కందిపప్పు సరఫరాకు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందజేసే రాయితీ కందిపప్పు సరఫరా కోసం ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలిచింది. వచ్చే నెల మార్చి వరకు పీడీఎస్ అవసరాలకు సరిపోయేలా 5వేల మెట్రిక్ టన్నులకు పౌర సరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు దిగివచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం, వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతీ నెలా 5వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతోంది. లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుత ధరలు మార్చి తర్వాత మరింత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో కేవలం ఒక నెల అవసరాల మేర మాత్రమే ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించింది. మార్చి తర్వాత తిరిగి పాత విధానం మేరకు మూడు నెలల అవసరాల కోసం టెండర్లను ఆహ్వానించనుంది.