ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాలశాఖ సమాయత్త మవుతోంది. ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని త్వరలో జిల్లాలో ప్రవేశపెట్టబోతోంది. దీనిలో భాగంగా జిల్లాలోని తహసీల్దార్లు, రేషన్‌డీలర్లు, సివిల్ సప్లయీస్ విజిలెన్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డివిజన్‌ల వారీగా నిర్వహించిన శిక్షణలు ఇటీవల ముగి శాయి. ఫిబ్రవరి ఒకటినుంచి డీలర్లు నిత్యావసర వస్తువులను ఈ–పాస్ మిషన్ల సాయంతోనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. తూకాల్లో మోసాలకు పాల్పడకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా త్వరలో అన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేయనున్నారు.
నల్లగొండ : జిల్లాలో 31 మండలాల పరిధిలో 990 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహారభద్రత కార్డులు 4,49,912 కుటుంబాలు కలిగి ఉన్నాయి. దీంట్లో సభ్యులు 13,68,366 మంది ఉన్నారు. ఈ మొత్తం కార్డుదారులకు ప్రతినెలా సబ్సిడీ బియ్యం 87,758 క్వింటాళ్లు, కిరోసిన్ 444 కిలోలీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా అన్నయోజన కార్డుదారులకు 289 క్వింటాళ్ల పంచదార పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు రూపాయికి కిలోచొప్పున ఒక్కొక్కరికి నాలుగు కిలోలు చొప్పున అందజేస్తుండగా..అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చౌకధరకు బియ్యం పంపిణీ చేస్తుంటే అదే బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో రూ.20– 25 ధర పలుకుతోంది. కిరోసిన్ లీటరు రూ.21 లభిస్తే మార్కెట్లో రూ.30–35 పలుకుతోంది. దీనినే అదునుగా భావించిన డీలర్లు, మిలర్ల సహకారంతో బియ్యం, కిరోసిన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయ్ ఈ–పాస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది.
వేలిముద్ర తప్పనిసరి...
వచ్చే నెలనుంచి కార్డుదారులు రేషన్ దుకాణాలకు వెళ్తేనే సరుకులు ఇస్తారు. గతంలో వెళ్లకపోయినా...వారి పేరిట సరుకులు తీసుకున్నట్టుగా రిజిస్టర్‌లో నమోదు చేసుకుని వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తూ ఈ–పాస్ పేరిట కొత్త విధానం అమలు చేయనున్నారు. ఈ విధానంలో ఆహారభద్రత కార్డులో నమోదైన సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే సరుకులు ఇస్తారు. లేదంటే ఈ సరుకులు అలాగే ఉంచి మరుసటి నెలలో తీసుకునే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల కార్డుదారులకు తెలియకుండా సరుకులు పంపిణీ చేయడం కుదరదు.
ఈ–పాస్ మిషన్‌లోనే వివరాలు నిక్షిప్తం...
ఈ–పాస్ విధానంలో వేలిముద్రలు తీసుకునేందుకు వీలుగా బయోమెట్రిక్ మిషన్ ప్రతి రేషన్ దుకాణానికి పంపిణీ చేశారు. ఈ మిషన్‌లో కార్డుదారుల పూర్తిసమాచారం నిక్షిప్తమై ఉంటుంది. వారి ఆధార్ సంఖ్యతో సహా ఇతర వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఈ మిషన్‌లో సెల్‌ఫోన్‌లో ఉండే సిమ్‌ను వినియోగిస్తారు. ఏ రోజున ఎంత మేర సరుకు పంపిణీ అయ్యింది..? ఎంతమంది కార్డుదారులు సరుకులు తీసుకున్నారనే సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు జిల్లా, రాష్ట్రస్థాయిలో తమ సెల్‌ఫోన్‌ల ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. గోదాములనుంచి సరుకు రవాణా కూడా వేగవంతమవుతుంది. సరుకు నిల్వలు నిండుకోగానే విడతలవారీగా రేషన్ దుకాణాలకు బియ్యం, చక్కెర, కిరోసిన్ వెంటనే సరఫరా చేస్తారు. అధికారుల పర్యవేక్షణ కూడా ఇప్పుడున్నంత స్థాయిలో ఉండదు.
అక్రమాలకు అడ్డుకట్ట...
ఈ–పాస్ మిషన్‌లు పనిచేయాలంటే నెట్‌వర్క్ ప్రధానమైంది. జిల్లాలో మారుమూల ప్రాం తాల్లో సెల్‌ఫోన్‌లకే సరిగా సిగ్నల్స్ అందని పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతికపరమైన అంతరాయం కలగకుండా ఆయా ప్రాంతాల్లో నెట్‌వర్క్ సిగ్నల్స్ వచ్చే సిమ్‌కార్డులనే ఈ–పాస్ మిషన్‌లో ఉంచారు. దీంతో సిగ్నల్స్ అందడం లేదనే సమస్య తలెత్తదు. దీంతో పాటు సిగ్నల్స్‌లో అంతరాయం తలెత్తకుండా బూస్టర్ యాంటీనాలు కూడా డీలర్లకు అందజేశారు. ఈ–పాస్ మిషన్‌లకు అనుసంధానంగా ఈ–కాంటాలు (ఎలక్ట్రానిక్ కాంటాలు) కూడా ఉంటాయి. రెండు, మూడు రోజుల్లో ఈ–కాంటాలు డీలర్లకు నేరుగా పంపిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల తూకాల్లో డీలర్లు మోసాలకు పాల్పపడకుండా ఈ–కాంటాలు నిరోధిస్తాయి. ఉదాహరణకు బియ్యం తూకం వేసేక్రమంలో వందగ్రాములు తక్కువ ఉన్నా ఈ–కాంటా అంగీకరించదు. ఈ–మిషన్‌లకు ఈ–కాంటాలకు లింకై ఉంటుంది కావున కార్డుదారులకు ఎంత కోటా రేషన్ ఇవ్వాలో కచ్చితంగా అంత మొత్తం తూకం వేయాల్సిందే. ఇదే పద్ధతి ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద కూడా అమలు చేయనున్నారు. ఈ–కాంటాలపైన తూకం వేసిన తర్వాతే ఎంఎల్‌ఎస్ పాయింట్లనుంచి సరుకులను డీలర్లకు రవాణా చేస్తారు. ఈ నెల 15న క్లోజింగ్ బ్యాలెన్స్ చేశాక మిగిలిన బియ్యంతో ప్రయోగాత్మకంగా డీలర్లు ఈ–పాస్ మిషన్‌లు ఉపయోగించి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే అవకాశం కల్పించారు.
అవకతవకలకు ఆస్కారం ఉండదు
ఫిబ్రవరి ఒకటినుంచి ఈ–పాస్ మిషన్‌లు వినియోగించాలి. డీలర్లు, రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తికావొచ్చింది. రేషన్ వ్యవస్థలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండేం దుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా ప్రత్యేక యాంటీనాలు కూడా ఇస్తున్నాం. ఫిబ్రవరినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ మిషన్‌లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.
– ఉదయ్ కుమార్, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment