీప్లెక్స్ థియేటర్‌లలో సినిమా టిక్కెట్ ధరను మించి తినుబండారాల ధరలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ, ప్రేక్షకుల నడ్డి విరుస్తున్నారు. దీనికి తోడు ప్రధాన ద్వారం వద్దే తనిఖీలు చేసి మంచినీళ్ల బాటిళ్లు, తినుబండారాలు, చివరకు వక్కపొడి ప్యాకెట్లు కూడా లాక్కుంటున్నారు. చివరకు చేతిలో బ్యాగుకు పది రూపాయలు వసూలు చేయడమే కాక, హెల్మెట్లను లోపలకు అనుమతించడం లేదు. ఇదేమని అడిగితే దురుసుగా సమాధానం చెబుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ల క్యాంటీన్‌లో పిజ్జా 150 నుంచి 200 రూపాయలు, కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ రూ.90 నుంచి రూ.100 రూపాయలకు విక్రయిస్తున్నారు. బయట 10 రూపాయలు ఉండే సమోసా ఇక్కడ 40 రూపాయలు, కూల్‌డ్రింక్ 60 నుంచి 70 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వాటర్‌బాటిల్స్‌ను వారిష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు.వాస్తవానికి ఎమ్మార్పీ ధర కంటే అదనంగా వసూలు చేయడం తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు విరుద్ధం.
చిన్నపిల్లలని కూడా చూడకుండా...
చిన్న పిల్లలతో, అనారోగ్యంతో ఉన్న ప్రేక్షకులను సైతం వదలకుండా వాటర్ బాటిళ్లు, తినుబండారాలు లాక్కోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కృత్తికా శుక్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో సినిమాహాళ్లలోకి తినుబండారాలు అనుమతించాలని ఆదేశించారు. అనుమతించకపోతే తనకు ఫోన్ చేయాలని కోరారు. సినిమా హాళ్ల యజమానులు ఈ ఆదేశాన్ని బేఖాతరు చేస్తున్నారు.
హైదరాబాద్, తమిళనాడులనుఎందుకు ఆదర్శంగా తీసుకోరు?
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1 నుంచి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలన్నీ ఎమ్మార్పీ ధరలకు విక్రయించేలా కఠినమైన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే వాహనాల పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయడం లేదు. తమిళనాడులోనూ ఇదే తరహాలో ప్రభుత్వం కఠినచర్యలు అమలు చేయడం ప్రారంభించింది. ప్రతిదానికి హైదరాబాద్‌తో పోల్చి అంతకంటే గొప్పగా పాలన చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి మల్టీప్లెక్స్ దోపిడీ గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధరలు సామాన్యులకుఅందుబాటులో ఉండాలి
థియేటర్‌లలో సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా ఆహార పదార్ధాలు విక్రయించాలని థియేటర్ యజమానులకు సూచించాం. గ్రీన్ చానల్‌లో శీతల పానీయాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటిని బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకే విక్రయించాలని సూచించాం. పార్కింగ్ రుసుం నామమాత్రంగా విధించాలని చెప్పాం. మల్టీప్లెక్స్ థియేటర్‌లలో పార్కింగ్ రుసుం వసూలు చేయకూడదన్న ఉత్తర్వులు మాకు ప్రభుత్వం నుంచి అందలేదు.– జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్
Comments
Please login to add a commentAdd a comment