Ration cardholders
-
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్!
కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో తీసుకుని రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పథకం గడువుని పొడిచింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్ అమలు కానుంది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని క్యాబినెట్ సమావేశం తర్వాత ఆహార మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుత పొడిగింపు నిర్ణయం అమలు తర్వాత, ఈ స్కీమ్ ప్రయోజనం NFSA (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద లబ్ధిదారులకు ప్రయెజనాలను అందివ్వనున్నారు. 2020 నుంచి ప్రత్యేక PMGKAY పథకం కింద ప్రజలకు లబ్ధిచేకూరేది. నివేదికల ప్రకారం, దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. దీని వలన ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా.. తాజాగా మరో ఏడాదికి ప్రయోజనాన్ని పెంచింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
మళ్లీ రేషన్ కార్డుపై ఉచిత బియ్యం.. యూనిట్‌కు 10 కిలోల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో నెల సరి కోటాతో సంబంధం లేకుండా యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా అదించారు. ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్‌కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నెలసరి ఉచిత కోటా ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో కేంద్రం మరోసారి సెప్టెంబర్ వరకు పథకాన్ని పొడగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్‌న్ నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ సాధ్యం కాలేదు. రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివర్లో మాత్రం నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది. చదవండి: పట్టు బిగించండి.. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం -
Narendra Modi: ఇక టీకా.. ఫ్రీ
న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీకా డోసులను రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రసంగించారు. ‘రాష్ట్రాల వాటా అయిన 25% టీకాలను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు వారాల సమయం పడుతుంది. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపించే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా లభిస్తుంది’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని లేఖలు రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు పలుమార్లు కేంద్ర ప్రభుత్వ టీకా విధానంలో లోపాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రాల వాటా అయిన 25% సహా మొత్తం 75% టీకాలను కేంద్రమే టీకా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. మిగతా 25% టీకాలను ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ నిర్ధారిత ధరపై ఆసుపత్రులు విధించే సర్వీస్ చార్జ్ ఒక్కో డోసుకు, రూ. 150కి మించకూడదని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు టీకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. విదేశాల్లోని ఫార్మా సంస్థల నుంచి టీకాలను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. కరోనా మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. పిల్లల కోసం రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. ముక్కు ద్వారా స్ప్రే చేసే టీకాను అభివృద్ధి చేసే పరిశోధనలు త్వరితగతిన జరుగుతున్నాయని, ఆ టీకా అందుబాటులోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. టీకాలపై అబద్దాలను ప్రచారం చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కారణం ఇదే కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై విమర్శలు చేసిన వారిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీకా విధానంలో తాజా మార్పునకు కారణం వివరిస్తూ.. ‘జనవరి 16 నుంచి ఏప్రిల్ చివరి వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కేంద్రం ఆధ్వర్యంలోనే సజావుగా సాగింది. అర్హులైనవారంతా క్రమశిక్షణతో టీకాలు తీసుకున్నారు. ఇంతలో టీకా కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలన్న డిమాండ్స్ వచ్చాయి. కేంద్రమే అన్నీ నిర్ణయిస్తుందా?, ఒక వయస్సు వారికే ప్రాధాన్యత ఎందుకు? అని కొందరు ప్రశ్నించారు. ఇంకా చాలా రకాలైన ఒత్తిళ్లు వచ్చాయి. మీడియాలోని ఒక వర్గం కూడా దీన్నో ప్రచారంలా చేపట్టింది. దాంతో, అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రాల డిమాండ్‌కు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. మే 1వ తేదీ నుంచి 25% టీకాలను రాష్ట్రాలే తీసుకునే వెసులుబాటు కల్పించాం. కానీ, ఆ తరువాత కొన్ని రోజులకే రాష్ట్రాలకు సమస్య అర్థమైంది. ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టడంలోని కష్టాలు అర్థమయ్యాయి. తరువాత, రెండు వారాలకే పాత విధానమే మేలు అని కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. క్రమంగా దాదాపు అన్ని రాష్ట్రాలు అదే విషయం చెప్పసాగాయి. టీకా విధానంపై పునరాలోచన చేయాలని కోరాయి. దాంతో, దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగాలనే ఉద్దేశంతో.. మే 1 వ తేదీకి ముందున్న విధానాన్నే మళ్లీ అమలు చేయాలని నిర్ణయించాం’ అన్నారు. ఆక్సిజన్ డిమాండ్ ఊహించలేదు రెండో వేవ్ ఉధృతంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఊహించనంతగా పెరిగిందని, ఆ స్థాయిలో ఆక్సిజన్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేదని ప్రధాని తెలిపారు. ఆ స్థాయిలో ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. నేవీని, వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దింపామని, ప్రత్యేకంగా ఆక్సిజన్ రైళ్లను నడిపామని గుర్తు చేశారు. స్వల్ప వ్యవధిలోనే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచగలిగామన్నారు. నిర్లక్ష్యం వద్దు సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సడలింపులను అవకాశంగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రధాని ప్రజలకు ఉద్బోధించారు. నిబంధనలను పాటించడమే వైరస్‌ను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధమన్నారు. ‘ఆంక్షల్లో సడలింపులను ఇస్తున్నారు అంటే అర్థం వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని కాదు. ఎప్పటికప్పుడు రూపం మారుస్తున్న కరోనాపై ఇప్పటికీ చాలా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి’ అని సూచించారు. కరోనాపై మనం కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. టీకాతోపాటు 6 వేలు ఇవ్వండి ప్రధాని ప్రకటనపై ఎన్డీయే నేతలు హర్షం వ్యక్తం చేయగా, టీకా విధానంలో గందరగోళానికి ఇకనైనా తెరవేయాలని కాంగ్రెస్ కోరింది. ఉచితంగా టీకా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 6 వేలు జమ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల కారణంగానే ప్రధాని ఈ ప్రకటన చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేశారు. ‘సుప్రీం’ వ్యాఖ్యల వల్లనేనా? కేంద్ర ప్రభుత్వం మళ్లీ కేంద్రీకృత టీకా విధానం వైపు వెళ్లడానికి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమన్న వాదన వినిపిస్తోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు టీకా ధరల్లో వ్యత్యాసం, కోవిన్ యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన, వయస్సుల వారీగా టీకాలివ్వాలన్న విధానంలో హేతుకత.. తదితర అంశాలపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాక్సిన్ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల కోట్లలో ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేశారో వివరించాలని ఆదేశించింది. టీకా విధానాన్ని పునఃపరిశీలించాలని కోరింది. దేశంలో కోవిడ్ స్థితిగతులపై విచారణను సుమోటోగా సుప్రీం తీసుకుంది. ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్కు, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి తొలి విడతలో కేంద్రం ఉచితంగా టీకా ఇచ్చింది. ఆ తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పిస్తూ సరళీకృత విధానం ప్రారంభించింది. సత్తా చూపాం అత్యంత స్వల్ప వ్యవధిలో దేశీయంగా రెండు టీకాలను అభివృద్ధి చేసి భారత్ తన సత్తా నిరూపించుకుందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అర్హులైనవారికి 23 కోట్ల టీకా డోసులు వేశారన్నారు. గతంలో విదేశాల్లో టీకాలు అభివృద్ధి చెంది, అందుబాటులోకి వచ్చిన దశాబ్దాల తరువాత భారతీయులకు అవి లభించేవని ప్రధాని గుర్తు చేశారు. కొన్ని వ్యాధులకు వేరే దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి, భారత్‌లో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యేదన్నారు. గత 5, 6 ఏళ్లలో ఆ పరిస్థితి మారిందన్నారు. ‘అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కోవిడ్‌ను ఎదుర్కొనే టీకాను సరైన వ్యూహం, ప్రణాళికతో, స్పష్టమైన విధానంతో, పట్టుదలతో ముందుకు వెళ్లి... ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్లను స్వల్ప వ్యవధిలోనే దేశీయంగా అభివృద్ధి చేయగలిగాం’ అన్నారు. గత వందేళ్లలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఈ మహమ్మారేనన్న ప్రధాని.. దీనిపై భారత్ బహుముఖ పోరు సల్పుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను, ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామని, ఐసీయూ బెడ్స్‌ను, ఆక్సిజన్ ఉత్పత్తిని, వెంటిలేటర్ల లభ్యతను పెంచామని తెలిపారు. అత్యవసర ఔషధాల ఉత్పత్తిని భారీగా పెంచామని, కొత్తగా వైద్య వసతులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాంతానికి సాధ్యమే ఈ సంవత్సరాంతానికి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వడం సాధ్యమనని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటికి 187.2 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడినవారి సంఖ్య సుమారుగా 94 కోట్లు ఉంటుందన్నారు. జనవరి నుంచి జులై వరకు 53.6 కోట్ల డోసులు, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 133.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. నవంబర్ వరకు ఉచిత రేషన్ పేదలకు ఉచిత రేషన్ అందించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడగిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలోని దాదాపు 80 కోట్ల మంది పేదలకు నెలవారీగా, ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా అందజేస్తారు. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో మే, జూన్ నెలలకు ఈ పథకం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తామని కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. గత సంవత్సరం ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి 8 నెలల పాటు కొనసాగించామని ప్రధాని గుర్తు చేశారు. ‘ఈ సంవత్సరం కూడా మే, జూన్ నెలల్లో దీన్ని అమలు చేశాం. ఇప్పుడు ఈ పథకాన్ని దీపావళి వరకు పొడగించాలని నిర్ణయించాం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం పేదలకు ఒక స్నేహితుడిగా అండగా ఉంటుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
వారు బయట తిరిగితే చాలా ప్రమాదం: కలెక్టర్
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజయవాడ జాయింట్ కలెక్టర్ మాధవీ కోరారు. విదేశాల నుంచి దొంగచాటుగా వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆమె విజ్ఙప్తి చేశారు. వారు బయట తిరిగితే చాలా ప్రమాదమని, వారంతట వారే బయటికొస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోమని అన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై విజయవాడలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేదని, స్వీయ నియంత్రణ ఒక్కటే మేలైన మార్గమని అన్నారు. (మహిళకు చీరకొంగుతో మాస్క్ కట్టిన ఎంపీ) ఆమె మాట్లాడుతూ ‘రైతు బజార్లలో రద్దీ తగ్గించేందుకు వికేంద్రీకరణ చేపట్టాం. ఆరు రైతు బజార్లను ఇరవై నాలుగుకు పెంచాం. 30 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చాం. ఎక్కడి వాళ్ళకు అక్కడే కూరగాయలు అందే సదుపాయం కల్పిస్తున్నాం. రేషన్ సరుకులు ప్రతి ఒక్కరికీ అందజేస్తాం. అందరికీ రేషన్ చేరే వరకు పంపిణి జరుగుతుంది. వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరూ రేషన్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలి. ప్రజల వ్యవహారశైలిలో మార్పు రావాలి’ అని పేర్కొన్నారు. (రైతు బజార్లకు బారులు తీరిన ప్రజలు) -
నువ్వెప్పుడో చచ్చావ్..పో..పో!
ఆమెను బతికుండగానే చంపేశారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు చూపిస్తున్నారు. చనిపోయావనే సాకుతో రెండేళ్లుగా ఆమెకు రేషన్ కూడా ఇవ్వడం లేదు. తాను బతికే ఉన్నానని, న్యాయం చేయాలని కాళ్లరిగేలా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సాక్షి, చిత్తూరు (గుర్రంకొండ): స్థానిక ఇందిరమ్మ కాలనీలో కె. పురుషోత్తం(33), కె. లక్ష్మీదేవి(23) దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు ఉన్నాడు. పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం గ్రామంలో నిర్వహించిన పల్స్‌సర్వేలో లక్ష్మీదేవి పేరు తొలగించారు. దీంతో రేషన్ దుకాణంలో ఆమెకు రేషన్‌ను నిలిపివేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీసింది. తమ రికార్డుల్లో మృతి చెందినట్లు నమోదై ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంతో హతాశురాలైంది. తాను బతికే ఉన్నానని, తమ కుటుంబానికి రేషన్ ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితురాలు రెండేళ్ల క్రితం అర్జీ ఇచ్చింది. నాటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఆమె గోడు అరణ్యరోదనే అయ్యింది. రికార్డుల్లో తప్పిదాన్ని సరిచేయకపోవడంతో రేషన్ అందక ఆమెకు జీవనానికి శాపమైంది. అంతేకాదు; ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఆమెకు అందని పరిస్థితి. ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. -
పూర్తి స్థాయి సర్వే జరిగి 111 సంవత్సరాలు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సన్నబియ్యం సేకరించాలని జగన్ ఆదేశించారన్నారు. ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి కమిటీ : పిల్లి సుభాష్‌చంద్రబోస్ గత ప్రభుత్వం భూముల వ్యవహారం ఆన్లైన్ చేయడం వల్ల అనేక అవకతవకలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఫలితంగా రైతుల భూమి హక్కుకు భంగం కల్గిందని.. భద్రత లేదని విమర్శించారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి రిటైర్డ్ జడ్జి, అనుభవజ్ఞులైన రిటైర్డ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ నియమించాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారన్నారు. ఇది ఒక ఆహ్లదకరమైన.. ఆహ్వానించదగిన నిర్ణయమని కొనియాడారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే జరిగి దాదాపు 111 సంవత్సరాలు అవుతుందన్నారు. రీసర్వేను జగన్ ఒక చాలెంజ్‌గా తీసుకున్నారని.. దీనిపై అనుభవజ్ఞులైన అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు. -
పేదల రేషన్‌లో పప్పు,ఉప్పు కట్!
