
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), ఇతర సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన కంది పప్పును తక్కువ ధరకు అందజేస్తామన్న మార్క్‌ఫెడ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. పీడీఎస్ ద్వారా కంది పప్పు సరఫరా చేయడంలేదని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు తీసుకునేది లేదని చేతెలెత్తేసింది. దీంతో గోదాముల వారీగా 25 గిడ్డంగుల్లో ఉన్న నిల్వలను విక్రయించాలని నిర్ణయించారు.రైతుల నుంచి క్వింటాకు రూ. 5,450కు కొనుగోలు చేయగా, రూ. 3,450కే అమ్మడానికి సిద్ధమయ్యారు. అంటే రూ. 2 వేల నష్టానికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పేరుకుపోయిన 11.29 లక్షల క్వింటాళ్లు
2017–18లో రైతుల నుంచి క్వింటాకు రూ. 5,450 కనీస మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ కందులు కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద 11.29 లక్షల క్వింటాళ్ల నిల్వలున్నాయి. వాటిని ఇప్పుడు విక్రయించాలంటే క్వింటాలుకు రూ. 3,450కు మించి కొనడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదు. త్వరలో ఈ ఖరీఫ్‌లో పండే కందులూ మార్కెట్లోకి రానున్నాయి. వాటిని కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాలి. కందులను పప్పు చేసి కిలో రూ. 50 వంతున పేదలకు, ఇతర వినియోగదారులకు అందజేస్తామని నిర్ణయించింది. ఒక కేజీ, ఐదు కేజీలు, పది కేజీలు, 25 కేజీల బ్యాగుల్లో ప్యాక్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై సర్కారు నో అనడంతో మళ్లీ నష్టానికే టెండర్లు పిలిచి అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment