సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్ దుకాణాల్లో పేదలకు సబ్సిడీపై పంపిణీ చేసే సరుకులను ఇప్పటికే ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇక ఆ బాధ్యత నుంచి కూడా తప్పుకుని ప్రైవేట్ కంపెనీలకు వదిలేయాలని నిర్ణయించింది. అది కూడా తన సొంత కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు చెందిన రూ.200 షేరును రూ.900 పెట్టి కొనుగోలు చేసిన ప్యూచర్ కంపెనీకి మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను కట్టబెడుతుండటం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా 29,000 చౌకధరల దుకాణాలను దశలవారీగా ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన పౌరసరఫరాలశాఖ సమీక్ష సమావేశంలో తొలివిడతలో 6,500 ‘అన్న విలేజ్ మాల్స్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తక్కువ ధరతో నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యం కావాలని సూచించారు. ‘ఫ్యూచర్’, ‘రిలయన్స్’ గ్రూపుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ‘అన్న విలేజ్ మాల్స్’ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రత్యేకంగా లోగో రూపొందించాలని సూచించారు. ప్యూచర్ గ్రూప్‌లో సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి 3 శాతం వాటాలు ఇప్పటికీ ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించటానికి కేవలం ఒక్క రోజు ముందుగా హెరిటేజ్ తన షేర్లను ఒక్కసారిగా రూ. 900కి పెంచి ప్యూచర్ గ్రూప్‌నకు విక్రయించింది. అప్పట్లో ఈ ఒప్పందం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది.
ఖాళీగా ఉన్న 4,599 షాపులకు డీలర్ల నియామకం
రేషన్ బియ్యం’ తమకు వద్దు అనుకునే తెల్లకార్డుదారులకు అంతే విలువైన నగదును ‘అన్న విలేజ్ మాల్స్’లో అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎవరైనా తమ ఉత్పత్తులను ‘అన్న విలేజ్ మాల్’లో విక్రయించుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఖాళీగా వున్న 4,599 చౌకధరల దుకాణాలకు వెంటనే డీలర్లను నియమించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో లబ్ధిదారులకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసినా తెల్ల రేషన్ కార్డుదారులకు మార్కెట్ ధర కన్నా 50% తక్కువకు నెలకు అర కిలో పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను జత చేయాలని చెప్పారు. ప్రత్యేక అవసరాలు కలిగిన కూరాకుల, రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి తెల్ల కిరోసిన్ ఇవ్వాలని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినప్పుడు బోగస్‌వి జారీ కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఒక్కొక్కటిగా సరుకుల ఎత్తివేత
గతంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్‌తోపాటు అదనంగా కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, గోధుమలు, ఉప్పు, చక్కెర, చింతపండు, కారం పొడి, పసుపు లాంటి తొమ్మిది రకాల సరుకులను సంచుల్లో ఒక్కో లబ్దిదారుడికి సబ్సిడీపై రూ. 185కే పంపిణీ చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటికీ మంగళం పాడారు. కేవలం బియ్యం మాత్రమే సరఫరా జరుగుతోంది. ఇన్నాళ్లూ పేదలకు అండగా ఉన్న చౌక ధరల దుకాణాలను ఇప్పుడు మాల్స్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తే భవిష్యత్తులో ఏ సరుకులు కొనాలన్నా జనం వాటి గుప్పెట్లో నలిగిపోయే ప్రమాదం నెలకొంది.
– ‘అన్న విలేజ్ మాల్స్’ కనీసం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు.
– ‘అన్న విలేజ్ మాల్స్’కు అయ్యే వ్యయంలో 25% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు మరో 25% ‘ముద్ర’ రుణాన్ని డీలర్‌కు ఇప్పిస్తారు.
– డ్వాక్రా, మెప్మా, గిరిజన సహకార సమితి ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
– బందరు లడ్డు, కాకినాడ కాజా, పచ్చళ్లు లాంటివి కూడా లభిస్తాయని పేర్కొంది.
రేషన్ షాపులను కొనసాగించాలి
కార్పొరేట్ సంస్థల ద్వారా తక్కువ ధరకు సరుకులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నా రేషన్ షాపులను నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది రకాల సరుకులతోపాటు బియ్యం, చక్కెర, కిరోసిన్ కూడా సబ్సిడీపై సరఫరా చేసి పేదలను, రేషన్ డీలర్లను ఆదుకోవాలి.
–దివి లీలామాధవరావు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్, కామన్‌లో ‘లీలామాధవరావు’ అనే ఫైల్‌నేంతో ఫోటో ఉంది
Comments
Please login to add a commentAdd a comment