కంది పప్పు, ఉప్పు కొరతతో రేషన్‌కార్డుదారులకు ఇక్కట్లు ధర పెరగడంతో కాంట్రాక్టుకు వెనుకాడుతున్న ప్రభుత్వం చింతపండు, పసుపు,కారం సరఫరాకు మంగళం? విజయనగరం కంటోన్మెంట్: ఏదైనా పథకానికి పేరు మారుస్తున్నారంటే ఏమనుకోవాలి? అందులో లోపాలను సరిదిద్ది సరి కొత్తగా ప్రజానీకానికి నాణ్యమైన సేవలందిస్తారనేగా.... కానీ తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో పేర్లు మాత్రమే మారుతాయి... పథకాలు నిర్వీర్యమవుతాయడానికి ఉదాహరణే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇంత వరకూ పడుతూలేస్తూ ఏదోరకంగా అమ్మహస్తం పేరుతో తొమ్మిదిరకాల సరుకులను అందిస్తుండగా.... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథ కం పేరును ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా మార్చారు. పసుపు రంగు కూపన్లు కూడా ప్రింట్ చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం జాబితాలో ఒక్కొక్క వస్తువూ కనుమరుగవుతోంది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపి ణీ అవుతున్న మంచినూనె(పామాయిల్) సరఫరా గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోగా, దానిని పునరుద్ధరించడం మానేసి, ఇప్పుడు కందిపప్పు పంపిణీని కూడా నిలిపివేస్తున్నారు. ఇలా తొమ్మిది రకాల సరుకులను జాబితాలోం చి తొలగించి, పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అసలే పెరిగిపోతున్న ధరాభారంతో ఇబ్బందులు పడుతున్న జనం ఇలా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా తగ్గిస్తుండడంతో మరిన్ని ఇబ్బందులకు గురయ్యేపరిస్థితులు దాపురించనున్నాయి. కొద్ది మందికే పప్పు తినే భాగ్యం బహిరంగ మార్కెట్లో కందిపప్పునకు గిరాకీ ఉంది. దీంతో ధర కూడా బాగా ఎక్కువగా ఉంది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కిలో రూ. 50 కే అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర రూ.80. ఇంత ధర పెట్టి కొనుగోలు చేయలేని బీపీఎల్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కిలో వద్ద ఇంత వ్యత్యాసమున్నప్పుడు పెద్దఎత్తున కాంట్రాక్టు చేసే విషయంలో బడ్జెట్ భారంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కందిపప్పును ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేసే కాంట్రాక్టును కొనసాగించకుండా నిలిపివేసింది. దీంతో కందిపప్పు తక్కువ స్థాయిలో జిల్లాకు చేరింది. ప్రతినెలా జిల్లాకు 350 మెట్రిక్ టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా ఈ నెల 119 మెట్రిక్ టన్నులను మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికి ఇంతేనని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల చాలా మందికి కందిపప్పు అందే అవకాశం లేదు. దీనిని సరిదిద్దుకునేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు కందిపప్పును డివిజన్ కేంద్రాల్లోనూ బొబ్బిలిలోని కొన్ని షాపులకు సరఫరా చేశారు. దీంతో ఈ నెల పార్వతీపురం, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో మాత్రమే కందిపప్పు లభ్యమవుతుంది. మిగతా ప్రాంతాల్లో పప్పు సరఫరా మరి లే నట్టే. ఉప్పుతిప్పలు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే ఉప్పు నాణ్యంగా ఉండేది. ఇది ఎంఎల్ఎస్ పాయింట్లకు గుజరాత్ నుంచి సరఫరా అయ్యేది. ఇది కూడా ప్రస్తుతం రావడం లేదు. దీంతో వినియోగదారులు ఇష్టపడే ఉప్పు, కందిపప్పు కూడా రావడం లేదు. ఇక పంచదార కేవలం అరకిలో మాత్రమే ఇస్తున్నారు. ఇది కొన్ని సార్లు సరఫరా కావడం లేదు. ఒక్కోనెల పంచదార ఎప్పుడొస్తుందో తెలియదు. చింతపండు, పసుపు, కారం పంపిణీకి మంగళం ? రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న చింత పం డు, కారం, పసుపుల సరఫరాకు మంగళం పాడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో చింతపండు బయట మార్కెట్లోనే తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత కూడా బాగా ఉండడంతో వినియోగదారులు చింతపండు ను రేషన్ షాపుల ద్వారా కొనుగోలు చేయడం మానేశారు. రేషన్ షాపుల ద్వారా చింతపండు అర కిలో రూ.30కు సరఫరా చేస్తున్నారు. ఇదే బయట మార్కె ట్లో మాత్రం ఇది రూ.20కే దొరుకుతోంది. దీనివల్ల చింతపండు కదలడం లేదు. అదేవిధంగా కారం, పసుపు నాణ్యత బాగాలేకపోవడంతో వాటిని కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాకు వచ్చిన సరుకులు అలానే ఉండిపోతున్నాయి. అయితే పరిస్థితి చక్కదిద్దవలసింది పోయి ఏకంగా రెండునెలలుగా సరుకుల ఇండెంట్ పెట్టడం మానేశారు. ఇప్పుడు గోధుమపిండి, గోధుమలు, పంచదార మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని సరుకులు నిలిపివేస్తారో తెలియాల్సి ఉంది. -
అమ్మహస్తం ఆగింది!
అదనపు సరుకులకు చెక్ బియ్యం, చక్కెర, గోధుమపిండి, కిరోసిన్ మాత్రమే పంపిణీ డిమాండ్ లేనందునే సరఫరా నిలిచిందంటున్న అధికారులు అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి సర్కారు మంగళం పాడింది. రోజువారీ అవసరాల్లో ప్రధానమైన తొమ్మిది రకాల సరుకులను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతో పాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి తదితర సరుకులను రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం హంగు, ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన ఈ పథకం కథ ప్రస్తుతం ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నాలుగు ‘కట్’.. జిల్లాలో 10.78లక్షల రేషన్ కార్డుదారులకు నెలవారీగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకులు ఇస్తున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడడంతో కార్డుదారులు ఆదినుంచి కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. నాణ్యమైన సరుకులు అంది స్తున్నామంటూ అప్పటి నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో మాత్రం సరుకుల పట్ల తీవ్ర వ్యతి రేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ స్టాకును పక్కనపెట్టారు. బాగా డిమాండ్ ఉన్న బియ్యం, కిరోసిన్, చక్కెర, ఆటా, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు క ట్టి స్టాకు తెప్పించుకోవడంతో అదనపు సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. నిల్వలు ముక్కిపోయి... అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన కారం, పసుపు, చింతపండు సరుకులకు డిమాండ్ లేకుండా పోయి ంది. ఈ నేపథ్యంలో ఈ స్టాకును రేషన్ డీలర్లు తీసుకోకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా గోదాముల్లో నిల్వ చేశారు. దీంతో క్రమంగా ఈ స్టాకు గోదాముల్లో ముక్కిపోయి పాడవడంతో భారీ నష్టమే సంభవించింది. దాదాపు 2లక్షల కారంపొడి ప్యాకెట్లు పాడైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అదనపు సరుకుల సంగతి పక్కనబెట్టి సాధారణ సరుకులైన బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, పిండి మాత్రం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 17వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 7వందల మెట్రిక్ టన్నుల గోధుమలు, గోధుమపిండి, 550 మెట్రిక్ టన్నుల చక్కెర కోటాను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేశారు. పామాయిల్ ‘నిల్’.. రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్‌కు కొరత ఏర్పడింది. పామాయిల్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా నిల్చిపోయింది. జిల్లాలో నెలకు 1,078 మెట్రిక్ టన్నుల పామాయిల్ స్టాకు అవసరం. అయితే ఏప్రిల్ నెలతోనే పామాయిల్ సరఫరాకు కాలం చెల్లడంతో కార్డుదారులకు అందలేదు. ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉన్న స్టాకు పంపిణీ చేయగా.. ఆ తర్వాత ఎన్నికల తంతు మొదలు కావడంతో పామాయిల్ కథకు తెరపడింది. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ పంపిణీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పామాయిల్ సరఫరా ఆధారపడి ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
రేషన్ డీలర్ల ఎంపికకు రాత పరీక్ష
హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించే చౌక ధరల దుకాణాల డీలర్లను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్వ్యూల ద్వారా డీలర్లను ఎంపిక చేసే విధానం అమల్లోవుంది. అయితే, ఇక నుంచి జరిగే నియామకాలను రాత పరీక్ష ద్వారానే డీలర్లను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వ్యూ ద్వారా డీలర్లను ఎంపిక చేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.