‘ఉప్ప’ందుకున్న వదంతులు!
ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు కృత్రిమ కొరత ప్రచారం
బీహార్ నుంచి బెంగాల్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్, నాగాలాండ్‌లకు పాకిన వదంతులు
అక్రమ నిల్వలతో వ్యాపారుల దందా
పాట్నా/షిల్లాంగ్/కోల్‌కతా/ఈటానగర్/కోహిమా:ఉప్పు దొరకటం లేదని బీహార్‌ను హోరెత్తించిన వదంతులు పలు రాష్ట్రాల్లో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాయి. మార్కెట్‌లో ఉప్పు కోసం తీవ్ర కొరత ఏర్పడిందన్న ప్రచారం తాజాగా పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మిజోరాంలను కూడా తాకింది. తగినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా ఎక్కువగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించినా వదంతులకు తెరపడలేదు. ఉప్పు లభ్యం కావటం లేదనే ఆందోళనతో బీహార్‌లోని పలు జిల్లాల్లో గురువారం ప్రజలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో కొన్ని చోట్ల కిలో ఉప్పు రూ.150 వరకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకోవటం తెలిసిందే. అయితే ఈ వదంతులు ప్రారంభమైన బీహార్‌లో మార్కెట్ ధరకే ఉప్పును అందుబాటులోకి తెచ్చి పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మేఘాలయలో వ్యాపారుల దందా
ఉప్పు కొరత భయంతో మేఘాలయలో కొందరు వినియోగదారులు కిలో ఏకంగా రూ.300 చొప్పున కొనుగోలు చేసినట్లు వార్తలు రావటంతో దుకాణాలు కిటకిటలాడాయి. ఉప్పు దొరకటం లేదని వదంతులు పొక్కగానే చిల్లర వ్యాపారులు నిల్వలు లేవని దుకాణాల వద్ద బోర్డులు పెట్టారు. షిల్లాంగ్‌లో కొందరు కిలో ఉప్పు రూ.150 చొప్పున విక్రయించేందుకు యత్నించారని సమాచారం అందినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ నిల్వదారుల దందాను అరికట్టేందుకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఉప్పు కొనేందుకు పలుచోట్ల ప్రజలు పోటీపడటంతో మేఘాలయ ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని ప్రకటించాల్సి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అక్రమంగా ఉప్పు దాచిన వ్యాపారులపై అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో 23వేల క్వింటాళ్ల ఉప్పు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉప్పు కొరత వార్తలు నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో కలకలం సృష్టించింది.
బెంగాల్‌లో వదంతులు...
ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు కొరత వదంతులు దావానలంలా వ్యాపించటంతో మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలాన్ని అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అందుబాటులో లేకుండా పోతుందనే భయంతో డార్జిలింగ్‌లో కిలో ఉప్పు రూ.100 పలికింది. ఉత్తర బెంగాల్ పరిధిలోని కూచ్ బెహార్, దక్షిణ దినాజ్‌పూర్, ఉత్తర దినాజ్‌పూర్, డార్జిలింగ్, జల్పాయ్‌గురి జిల్లాల్లో వదంతుల ప్రభావం కనిపించింది. ఉప్పు కొరత లేదని, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగాల్ ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు చేస్తున్న ప్రచారంపై స్పందించవద్దని ప్రజలను కోరింది.