
తగ్గిన బియ్యం లిఫ్టింగ్!
65 శాతం రేషన్ కోటాకే డీడీలు అందులో సైతం మిగులు
గ్రేటర్‌లో ఈ-పాస్ ప్రభావం
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్ధలో ఈ-పాస్ అమలుతో పేదల బియ్యం లిఫ్టింగ్ తగ్గిపోయింది. ప్రభుత్వం ఆహార భద్రత(రేషన్) కార్డు కుటుంబాలకు సరిపడు కోటా కేటయిస్తున్నా... పూర్తి స్థాయి కోటాను ఎత్తేందుకు డీలర్లు ముందుకు రావడం లేదు. తాజాగా చౌకధరల దుకాణాల్లో ఈ -పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి కళ్లెం వేసినట్లయింది. ఈ-పాస్ ప్రభావంతో బియ్యం కోటా లిఫ్టింగ్ తగ్గుతోంది. అందులో సైతం మిగులుబాటు విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా మూడేళ్ల క్రితం నుంచే నగరంలోని 45 చౌకధరల దుకాణాల్లో ఈ-పాస్ అమలవుతుండగా వాటిని విస్తరించకుండా అడుగడుగున అడ్డంకులు తప్పలేదు. తాజాగా ప్రభుత్వం ఈ-పాస్‌పై నిర్ణయం తీసుకోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు. ఇతర ఎన్నికలంటూ గత ఆరు నెలల పాటు కాలయాపన జరిగింది. తాజాగా ఈ-పాస్ పూర్తి స్థాయిలో అమలులోకి రావడంతో డీలర్లు ఏకంగా పీడీఎస్ బియ్యం లిఫ్టింగ్‌ను తగ్గించివేశారు.
95 నుంచి 65 శాతం తగ్గిన లిఫ్టింగ్
ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు బియ్యం కోటా లిఫ్టింగ్‌ను 95 నుంచి 65 శాతానికి తగ్గిం చారు. అయినప్పటికి అందులో సైతం 35 శాతం వరకు కోటా ఆదా అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖకు మొత్తం 12 అర్బన్ సర్కిల్స్ ఉండగా వాటి పరి ధిలో 1543 ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. మొత్తం 13.57 లక్షల కార్డుదారులు ఉండగా అందులోని 45.49 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఆహార భద్ర త పథకం కింద కార్డులోని ప్రతి యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటాను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇక చౌకధరల దుకాణాల నిర్వాహకులైన డీల ర్లు ప్రతి నెల 95 శాతం వరకు బియ్యం కోటా ను లిఫ్టింగ్ చేసి చేతివాటంతో 8 నుంచి 10 శాతం వరకు మిగులుబాటు చూపించడం అనవాయితీ. సరిగా రెండు నెలల క్రితం అంటే మార్చి 15 న ఈ-పాస్ ద్వారా సరుకుల పం పిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే సగం మాసం పాత పద్దతిపై పంపిణీ జరగడంతో కొంత గోల్‌మాల్‌కు వెసులుబాటు కలిగింది. ఏప్రిల్ మాసంలో మాత్రం సాధ్యమయ్యే పరి స్థితి లేకపోవడంతో కేటాయించిన కోటాలో బియ్యం లిఫ్టింగ్ పూర్తిగా తగ్గించారు.
మిగులు ఇలా....
ఈ-పాస్ అమలుకు మందు అంటే జనవరి మాసంలో మొత్తం 14.049 లక్షల కార్డుదారులు ఉండగా 2 లక్షల 97 వేల 547 క్వింటాళ్ల బియ్యం కోటాకు గాను మిగులుబాటు మినహాయించి 27 లక్షల 86 వేల 36 క్వింటాళ్లు కేటాయించారు. అందులో 95 శాతం కోటాను డీలర్లు లిఫ్టింగ్ చేసి 8 శాతం వరకు మిగులుబాటు చూపిం చారు. ఇక ఈ-పాస్ అమలు ప్రారంభం అనంతరం గత నెల ఎప్రిల్‌లో 13.57 లక్షల కార్డులకు గాను 28631343 కిలోలు అవసరం ఉండగా మిగిలుబాటు మినహాయించి 25748349 కిలోల కోటాను కేటాయించారు. అందులో కేవలం 65 శాతం కోటా లిఫ్టింగ్ చేయగా 35 శాతం పైగా బియ్యం మిగులుబాటైంది. ఈ-పాస్ ప్రకారం ఏప్రిల్ మాసంలో 13.57 లక్షల కార్డుదారులకు గాను 8.51 లక్షల కార్డుదారులు మాత్రమే బియ్యం తీసుకున్నట్లు రికార్డయింది. తాజాగా ఈనెల ఇప్పటి వరకు కేవలం 6.17 లక్షల కార్డుదారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్ రికార్డులు స్పష్టమవుతున్నాయి. దీంతో ఈ-పాస్ డీలర్ల చేతివాటానికి పూర్తిగా కళ్లెం వేసినట్లు కనిపిస్తోంది.