సర్కారుపై సమరం
రేషన్ డీలర్ల జీవనభృతి పట్టని ప్రభుత్వం
ఈ-పోస్‌తో గింజగింజకూ లెక్క
కమీషన్ పెంపుపై తాత్సారం
భారంగా మారిన చౌక డిపోల నిర్వహణ
ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన డీలర్లు
21 నుంచి నిరవధిక సమ్మెకు హెచ్చరిక
తెనాలి : ప్రజా పంపిణీ వ్యవస్థలో సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం రేషన్ డీలర్ల జీవన భద్రతపై దృష్టిపెట్టటం లేదు. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల నోటికి ‘ఈ-పోస్’ పేరిట సాంకేతిక చిక్కంతో చెక్ పెట్టి, వారి ఆదాయం పెంపుదలపై మాత్రం ప్రకటన చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా చౌకడిపోల నిర్వహణ భారంగా తయారైంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన డీలర్ల సంఘం సమరశంఖం పూరించేందుకు సమాయత్తమైంది. తమ కమీషను పెంపు/ వేతనాల నిర్ణయంపై చేసిన విజ్ఞప్తులకు సానుకూల స్పందన రాకుంటే ఈ నెల 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నోటీస్ అందజేసింది.
గింజగింజకూ లెక్క..
రేషన్ డీలర్లకు చాలీచాలని కమీషన్లు, పారదర్శకత లేని విధానాలే అక్రమాలకు ఆస్కారం కల్పించాయనేది వాస్తవం. అందులో అధికారుల వాటాలు, సరకుల టెండర్లు, ప్యాకింగ్ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు తమ వాటాలు పుచ్చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. సబ్సిడీ భారం తగ్గించుకునే ఎత్తుగడల్లో భాగంగా 15 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేసింది. సరకుల పంపిణీకి ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టి గింజగింజకూ లెక్కగడుతోంది.
ఇలాగైతే కష్టమే..
పెట్టుబడులకు, వస్తున్న కమీషన్‌కు లెక్కచూసుకుంటే చౌక డిపోల నిర్వహణ కష్టసాధ్యమనేది తేలిపోయింది. ప్రతి నెలా రెండు లక్షల టన్నుల బియ్యం, 6,500 టన్నుల చక్కెర, 40 వేల టన్నుల గోధుమలు, 13 వేల టన్నుల కందిపప్పు, 1.5 కోట్ల లీటర్ల కిరోసిన్ చౌకడిపోల్నుంచి సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 29 వేల రేషన్ డీలర్లు పెట్టుబడుల రూపంలో రూ.191.27 డీడీలు తీస్తుంటే, కమీషన్, మిగిలే ఖాళీ గోతాలతో ఆదాయం రూ.10.71 కోట్లు వస్తోంది. మొత్తం 2.59 లక్షల టన్నుల సరకుల అన్‌లోడింగ్ చార్జీలు రూ.1.55 కోట్లు, 29 వేల చౌకడిపోల అద్దె, కరెంటు చార్జీల (సగటున రూ.2000 వంతున)కు రూ.5.80 కోట్లు, సహాయకుడి జీతం (నెలకు రూ.2500 చొప్పున) రూ.7.25 కోట్లు కలిపి లెక్కిస్తే రూ.14.60 కోట్లు ఖర్చవుతోంది. కమీషను/గోతాల ఆదాయం రూ.10.71 పోగా, ఇంకా రూ.3.88 కోట్ల వరకూ నష్టం వస్తున్నట్టు రాష్ట్ర జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో డిపోల నిర్వహణ భారంగా తయారై, డీలర్లు అప్పులపాలవుతున్నారనీ, కమీషను పెంపుపై ఎంతోకాలంగా చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు.
కమీషన్ ఇంకా ‘పైసా’లే..
రేషన్ డీలర్ల ఆదాయాన్ని ప్రభుత్వం పైసలతోనే నిర్ణయిస్తుండటం చిత్రం. కిలో రూపాయి బియ్యానికి 20 పైసలు, కిలో రూ.13.50 చక్కెరకు 16 పైసలు, కిలో రూ.7 గోధుమకు 13 పైసలు, కిలో రూ.90 కందిపప్పునకు 55 పైసలు, లీటరు రూ.15 కిరోసిన్‌కు 25 పైసలు ప్రభుత్వం కమీషను రూపంలో చెల్లిస్తోంది. డీలర్లకు జీవనభద్రత కల్పించేందుకు రూ.15 వేల గౌరవ వేతనం, రూ.1500 అద్దె అలవెన్సు కింద చెల్లించాలని సమాఖ్య డిమాండ్ చేస్తోంది. తమ విజ్ఞప్తులకు ఈ నెల 20వ తేదీలోగా తగిన హామీ ప్రకటన రాకుంటే 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సమాఖ్య తీర్మానించి, దానిని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు అందజేశారు. ఆ ప్రకారం డీలర్లను సమాయత్తం చేసేందుకు సమాఖ్య నేతలు జిల్లాల పర్యటనను శనివారం ఆరంభించారు.