- జనవరి నుంచి తెలంగాణలో అమల్లోకి కొత్త వ్యవస్థ
- ‘సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్’ విధానం అమలుకు కేంద్రం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సరుకుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పంపిణీ వ్యవస్థ(సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్) ద్వారా పీడీఎస్‌ను మరింత సమర్థంగా నిర్వహిం చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటికే ఈ-పీడీఎస్ విధానంతో 69 లక్షల మంది అనర్హులను తొలగించిన పౌరసరఫరాల శాఖ.. కేంద్రం ఆదేశాల మేరకు జనవరి నుంచి కొత్త పంపిణీ వ్యవస్థను అమలు చేసేం దుకు కసరత్తు చేస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణలో రేషన్ పంపిణీ అంతా మాన్యువల్‌గా జరుగుతుండటంతో అన్ని స్థాయిల్లో అక్రమాలు చోటుచేసుకున్నా యి. అధికారులు, డీలర్లు చేతివాటం చూపడంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. బోగస్ కార్డుల ద్వారానే ఏటా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అనర్హుల చేతుల్లోకి వెళ్లింది. కిరోసిన్ అక్రమ మళ్లింపుల ద్వారా ఏటా రూ.1800 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని కేంద్రం తేల్చిం ది. లోపాలపుట్టగా మారిన పీడీఎస్ విధానాన్ని మార్చాల్సిన అవసరాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
కొత్త విధానంతో పూర్తి పారదర్శకం..
ఈ అక్రమాలను నిరోధించే క్రమంలో కేంద్రం కొత్తగా సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో మూడు నెలల కిందటే ఈ విధానాన్ని ప్రారంభించింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో జనవరి నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఎఫ్‌సీఐ నుంచి చౌక ధరల దుకాణం వరకు సరుకుల సరఫరా, పంపిణీకి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.
సరుకు రవాణా చేసే ట్రక్కుల సమాచారం ఎమ్మార్వో మొదలు కిందిస్థాయి అధికారి, డీలర్, గ్రామ ఆహార సంఘం సభ్యుడి వరకు చేరేలా సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకూ సరుకు వివరాలు చేరుతాయి. దీంతో ఎక్కడా అక్రమాలకు తావుండదు. ఈ వ్యవస్థ అమలుకు వీలుగా రాష్ట్రంలోని 172 మండలస్థాయి స్టాక్ పాయింట్లలో ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించనున్నారు. జిల్లాల అధికారులకు సైతం దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.