రేషన్ కార్డు చూపిస్తున్న బాధితురాలు లక్ష్మీదేవి
ఆమెను బతికుండగానే చంపేశారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు చూపిస్తున్నారు. చనిపోయావనే సాకుతో రెండేళ్లుగా ఆమెకు రేషన్ కూడా ఇవ్వడం లేదు. తాను బతికే ఉన్నానని, న్యాయం చేయాలని కాళ్లరిగేలా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
సాక్షి, చిత్తూరు (గుర్రంకొండ): స్థానిక ఇందిరమ్మ కాలనీలో కె. పురుషోత్తం(33), కె. లక్ష్మీదేవి(23) దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు ఉన్నాడు. పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం గ్రామంలో నిర్వహించిన పల్స్‌సర్వేలో లక్ష్మీదేవి పేరు తొలగించారు. దీంతో రేషన్ దుకాణంలో ఆమెకు రేషన్‌ను నిలిపివేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీసింది. తమ రికార్డుల్లో మృతి చెందినట్లు నమోదై ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంతో హతాశురాలైంది.
తాను బతికే ఉన్నానని, తమ కుటుంబానికి రేషన్ ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితురాలు రెండేళ్ల క్రితం అర్జీ ఇచ్చింది. నాటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఆమె గోడు అరణ్యరోదనే అయ్యింది. రికార్డుల్లో తప్పిదాన్ని సరిచేయకపోవడంతో రేషన్ అందక ఆమెకు జీవనానికి శాపమైంది. అంతేకాదు; ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఆమెకు అందని పరిస్థితి. ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment