Salt shortage
-
దేశంలో పొంచి ఉన్న ఉప్పు కొరత!
రాజ్‌కోట్: గుజరాత్‌లోని కచ్‌లో సుమారు 8 లక్షల టన్నుల ఉప్పు నిల్వలు పేరుకుపోయాయి. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ఉప్పు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సీజన్ కావడంతో గుజరాత్ తీర ప్రాంతాల నుంచి ఎరువుల సరఫరాకే రైల్వే శాఖ ప్రాధాన్యమిస్తోంది. దీంతో ఉప్పు తరలింపు నిలిచిపోయింది. గుజరాత్‌లోని మొత్తం 20 ఉప్పు శుద్ధి కేంద్రాల్లో 14 కచ్‌లోని గాంధీదామ్‌లో ఉన్నాయి. కాండ్లా, ముంద్రా, టునా పోర్టుల్లో సుమారు 17 లక్షల టన్నుల ఎరువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉన్నందున, ఉప్పుకు రైలు బోగీల కొరత ఏర్పడింది. దీంతో మరో మార్గం లేక ఉప్పు తయారీదారులు తమ సరుకును విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. -
పేదల రేషన్‌లో పప్పు,ఉప్పు కట్!
కంది పప్పు, ఉప్పు కొరతతో రేషన్‌కార్డుదారులకు ఇక్కట్లు ధర పెరగడంతో కాంట్రాక్టుకు వెనుకాడుతున్న ప్రభుత్వం చింతపండు, పసుపు,కారం సరఫరాకు మంగళం? విజయనగరం కంటోన్మెంట్: ఏదైనా పథకానికి పేరు మారుస్తున్నారంటే ఏమనుకోవాలి? అందులో లోపాలను సరిదిద్ది సరి కొత్తగా ప్రజానీకానికి నాణ్యమైన సేవలందిస్తారనేగా.... కానీ తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో పేర్లు మాత్రమే మారుతాయి... పథకాలు నిర్వీర్యమవుతాయడానికి ఉదాహరణే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇంత వరకూ పడుతూలేస్తూ ఏదోరకంగా అమ్మహస్తం పేరుతో తొమ్మిదిరకాల సరుకులను అందిస్తుండగా.... టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథ కం పేరును ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా మార్చారు. పసుపు రంగు కూపన్లు కూడా ప్రింట్ చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం జాబితాలో ఒక్కొక్క వస్తువూ కనుమరుగవుతోంది. పౌరసరఫరాల శాఖ ద్వారా పంపి ణీ అవుతున్న మంచినూనె(పామాయిల్) సరఫరా గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోగా, దానిని పునరుద్ధరించడం మానేసి, ఇప్పుడు కందిపప్పు పంపిణీని కూడా నిలిపివేస్తున్నారు. ఇలా తొమ్మిది రకాల సరుకులను జాబితాలోం చి తొలగించి, పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అసలే పెరిగిపోతున్న ధరాభారంతో ఇబ్బందులు పడుతున్న జనం ఇలా రేషన్ సరుకులను ఒక్కొక్కటిగా తగ్గిస్తుండడంతో మరిన్ని ఇబ్బందులకు గురయ్యేపరిస్థితులు దాపురించనున్నాయి. కొద్ది మందికే పప్పు తినే భాగ్యం బహిరంగ మార్కెట్లో కందిపప్పునకు గిరాకీ ఉంది. దీంతో ధర కూడా బాగా ఎక్కువగా ఉంది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పును కిలో రూ. 50 కే అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర రూ.80. ఇంత ధర పెట్టి కొనుగోలు చేయలేని బీపీఎల్ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కిలో వద్ద ఇంత వ్యత్యాసమున్నప్పుడు పెద్దఎత్తున కాంట్రాక్టు చేసే విషయంలో బడ్జెట్ భారంగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కందిపప్పును ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేసే కాంట్రాక్టును కొనసాగించకుండా నిలిపివేసింది. దీంతో కందిపప్పు తక్కువ స్థాయిలో జిల్లాకు చేరింది. ప్రతినెలా జిల్లాకు 350 మెట్రిక్ టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా ఈ నెల 119 మెట్రిక్ టన్నులను మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికి ఇంతేనని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల చాలా మందికి కందిపప్పు అందే అవకాశం లేదు. దీనిని సరిదిద్దుకునేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు కందిపప్పును డివిజన్ కేంద్రాల్లోనూ బొబ్బిలిలోని కొన్ని షాపులకు సరఫరా చేశారు. దీంతో ఈ నెల పార్వతీపురం, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో మాత్రమే కందిపప్పు లభ్యమవుతుంది. మిగతా ప్రాంతాల్లో పప్పు సరఫరా మరి లే నట్టే. ఉప్పుతిప్పలు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే ఉప్పు నాణ్యంగా ఉండేది. ఇది ఎంఎల్ఎస్ పాయింట్లకు గుజరాత్ నుంచి సరఫరా అయ్యేది. ఇది కూడా ప్రస్తుతం రావడం లేదు. దీంతో వినియోగదారులు ఇష్టపడే ఉప్పు, కందిపప్పు కూడా రావడం లేదు. ఇక పంచదార కేవలం అరకిలో మాత్రమే ఇస్తున్నారు. ఇది కొన్ని సార్లు సరఫరా కావడం లేదు. ఒక్కోనెల పంచదార ఎప్పుడొస్తుందో తెలియదు. చింతపండు, పసుపు, కారం పంపిణీకి మంగళం ? రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న చింత పం డు, కారం, పసుపుల సరఫరాకు మంగళం పాడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో చింతపండు బయట మార్కెట్లోనే తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత కూడా బాగా ఉండడంతో వినియోగదారులు చింతపండు ను రేషన్ షాపుల ద్వారా కొనుగోలు చేయడం మానేశారు. రేషన్ షాపుల ద్వారా చింతపండు అర కిలో రూ.30కు సరఫరా చేస్తున్నారు. ఇదే బయట మార్కె ట్లో మాత్రం ఇది రూ.20కే దొరుకుతోంది. దీనివల్ల చింతపండు కదలడం లేదు. అదేవిధంగా కారం, పసుపు నాణ్యత బాగాలేకపోవడంతో వాటిని కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాకు వచ్చిన సరుకులు అలానే ఉండిపోతున్నాయి. అయితే పరిస్థితి చక్కదిద్దవలసింది పోయి ఏకంగా రెండునెలలుగా సరుకుల ఇండెంట్ పెట్టడం మానేశారు. ఇప్పుడు గోధుమపిండి, గోధుమలు, పంచదార మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని సరుకులు నిలిపివేస్తారో తెలియాల్సి ఉంది. -
ఉప్పుకొట్టుకు దారేది...!
టన్ను ఉప్పు ఉత్పత్తి చేస్తే వారికి దక్కేది రూ.60 మాత్రమే. కిలో ఉప్పు రూ.200 అమ్ముడవుతున్న విషయం చెప్పగానే వారు నిర్వేదంగా నవ్వి ఊరుకున్నారు. తమ జీవితాలు ఉప్పు కొటార్ల మధ్య అనేక అసౌకర్యాల నడుమ నిలువుటెండలో తెల్లారిపోతున్నాయంటూ గుడ్లనీరు కుక్కుకున్నారు. మనకు భయమూ.. భక్తీ రెండూ ఎక్కువే... ఏ వదంతి వినిపించినా ఎంతో భయపడిపోతాం... వెంటనే తగిన జాగ్రత్తల కోసం నానా హైరానా పడిపోతాం.. ఉప్పు కొరత ముంచుకొచ్చిందన్నా.. వినాయకుడు పాలు తాగు తున్నాడన్నా.. ఒకే రకమైన పరుగు... ఉప్పుకోసం కిరాణా షాపుల ముందు క్యూకట్టడం, వినాయకుడి ఆలయాల ముందు పాలక్యాన్లు పట్టుకుని పడిగాపులు పడటంలో మనలను మించిన వారు లేనేలేరు. ఎందుకంటే వదం తులు నమ్మడం మన జన్మహక్కు. నల్లవ్యాపారుల ధనదాహం... ఉప్పు కొరత రానున్నదంటూ ఈ మధ్య పుకార్లు షికారు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. బీహార్, బెంగాల్ వం టి పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్యాన ఉన్న చిన్నా చితక రాష్ట్రాలు కూడా అతలాకుతలమయ్యాయి. కిలో 16 రూపా యలున్న ఉప్పు వంద నుంచి రెండొందల రూపాయల దాకా అమ్ముడు పోయింది. జనం ఎంత ఎగబడితే ధర అంత పెరిగిపోయింది. సెల్ఫోన్ల పుణ్యమా అంటూ క్షణా ల్లో వార్తలు దావానలంలా వ్యాపించాయి. ఉప్పు ప్యాకెట్ల కోసం జనం షాపుల ముందు బారులు తీరారు. చాలా చోట్ల నోస్టాక్ బోర్డులు కనిపించాయి. రోజూ పది ప్యాకెట్లు అమ్మే షాపులు వంద ప్యాకెట్లు అమ్ముకున్నాయి. బీహార్, పశ్చిమబెంగాల్లతో పాటు, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్, నాగాలాండ్ తదితర రాష్ట్రాలలో జనం ఉప్పు ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణాలలో ఈ కలకలం ఎక్కువగా కనిపించింది. దీంతో ఆయా రాష్ట్రాల నిత్యా వసర మంత్రిత్వశాఖలు ప్రత్యేకంగా రంగంలో దిగి జనా న్ని సమాధానపరచాల్సివచ్చింది. మంత్రులు కూడా మనకు ఉప్పు కొరత లేనేలేదంటూ గణాంకాలు ఏకరువు పెడుతూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వాల్సివచ్చింది. దాదాపు 15 మందిని అరెస్టు చేసి ‘మూడో డిగ్రీ’ ప్రయో గిస్తే వారి వెనకున్న దొంగవ్యాపారులంతా బైటపడ్డారు. మందిని భయపెట్టి సొమ్ము చేసుకుందామనుకున్న నల్ల వ్యాపారులకు అలా అరదండాలు పడ్డాయి. ఈ ఉదంతాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ పోటీ పడ్డాయి. వదంతులను రేకెత్తించింది బీజేపీయేనంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించగా, ఉప్పు ధరలను కూడా అదుపు చేయలేక మా మీద విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు తిప్పికొట్టారు. ఉప్పు కొరత ఊహాజనితమే.... మూడువైపులా మహాసముద్రాలున్న మన దేశంలో ఉప్పు కొరత వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? అయినా వదం తులకు లాజిక్కు ఉంటుందా? ఏదైనా పుకారు మన చెవిన పడగానే లేడికి లేచిందే ప్రయాణమన్నట్లు పొలోమంటూ ఎగబడడమే... అసలు మనకు ఉప్పుకు కొరత వచ్చే అవ కాశముందా..? ఈ సందేహం తీరాలంటే ఓమారు ఉప్పు లెక్కలు పరికించాల్సిందే... మనదేశంలో 11,799 రిజిస్టర్డ్ వ్యాపారులు 6.09 లక్షల ఎకరాలలో ఉప్పు సాగు చేస్తు న్నారు. ఏటా సగటున 215.8 లక్షల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తున్నాం. 2009-10లో 240 లక్షల టన్నుల ఉప్పు ఉత్పత్తి కాగా, 2012-13లో 221 లక్షల టన్నులు ఉత్పత్తయింది. 1947లో 10.9 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే స్థితి నుంచి ఈ స్థాయికి చేరుకున్నాం. గుజరాత్, రాజ స్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో మిగులు ఉత్పత్తి జరుగు తున్నది. మొత్తం ఉత్పత్తిలో 76.7 శాతం ఒక్క గుజరాత్ నుంచే వస్తుంది. తమిళనాడులో 11.16 శాతం రాజస్థాన్ లో 9.86 శాతం ఉత్పత్తి జరుగుతున్నది. మిగిలిన 2.28 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, డయ్యూ - డామన్‌ల నుంచి వస్తుంది. అన్ని అవసరాలకూ వినియో గించుకోగా మనం ఏటా సగటున 35 లక్షల టన్నుల ఉప్పును ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. అందుకని ఉప్పు కొరత అన్నది కలలోని మాటే.. ఉప్పు పాతరలో జీవితాలు... కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయంటే అవి పండిం చే రైతుల పంట పండింది అని మనం అనుకోవడం సహ జం. కానీ రైతుకు దక్కేదాంట్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మధ్య దళారులే ఈ పరిస్థితులను సొమ్ము చేసుకుంటారు. అలాగే ఉప్పు రైతులు, కార్మికుల స్థితిగతుల్లోనూ అధిక ధరలు ఎలాంటి మార్పునూ తీసుకురాలేదు. ఉప్పు కిలో రూ.200 అమ్ముతుండటంపై ఓ చానెల్ విలేకరులు గుజ రాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కార్మికులతో మాట్లా డారు. అగారియా తెగకు చెందిన అనేక కుటుంబాలు ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేస్తూ జీవిస్తున్నాయి. అనేక తరాలుగా వారికి ఇదే జీవనం. టన్ను ఉప్పు ఉత్పత్తి చేస్తే వారికి దక్కేది రూ.60 మాత్రమే. కిలో ఉప్పు రూ.200 అమ్ముడవుతున్న విషయం చెప్పగానే వారు నిర్వేదంగా నవ్వి ఊరుకున్నారు. తమ జీవితాలు ఉప్పు కొటార్ల మధ్య అనేక అసౌకర్యాల నడుమ నిలువుటెండలో తెల్లారిపోతున్నాయంటూ గుడ్లనీరు కుక్కుకున్నారు. ఇక్కడి వాతావరణంలో పగటిపూట ఎండ వేడిమి ఎక్కువ గానూ, రాత్రి పూట అత్యంత చలిగానూ ఉంటుంది. పగలు 40 డిగ్రీలుండే ఉష్ణొగ్రత రాత్రిపూట 5 డిగ్రీలకు పడిపోతుంది. రోజంతా ఉప్పు కయ్యల్లో నడుస్తూనే ఉంటారు. కాళ్ల రక్షణకు రబ్బరు తొడుగులు లేవు. ఎండ నుంచి రక్షించే ఎలాంటి ఆచ్ఛాదన వారు ఎరుగరు. రోజం తా ఎర్రటి ఎండలో ఉప్పులో నడిచి నడిచీ వారి కాళ్లు కొయ్యముక్కల్లా మారిపోతున్నాయి. మరణించిన తర్వా త వారి శరీరాలను దహనం చేస్తే కాళ్లు మాత్రం ఇనుపము క్కల్లా కాలకుండా అలానే ఉండిపోతున్నాయట. దాంతో బంధువులు ఆ కాళ్లను విడిగా ఉప్పుపాతరేస్తారు. చాలా కాలం తర్వాత అవి సహజసిద్ధంగా కరిగిపోతాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న తమను ఇకనైనా ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు కోరుతు న్నారు. కోట్ల లాభాల గురించి తమకు ఆశలేదని, తమ జీవితాలలో కొద్దిగానైనా మార్పు రావాలని ఆశిస్తున్నా మని వారంటున్నారు. దుర్భర దారిద్య్రంతో సహజీవనం చేస్తున్న ఉప్పు కార్మికులకు ప్రభుత్వాలు తీపికబురు చెబుతాయా..? ఏమో... అదీ ఓ వదంతిలా వ్యాపించినా బాగుండు... విని సంతోషిద్దాం... - సాయి చరణ్ -
‘ఉప్ప’ందుకున్న వదంతులు!
ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు కృత్రిమ కొరత ప్రచారం బీహార్ నుంచి బెంగాల్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్, నాగాలాండ్‌లకు పాకిన వదంతులు అక్రమ నిల్వలతో వ్యాపారుల దందా పాట్నా/షిల్లాంగ్/కోల్‌కతా/ఈటానగర్/కోహిమా:ఉప్పు దొరకటం లేదని బీహార్‌ను హోరెత్తించిన వదంతులు పలు రాష్ట్రాల్లో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాయి. మార్కెట్లో ఉప్పు కోసం తీవ్ర కొరత ఏర్పడిందన్న ప్రచారం తాజాగా పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మిజోరాంలను కూడా తాకింది. తగినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా ఎక్కువగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించినా వదంతులకు తెరపడలేదు. ఉప్పు లభ్యం కావటం లేదనే ఆందోళనతో బీహార్‌లోని పలు జిల్లాల్లో గురువారం ప్రజలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో కొన్ని చోట్ల కిలో ఉప్పు రూ.150 వరకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకోవటం తెలిసిందే. అయితే ఈ వదంతులు ప్రారంభమైన బీహార్‌లో మార్కెట్ ధరకే ఉప్పును అందుబాటులోకి తెచ్చి పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేఘాలయలో వ్యాపారుల దందా ఉప్పు కొరత భయంతో మేఘాలయలో కొందరు వినియోగదారులు కిలో ఏకంగా రూ.300 చొప్పున కొనుగోలు చేసినట్లు వార్తలు రావటంతో దుకాణాలు కిటకిటలాడాయి. ఉప్పు దొరకటం లేదని వదంతులు పొక్కగానే చిల్లర వ్యాపారులు నిల్వలు లేవని దుకాణాల వద్ద బోర్డులు పెట్టారు. షిల్లాంగ్‌లో కొందరు కిలో ఉప్పు రూ.150 చొప్పున విక్రయించేందుకు యత్నించారని సమాచారం అందినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ నిల్వదారుల దందాను అరికట్టేందుకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఉప్పు కొనేందుకు పలుచోట్ల ప్రజలు పోటీపడటంతో మేఘాలయ ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని ప్రకటించాల్సి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అక్రమంగా ఉప్పు దాచిన వ్యాపారులపై అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో 23వేల క్వింటాళ్ల ఉప్పు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉప్పు కొరత వార్తలు నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో కలకలం సృష్టించింది. బెంగాల్లో వదంతులు... ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు కొరత వదంతులు దావానలంలా వ్యాపించటంతో మార్కెట్లో వ్యాపారుల మాయాజాలాన్ని అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అందుబాటులో లేకుండా పోతుందనే భయంతో డార్జిలింగ్‌లో కిలో ఉప్పు రూ.100 పలికింది. ఉత్తర బెంగాల్ పరిధిలోని కూచ్ బెహార్, దక్షిణ దినాజ్‌పూర్, ఉత్తర దినాజ్‌పూర్, డార్జిలింగ్, జల్పాయ్గురి జిల్లాల్లో వదంతుల ప్రభావం కనిపించింది. ఉప్పు కొరత లేదని, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగాల్ ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు చేస్తున్న ప్రచారంపై స్పందించవద్దని ప్రజలను కోరింది.