ఫస్ట్ టైం.. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజలకే అందించే ఏర్పాటును కలిపించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తమదేనంటూ కేజ్రీవాల్ కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం ప్రజల వద్దకే ప్రభుత్వ సదుపాయాలు వచ్చి చేరుతాయన్న మాట. ఉదాహారణకు రేషన్ కార్డు సబ్సిడీ సదుపాయాలు, సర్టిఫికెట్లలలో మార్పులు-చేర్పులు, డ్రైవింగ్ లైసెన్సులు, వివాహ సర్టిఫికెట్లు.. లాంటి సేవలను నేరుగా ఇంటికి వెళ్లి ప్రజలకు అందించటం అన్న మాట. తద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని, భారీ క్యూలలో నిలుచునే అవకాశం లేకుండా పోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అధికారులే ప్రతీ గడప దగ్గరికి వెళ్లి అవసరమైన ప్రక్రియను చూసుకుంటారు. ఒకవేళ దానికి అవసరమైన ఫీజు ఉంటేనే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే లేదు అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేయటం తదితరాల కింద మొత్తం 40 సేవలను మొదటి విడతగా ఈ పథకంలో చేర్చారు. ఢిల్లీ ప్రజలు తమ తమ పనుల్లోనే క్షణం తీరిగ్గా లేకుండా బిజీగా గడుపుతున్నారు. అలాంటి సమయంలో వారికి ఊరట ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని సిసోడియా అన్నారు. మరో నెలలో ఇంకో 40 సేవలను చేర్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
అయితే కాలుష్యాన్ని నివారించటంలో దారుణంగా విఫలమయ్యాడన్న విమర్శలు.. అది కాకుండా నానాటికీ తగ్గుతున్న ప్రజాదరణను నిలబెట్టుకునేందుకే ఇలా కంటితుడుపు నిర్ణయాలు తీసుకుంటున్నాడని విపక్షాలు చెబుతున్నాయి.