'సివిల్ సప్లైస్..' వెరీ మైనస్
'సివిల్ సప్లైస్..' వెరీ మైనస్
Published Mon, Nov 7 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
* గాడితప్పిన పౌర సరఫరాల శాఖ
* నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న సీఎస్‌డీటీలు
* కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి
* సిబ్బంది తీరుపై నిప్పులు చెరిగిన ఇన్‌చార్జి జేసీ
* నేడు అధికారులతో పునః సమీక్ష
జిల్లాలో పౌర సరఫరాల వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన చెరుకూరు శ్రీధర్.. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించడంతో ఈ శాఖపై దృష్టి సారించలేకపోయారు. ప్రస్తుతం ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న ముంగా వెంకటేశ్వరరావు సైతం పుష్కరాలు, సీఎం పర్యటనలు, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు విచ్చలవిడిగా తరలిపోతున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో : పౌర సరఫరాల శాఖపై అజమాయిషీ కొరవడడంతో సిబ్బంది మొక్కుబడిగా పనిచేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు, పోలీసు సిబ్బంది పెట్టే కేసులు తప్ప.. పౌర సరఫరాల సిబ్బంది నమోదు చేసేవి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఇన్‌చార్జి జేసీ శనివారం వరిధాన్యం సేకరణపై మిల్లర్లు, పౌర సరఫరాల సిబ్బంది, వ్యవసాయ, సహకార శాఖ సిబ్బంది, వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులు, సీఎస్‌డీటీలతో ప్రత్యేకంగా సమీక్షించారు. కిరోసిన్ హాకర్స్‌ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. 6ఏ కేసులపై ఆర్డీవోలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఎస్‌వో చిట్టిబాబు మాట్లాడుతూ.. కొంతమంది సీఎస్‌డీటీలు తన మాట వినడం లేదని, సరిగా రెస్పాండ్ కావడం లేదంటూ ఇన్‌చార్జి జేసీకి విన్నవించారు. దీంతో ఆయన సిబ్బంది పనితీరుపై నిప్పులు చెరిగారు. ‘ మీరెవరూ పనిచేయడం లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. డీటైల్ రివ్యూ చేస్తా.. మీరు ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు తీసుకురండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌చార్జి జేసీ వెంకటేశ్వరరావు సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఎస్‌వో చిట్టిబాబు సమావేశాన్ని కొనసాగించారు. కైజాల యాప్ వాడుకలో జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు తెలిసింది. డీఎస్‌వో తప్ప మిగతావారు దీనిని సక్రమంగా వినియోగించడం లేదని సమాచారం.
నీరుగారుతున్న కేసులు..
ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరుకు డీలర్‌కు చేర్చడం, పంపిణీ సక్రమంగా జరుగుతుందా.. టైంటేబుల్ ప్రకారం రేషన్ షాపు తెరుస్తున్నారా.. తూకాల్లో ఏదైనా తేడా ఉందా.. వంటి విషయాలు సీఎస్‌డీటీలు చూడాలి. దీంతోపాటు ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌లు, ఈ– పాస్ మిషన్లు పనిచేస్తున్నాయా.. లేదా అనేది పర్యవేక్షించాలి. ఇందులో భాగంగా ప్రతి నెల సీఎస్‌డీవోలు 10, ఏఎస్‌వోలు 5 షాపులను విధిగా తనిఖీ చేసి తేడాలుంటే కేసులు నమోదుచేయాలి. ఈ ప్రక్రియ జిల్లాలో సక్రమంగా జరగలేదన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ నమోదుచేసిన కేసుల్ని సైతం జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కనుసన్నల్లో నీరుగార్చుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవకతవకలను కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా ఈ సీటులోనే తిష్ట వేసినట్లు శాఖ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement