సాక్షి, బెంగళూరు: కోవిడ్ ముప్పును అడ్డుకునేలా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, అందుకు కఠిన చర్యలు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. కోవిడ్ టీకా వేసుకోని వారికి రేషన్ వితరణ చేయరాదని పౌరసరఫరాల శాఖ సంకల్పించింది. చాలామంది మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ తీసుకోవడం లేదు. రెండో టీకా తీసుకోవాలని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోని కార్డుదారులకు రేషన్ ఇచ్చేది లేదని డీలర్లు బోర్డులు ప్రదర్శించాలని పలుచోట్ల తహసీల్దార్లు ఆదేశించారు. రేషన్‌దారులు టీకా తీసుకున్నట్లు ప్రమాణపత్రం, లేదా మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించాలి. అలాగైనా కచ్చితంగా టీకాలు తీసుకుంటారని భావిస్తున్నారు. చింతామణి తాలూకా తహసీల్దార్ హనుమంతరాయప్ప రేషన్ దుకాణాల డీలర్లతో దీనిపై సమావేశం నిర్వహించారు. కరోనా మూడో దశ రాకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమన్నారు.
టీకా వాహనాలు ప్రారంభం..
గ్రామీణప్రాంతాల్లో వాహనాల్లో సంచరిస్తూ అర్హులైన వారికి కోవిడ్ టీకాలను ఇవ్వాలని సీఎం బసవరాజ బొమ్మై సూచించారు. ఈ మేరకు బుధవారం నగరంలో టీకా వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైసూరు మేయర్ పీఠం మొదటిసారిగా బీజేపీకి దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లి గురువారం కొందరు కేంద్ర మంత్రులతో సమావేశమై పెండింగ్‌లో ఉన్న పథకాల పట్ల చర్చిస్తానన్నారు. వినాయక చవితిని ఘనంగా నిర్వహించాలన్న డిమాండ్లపై సీఎం స్పందించలేదు. మంత్రులు గోవిందకారజోళ, మురుగేశ్‌నిరాణి, బీసీ.పాటిల్ పాల్గొన్నారు. కాగా, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఒక నెలలోగా క్లియరెన్స్ చేయాలని సీఎం ఆదేశించారు. ఏడాదికి పైబడి పెండింగ్‌లో ఉన్న అన్ని ఫైళ్లను పరిష్కరించాలన్నారు.
కరోనా టెస్టులు పెరగాలి..
కరోనా మూడో దశ నియంత్రణకు ముందు జాగ్రత్తగా టెస్టులను పెంచాలని ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. జిల్లాల వారి కోవిడ్ పరీక్షల సంఖ్య పెరగాలి. మొత్తం పరీక్షల్లో 10 శాతం 18 ఏళ్లులోపు వారికి నిర్వహించాలి. 50 శాతం పరీక్షలను తాలూకా కేంద్రాల్లో నిర్వహించాలని అధికారులకు సూచించారు.
చదవండి: దారుణం: మద్యం తాగి యువతిపై సామూహిక అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment