అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం!  | Eenadu Ramoji Rao Fake News Ration Distribution Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం! 

Published Mon, Oct 3 2022 3:57 AM | Last Updated on Mon, Oct 3 2022 2:48 PM

Eenadu Ramoji Rao Fake News Ration Distribution Andhra Pradesh - Sakshi

నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ. నిత్యావసరాల్లో కోత... అంటూ ఆదివారంనాడు ఆయన చేసిన ఆక్రందనలూ అందులో భాగమే. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేనాటికి ఉన్న రేషన్‌ కార్డులు 1.39 కోట్లు. ఇప్పుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉన్నవి 1.45 కోట్లు. అంటే... ఏకంగా 6 లక్షల కుటుంబాలు పెరిగినట్లు.

ఈ నిజాన్ని రామోజీరావు చెప్పరుగాక చెప్పరు. ఇక చంద్రబాబు ఏలిన ఐదేళ్లలోనూ కందిపప్పు, పంచదారపై నాటి ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రూ.568 కోట్లు. కానీ వై.ఎస్‌.జగన్‌ హయాంలో ఈ మూడేళ్లలోనే కందిపప్పు, పంచదార రేషన్‌ డిపోల్లో ఇవ్వటానికి ప్రభుత్వం చేసిన వ్యయం ఏకంగా రూ.1,891 కోట్లు.

ఈ రెండు లెక్కలూ చాలవూ... ఎవరి హయాంలో ఏం జరిగిందో కళ్లకు కట్టడానికి? కాకపోతే ఈ వాస్తవాలను ‘ఈనాడు’ కావాలనే చెప్పదు. పైపెచ్చు కందిపప్పు, పంచదారలో ప్రభుత్వం కోతపెడుతోందని రాస్తూ... చంద్రబాబు హయాంలో ప్రతినెలా ప్రతి కార్డుకూ కిలోలకు కిలోలు పంపిణీ చేశారనే గ్రాఫిక్స్‌ చూపించడానికి  పడరాని పాట్లు పడుతోంది. ఈ ముసుగులు తొలగిస్తూ... నిజానిజాలేంటో చెప్పే కథనమిది!. 


రాష్ట్రంలో 2014 నుంచీ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పామాయిల్‌ కేటాయింపులే లేవన్నది నిజం. 2020 డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు సబ్సిడీ కందిపప్పు ధర రూ.67కే స్థిరంగా అందిస్తున్నారని, ఎక్కడా పెంచలేదన్నది నిజం. కానీ వీటిని ‘ఈనాడు’ చెప్పదు. అయినా చంద్రబాబు హయాంలో పండగ కానుకలు ఎందుకిచ్చారో మీకు తెలియదా రామోజీరావు గారూ? పీడీఎస్‌ డబ్బుల్ని హెరిటేజ్‌ లాంటి కంపెనీలకు దోచిపెట్టడానికి కాదా? ఎలాంటి నిబంధనలూ లేకుండా... టెండర్ల ఊసే లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు మింగింది మీరందరూ కాదా? అసలు పేదలకు నాణ్యమైన సరుకులు ఇచ్చేందుకు ఏనాడైనా ప్రయత్నించారా? అప్పట్లో బియ్యాన్ని తీసుకున్నా తినగలిగే పరిస్థితి ఉండేదా? ఇప్పుడు మధ్యస్త సన్నరకం బియ్యాన్ని తీసుకుని ఖర్చుకు వెరవకుండా మరింత నాణ్యంగా సార్టెక్స్‌ చేసి అందిస్తుండటం నిజం కాదా? అప్పట్లో ఇన్ని అక్రమాలు జరిగినా ప్రశ్నించలేదెందుకు? పైపెచ్చు ఇప్పుడు ఇళ్లవద్దకే రేషన్‌ సరఫరా చేస్తున్న అద్భుతమైన వ్యవస్థపై కూడా... ఇంటి ముంగిటకు రాకుండా వీధి మలుపుల్లో ఉంటున్నారనే విమర్శలా? మరీ ఇంతలా దిగజారిపోతున్నారెందుకు రామోజీరావు గారూ? సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా నెలకొన్న పండగ వాతావరణం బాబుకు ఎదురవబోయే ఓటమిని ముందే చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా?  
 
ఇవీ... చంద్రబాబు లెక్కలు 
టీడీపీ ప్రభుత్వం హయాంలో రాగులు, జొన్నలు, గోదుమ పిండి, ఉప్పు పంపిణీ చేయటం మొదలెట్టిందే చివర్లో. ‘ఈనాడు’ దృష్టిలో అది సూపర్‌. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచ్చినా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో పంపిణీ చేశారీ చిరు ధాన్యాల్ని. గతంలో నెలకు 14 వేల టన్నుల గోధుమ పిండి అవసరం ఉంటే 900 టన్నులు తెచ్చి కొద్ది మందికే పంపిణీ చేశారు. ఇక్కడి ప్రజలకు బియ్యమే ఇష్టం.

కార్మికులు, కూలి కుటుంబాలకు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే తీరిక ఉండదు. దీంతో గోధుమ పిండి తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిల్వలు పాడైపోతున్న కారణంగా పంపిణీ నిలిచిపోయింది. రాగులు, జొన్నల విషయంలోనూ ఇదే జరిగింది. 2018–19 మధ్య 25,034 టన్నుల రాగులు, 15,635 టన్నుల జొన్నలను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేశారు.

వీటిని బయటి మార్కెట్‌ నుంచి కొనటంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేసింది. వీటి పరిమాణానికి సమానవైన బియ్యంపై సైతం సబ్సిడీ ఇవ్వలేదు. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. వీటిని తీసుకునేందుకెవరూ ఆసక్తి చూపించకపోవడంతో మధ్యలోనే ఆగిపోతే.. దీనిక్కూడా ‘ఈనాడు’ మసి పూస్తూనే ఉంది. 2020లో కేంద్రం 1838 టన్నుల గోధుమలు మాత్రమే సరఫరా చేసేది. వాటిని పిండిగా చేసి రేషన్‌ దుకాణాలకు చేర్చేందుకు ఖర్చు అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటా’ సరఫరాలను నిలిపివేసింది. 

అన్నీ... ఎన్నికల ముందే 
ఇక గత ప్రభుత్వం ఐదేళ్లలో 93 వేల టన్నుల కందిపప్పు, 3.16 లక్షల పంచదారను మాత్రమే పంపిణీ చేస్తే... వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం మూడేళ్లలో 2.76 లక్షల టన్నుల కందిపప్పును, 2.14 లక్షల టన్నుల పంచదారను అందించింది. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్‌ 2014 సెప్టెంబర్‌ నుంచి 2015 జూన్‌ వరకు కందిపప్పు గురించి పట్టించుకోనే లేదు.

నవంబర్‌ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు వస్తున్నాయనగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పంచదార పరిస్థితీ అంతే. నెలకు సగటున 7724 టన్నులు అవసరం కాగా, కేంద్రం కేవలం 908 టన్నులకే రాయితీ ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్రం బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసి... సబ్సిడీని భరిస్తోంది. 

పైపెచ్చు బాబు హయాంలో ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులుండేవి. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఇచ్చి... ధర రూ.50 నుంచి రూ.120 మధ్యన విక్రయించారు. 2015 డిసెంబర్లో రూ.90కి విక్రయిస్తే... 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో రూ.63 ఉన్నప్పుడు కేవలం రూ.23 రాయితీ ఇచ్చారు.

ఇప్పుడు ఓపెన్‌ మార్కెట్‌లో రూ.115 ఉంటే.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.48 సబ్సిడీ ఇస్తూ రూ.67కే అందిస్తోంది. మార్కెట్‌ ఒడిదుడుకులు, కోవిడ్‌ సంక్షోభం, ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి.  ఇదే నేరమైనట్లు... ధరలు పెంచేశారంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకోవటం చూస్తే చిత్రంగానే అనిపిస్తుంది.   

ఇంటింటికీ రేషన్‌పైనా నిందలా? 
‘తోచీ తోచనమ్మ’ తరహాలో రామోజీరావుకు దేనిపై విమర్శలు చేయాలో తెలియటం లేదన్నది ఆయన కథనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటింటికీ రేషన్‌ అందించటంలో ఏపీని యావద్దేశం ఆదర్శంగా తీసుకుంటోంది. ‘ఈనాడు’ మాత్రం పసలేని విమర్శలు చేస్తూనే ఉంది. బాబు హయాంలో రేషన్‌ సరుకుల కోసం యుద్ధాలే చేయాల్సి వచ్చేది. డిపోల్లో సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో తెలీక రోజంతా కూలి మానేసి క్యూలో పడిగాపులు పడేవారు. ఒక్కోసారి రేషన్‌ తీసుకోకుండానే ఇళ్లకెళ్లేవారు.

వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. కానీ ఈ నిజాలను ఇప్పటికీ ‘ఈనాడు’ చెప్పదు. పైపెచ్చు అప్పట్లో ఒకరోజు సెలవు పెట్టుకుని డిపోలకు వెళ్లేవారని, ఇపుడు ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తాయో తెలియక తంటాలు పడుతున్నారని రాయటంలోనే ఆ పత్రిక ఎంత నీచానికి దిగజారుతున్నదో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయంతో... ఇపుడు 9,260 వాహనాల్లో లబ్ధిదారులకు ఇళ్లవద్దే రేషన్‌ అందుతోంది.

ఈ మొబైల్‌ వాహనాలతో ఉపాధి పొందుతున్న ఆపరేటర్లకు నెలకు సుమారు రూ.25 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదుల్లేవు. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణా లేదు.

ఇప్పుడు రేషన్‌ తీసుకునేవారు 87 శాతం నుంచి 92 శాతానికి పెరిగారు. వాహనం వచ్చినప్పుడు ఇంట్లో సభ్యులు లేకపోతే సాయంత్రం సచివాలయం వద్ద రేషన్‌ వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎండీయూ వాహనం నుంచి బియ్యం పొందే సౌలభ్యాన్ని కల్పించారు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పని నిజాలే మరి! 

తగ్గిన బియ్యం అక్రమ రవాణా.. 
బాబు హయాంలో రేషన్‌ బియ్యం తినేవారు చాలా తక్కువ. ముక్కిపోవటం... పురుగులు పట్టడం... రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజలు రంగు మారటం వంటివి అప్పట్లో అత్యంత సహజం. దీనిని కూడా బాబు బినామీలు తమ దళారులతో ప్రజల దగ్గర నుంచి పదీపరకా పెట్టి కొనేసేవారు. అక్రమంగా తరలించి ప్రజాధనాన్ని దోచేసేవారు. కానీ ఇప్పుడిస్తున్న సార్టెక్స్‌ బియ్యం నిరుపేదల కడుపు నింపుతోంది.

అందుకే గతంలో కంటే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 117.45 లక్షల టన్నులు బియ్యం సరఫరా చేస్తే ఈ మూడేళ్లలోనే జగన్‌ ప్రభుత్వం 85.27లక్షల టన్నులు పేదలకు ఇచ్చింది. బియ్యం సార్టెక్స్‌కే కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

బాబు ఐదేళ్ల కాలంలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే జగన్‌ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,379 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది.  పాతాళంలోకి పడిపోయిన బాబును ఎలాగైనా పైకి లాగాలని చూస్తున్న రామోజీకి ఇవేమీ కనిపించట్లేదు!  

19 నెలల ఉచిత బియ్యం  
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్‌ 2020లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద  కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పప్పు ధాన్యాల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల నాన్‌సార్టెక్స్‌ బియ్యాన్ని అందించింది. అయితే కేంద్రం కేవలం జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డులకు మాత్రమే దీనిని వర్తింప జేసింది.

రాష్ట్రంలో 1.45 కోట్ల కార్డులు ఉంటే.. 88 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు దశల్లో అంటే 25 నెలల పాటు ఈ పథకం కొనసాగగా కేంద్రంతో సమానంగా ఐదు దశల వరకు 19 నెలల పాటు రాష్ట్ర కార్డులకు కూడా ప్రభుత్వం సొంత ఖర్చులతో  బియ్యాన్ని అందించింది.

ఇందు కోసం అదనంగా దాదాపు రూ.5700 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీనికి తోడు పీఎంజీకేఏవై కింద శనగలు, కందిపప్పు పంపిణీకి రూ.1729 కోట్లు ఖర్చు చేసింది. ఆరవ విడతలో ప్రభుత్వం వద్ద సరిపడినన్ని నాన్‌ సార్టెక్స్‌ బియ్యం అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ఆలస్యమై కేవలం చివరి రెండు నెలలు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకు మాత్రమే.. ఎంపిక చేసిన జిల్లాల్లో పంపిణీ చేశారు. ఇకనైనా ఈ వాస్తవాలు రాయండి రామోజీరావు గారూ!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement