చవితి పాయసం చేదు!
రేషన్ దుకాణాలకు చేరని చక్కెర
- పాయసానికి తీపి కరువు
- పట్టించుకోని యంత్రాంగం
ఘట్‌కేసర్ టౌన్ /వికారాబాద్ రూరల్: చవితి పండుగకు పేదోడికి పాయసం చేదెక్కినట్టే అనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న చక్కెర నేటికి రేషన్ దుకాణాలకు చేరుకోలేదు. దీంతో జనాలకు తిప్పలు తప్పేట్టు లేదు. గత నెలలో జరిగిన రంజాన్ పండుగకు నెలకు ఇచ్చే చక్కెరతో పాటు అదనంగా అరకిలో చక్కెరను అందజేసిన సర్కార్ చవితి పండుగకు మాత్రం మొండిచేయి చూపింది. ఎప్పటిలాగే నెలవారీగా ఇచ్చే చక్కెర కూడా గత నెలలో సగానికి పైగా అందలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పౌర సరఫరా శాఖ గోదాముల్లో నిల్వలు లేకపోవడంతో రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేదని తెలుస్తోంది. మూడు రోజుల్లో చవితి పండుగ ఉండగా యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం. ఘట్‌కేసర్ మండలంలో 32,000 వేలు, జిల్లా మొత్తం 11.6 లక్షల ఆహార భధ్రత కార్డులున్నాయి.
పేదోడిపై భారం...
చవితి పండుగ పాయసం తయారీకి చిన్న కుటుంబానికి అయినా కిలో చక్కెర తప్పనిసరి. సివిల్ సప్లై ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆహార భద్రత కార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి అరకిలో చక్కెరను సర్కారు అందజేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో చక్కెర రూ. 30లు ఉండగా రేషన్‌షాపుల ద్వారా అరకిలో చక్కెరను రూ. 6.75లకు అందజేస్తోంది. ప్రతినెల 25 నుంచి డీలర్ల నుంచి డీడీలు స్వీకరించి ఒకటో తేదీ నాటికే రేషన్ దుకాణాలకు సరుకులు అందేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ముందు చూపు లేని ప్రభుత్వానికి అధికారుల నిర్లక్ష్యం తోడు.. గోదాములు నిండుకోవడంతో రేషన్ దుకాణాలకు చక్కెర నేటికి చేరుకోలేదు. దీంతో ప్రజలపై భారం తప్పేలా లేదు. జిల్లా ప్రజలకు చవితి పండుగకు సుమారు రూ. 35 లక్షలకు పైగా భారం పడనుంది. కాగా, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని పండుగల విషయమై అత్యుత్సాహం చూపిస్తున్న సర్కార్ చవితి పండుగను పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పండుగకు అందజేస్తాం...
చక్కెర నిల్వలు లేని కారణంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేకపోయాం. చవితిని దృష్టిలో ఉంచుకొని టెండర్ల ప్రక్రియను తొందరగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆదేశానుసారం చవితి పండుగకుఅరకిలో చక్కెరను అందజేస్తాం. అదనంగా ఇవ్వాలని ఆదేశాలు రాలేదు. ప్యాకింగ్ చేసే సమయం లేనందున డీలర్లకు నేరుగా సంచుల్లోనే పంపిస్తాం.
- సత్యం, జిల్లా సివిల్ సప్లయి అధికారి