‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది.
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్‌డౌన్‌లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది.
సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది.
సాగు.. సంస్కరణల బాట
వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది.
రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది.
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్‌సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి.
కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ
నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్‌సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది.
మౌలిక రంగానికి ప్రాముఖ్యత..
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్‌లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్‌ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది.
‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే
ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్‌లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం.
ప్రజారోగ్యానికి పెద్దపీట..
ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్‌డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది.
గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల జోరు
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్‌వర్క్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది.
దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది
వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు
సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..
► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది.
► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు.
► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు.
► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి.
► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్‌లాక్‌తో తిరిగి ఇది పుంజుకోనుంది.
► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది.
► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్‌మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది.
► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి.
► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే.
► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం.
► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు.
► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది.
► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది.
► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ.
► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది.
► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్‌లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది.
► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి.
కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు.
– చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ
ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్‌లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం.
– ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది.
– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం
Comments
Please login to add a commentAdd a comment