పేదల రేషన్‌లో పప్పు,ఉప్పు కట్!
కంది పప్పు, ఉప్పు కొరతతో రేషన్‌కార్డుదారులకు ఇక్కట్లు
ధర పెరగడంతో కాంట్రాక్టుకు వెనుకాడుతున్న ప్రభుత్వం
చింతపండు, పసుపు,కారం సరఫరాకు మంగళం?
విజయనగరం కంటోన్మెంట్: ఏదైనా పథకానికి పేరు మారుస్తున్నారంటే ఏమనుకోవాలి? అందులో లోపాలను సరిదిద్ది సరి కొత్తగా ప్రజానీకానికి నాణ్యమైన సేవలందిస్తారనేగా.... కానీ తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో పేర్లు మాత్రమే మారుతాయి... పథకాలు నిర్వీర్యమవుతాయడానికి ఉదాహరణే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇంత వరకూ పడుతూలేస్తూ ఏదోరకంగా అమ్మహస్తం పేరుతో తొమ్మిదిరకాల సరుకులను అందిస్తుండగా.... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథ కం పేరును ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా మార్చారు.
పసుపు రంగు కూపన్లు కూడా ప్రింట్ చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం జాబితాలో ఒక్కొక్క వస్తువూ కనుమరుగవుతోంది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపి ణీ అవుతున్న మంచినూనె(పామాయిల్) సరఫరా గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోగా, దానిని పునరుద్ధరించడం మానేసి, ఇప్పుడు కందిపప్పు పంపిణీని కూడా నిలిపివేస్తున్నారు. ఇలా తొమ్మిది రకాల సరుకులను జాబితాలోం చి తొలగించి, పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అసలే పెరిగిపోతున్న ధరాభారంతో ఇబ్బందులు పడుతున్న జనం ఇలా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా తగ్గిస్తుండడంతో మరిన్ని ఇబ్బందులకు గురయ్యేపరిస్థితులు దాపురించనున్నాయి.
కొద్ది మందికే పప్పు తినే భాగ్యం
బహిరంగ మార్కెట్లో కందిపప్పునకు గిరాకీ ఉంది. దీంతో ధర కూడా బాగా ఎక్కువగా ఉంది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కిలో రూ. 50 కే అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధర రూ.80. ఇంత ధర పెట్టి కొనుగోలు చేయలేని బీపీఎల్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కిలో వద్ద ఇంత వ్యత్యాసమున్నప్పుడు పెద్దఎత్తున కాంట్రాక్టు చేసే విషయంలో బడ్జెట్ భారంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కందిపప్పును ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేసే కాంట్రాక్టును కొనసాగించకుండా నిలిపివేసింది. దీంతో కందిపప్పు తక్కువ స్థాయిలో జిల్లాకు చేరింది. ప్రతినెలా జిల్లాకు 350 మెట్రిక్ టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా ఈ నెల 119 మెట్రిక్ టన్నులను మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికి ఇంతేనని అంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల చాలా మందికి కందిపప్పు అందే అవకాశం లేదు. దీనిని సరిదిద్దుకునేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు కందిపప్పును డివిజన్ కేంద్రాల్లోనూ బొబ్బిలిలోని కొన్ని షాపులకు సరఫరా చేశారు. దీంతో ఈ నెల పార్వతీపురం, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో మాత్రమే కందిపప్పు లభ్యమవుతుంది. మిగతా ప్రాంతాల్లో పప్పు సరఫరా మరి లే నట్టే.
ఉప్పుతిప్పలు
రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే ఉప్పు నాణ్యంగా ఉండేది. ఇది ఎంఎల్‌ఎస్ పాయింట్లకు గుజరాత్ నుంచి సరఫరా అయ్యేది. ఇది కూడా ప్రస్తుతం రావడం లేదు. దీంతో వినియోగదారులు ఇష్టపడే ఉప్పు, కందిపప్పు కూడా రావడం లేదు. ఇక పంచదార కేవలం అరకిలో మాత్రమే ఇస్తున్నారు. ఇది కొన్ని సార్లు సరఫరా కావడం లేదు. ఒక్కోనెల పంచదార ఎప్పుడొస్తుందో తెలియదు.
చింతపండు, పసుపు, కారం పంపిణీకి మంగళం ?
రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న చింత పం డు, కారం, పసుపుల సరఫరాకు మంగళం పాడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో చింతపండు బయట మార్కెట్లోనే తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత కూడా బాగా ఉండడంతో వినియోగదారులు చింతపండు ను రేషన్ షాపుల ద్వారా కొనుగోలు చేయడం మానేశారు. రేషన్ షాపుల ద్వారా చింతపండు అర కిలో రూ.30కు సరఫరా చేస్తున్నారు.
ఇదే బయట మార్కె ట్లో మాత్రం ఇది రూ.20కే దొరుకుతోంది. దీనివల్ల చింతపండు కదలడం లేదు. అదేవిధంగా కారం, పసుపు నాణ్యత బాగాలేకపోవడంతో వాటిని కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాకు వచ్చిన సరుకులు అలానే ఉండిపోతున్నాయి. అయితే పరిస్థితి చక్కదిద్దవలసింది పోయి ఏకంగా రెండునెలలుగా సరుకుల ఇండెంట్ పెట్టడం మానేశారు. ఇప్పుడు గోధుమపిండి, గోధుమలు, పంచదార మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని సరుకులు నిలిపివేస్తారో తెలియాల్సి ఉంది.