► రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పామాయిల్ నిల్
► కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్‌తోనే సరి
► ఏడాదిగా పేదల కడుపు కాల్చుతున్న సర్కారు
► పండగ సమయాల్లో మాత్రమే హడావుడి
తెనాలిఅర్బన్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయమంటున్న ప్రభుత్వం వారి మనుగడకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీని సమర్థంగా అమలు చేయలేకపోతోంది. పండగల సమయంలో మాత్రం పప్పు, బెల్లాలు పంపిణీ చేసి చంకలు కొట్టుకుంటున్న ప్రభుత్వం, నిత్యావసరాల పంపిణీ కుంటుపడినా పట్టించుకోవటం లేదు. కొత్త ప్రభుత్వంలో కందిపప్పు, పామాయిల్ మచ్చుకైనా సరఫరా చేయకపోవటం ఈ పరిణామాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. సబ్సిడీ భరించలేకే సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ వైనా నికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రధానంగా జాతీయ ప్రజా పంపిణీ విధానం ద్వారా ప్రతినెలా పేదలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, పంచదార, గోధుమలు, కిరోసిన్ తదితరాలను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలుత రేషన్‌కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. తాజాగా ఈ-పాస్ విధానాన్ని మున్సిపల్ కేంద్రాల్లో అమల్లోకి తెచ్చింది. పురిట్లోనే అవరోధాలు ఎదుర్కొన్న ఈ విధానాన్ని ప్రభుత్వం ఏదోలా సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడుతోంది.
త్వరలో గ్రామాల్లోనూ అమలుకు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. అసలు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, పామాయిల్ సంవత్సర కాలంగా లబ్ధిదారులకు దక్కని పరిస్థితిని చక్కదిద్దాల్సిందిపోయి సంస్కరణలు ఏమిటని ఇప్పుడు పేదలు నిలదీస్తున్నారు. దాదాపు సంవత్సర కాలంగా పామాయిల్, కందిపప్పు, గోధుమలు పంపిణీ లేదు. కేవలం బియ్యం, పంచదార, కిరోసిన్ మినహా మిగిలిన సరుకులన్నీ పేదలకు దూరమయ్యాయి.
పండగలకు పప్పుబెల్లాలతోనే సరా...
సంక్రాంతి పండగను పురస్కరించుకుని ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరిట ప్రభుత్వం హడావుడి చేసిన సంగతి తెలిసిందే. నెయ్యి, నూనె, శనగలు, బెల్లం, కందిపప్పు వంటి సరుకులను ఓ ప్యాకేజీగా అందించింది. దానిలోనూ నాణ్యత డొల్లేనన్న విమర్శలూ లేకపోలేదు. అయితే పండగలకు హడావుడి చేసిన ప్రభుత్వం పేదల రోజువారీ జీవన విధానాన్ని విస్మరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పండగలకు అందించిన పప్పుబెల్లాలు సంవత్సరమంతా కడుపునింపుతాయా అంటూ ఇప్పుడు పేదలు నిలదీస్తున్నారు.
సబ్సిడీ భరించలేకే....
దాదాపు సంవత్సరకాలంగా కందిపప్పు, పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించేది, వారు చేతులెత్తేశారు. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దానిపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. -చిట్టిబాబు, డీఎస్‌వో, గుంటూరు
కూరలేని అన్నం..!
Published Mon, May 18 2015 2:25 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement