సంక్షేమ పథకాలకోసం వచ్చిన దరఖాస్తులు
► ఆహారభద్రత కోసం 9,93,277
► పెన్షన్లకు 4,79,802
► కుల ధ్రువీకరణకు 1,09,421
► ఆదాయ సర్టిపికెట్‌కు 1,06,321
► స్థానికత కోసం 91,014
దరఖాస్తుల వెల్లువతో అధికారులు ఉక్కిరిబిక్కిరి సోమవారంతో ముగిసిన గడువుకంటే అధికంగా నమోదయ్యాయి. సంక్షేమ పథకాలకు కొత్తగా దరఖాస్తులకు గడువు ముగియడంతో వచ్చిన వాటన్నింటినీ డివిజన్ల వారీగా పొందుపరిచారు. జిల్లాలో ఇప్పటివరకు ఆహారభద్రత కోసం 9,93,277, ఫించన్ల కోసం 4,79,802, కులధ్రువీకరణకు 1,09,421, ఆదాయం కోసం 1,06,321 స్థానిక త కోసం 91,014 దరఖాస్తులు వచ్చాయి. ఇంత భారీ ఎత్తున దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురవతున్నారు.
మళ్లీ మొదటికి...
ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని భావించిన సీఎం కేసీఆర్ బోగస్ రేషన్‌కార్డులను ఏరివేసేందుకు ఆధార్ అనుసంధానం చేయించారు. కుటుంబాల సంఖ్య కంటే అదనంగా రేషన్‌కార్డులున్నాయని, యుద్ధప్రాతిపదికన తగ్గించే ప్రయత్నాలు చేశారు. గతంలో జిల్లాలో బీపీఎల్ కార్డులు 9,85,478 ఉండగా... వీటిలో దాదాపు 40వేల వరకు ఏరివేశారు. తాజాగా కొత్త కార్డులకు దరఖాస్తులకు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 9,85,557 కుటుంబాలున్నట్లు వెల్లడైంది.
కొత్త రేషన్‌కార్డులకు, ఫించన్లకు ప్రభుత్వం కొన్ని షరతులను విధించడంతో ఈ సారి భారీగా తగ్గవచ్చని భావించారు. మొత్తం కుటుంబాలలో దాదాపు 60 శాతం వరకు మాత్రమే ఆహారభద్రత కోసం కార్డు వస్తాయని అధికారులు భావించారు. కానీ తీరా గడువు ముగిసే సరికి కుటుంబాల కంటే కార్డుల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. జిల్లాలో గతంలో 2,45,639 వృద్దాప్య ఫించన్లు, 1,30,718 వితంతు, 46,484 వికలాంగులు, 14,416 చేనేత, 1,408 గీత కార్మికుల, 20,771 అభయహస్తం ఇలా మొత్తం 4,59,436మంది ఫించన్లు తీసుకునేవారు. అయితే కొత్త దరఖాస్తులు మాత్రం 4,79,802 వచ్చాయి.
అధికారులకు కొత్త చిక్కులు..
ఆహారభద్రత, ఫించన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క మండల పరిధిలో ఎమ్మార్వో, ఎంపీడీఓ తదితరుల ఆధ్వర్యంలో మొత్తం ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఇప్పటికే గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. వీరంతా గ్రామాల్లో ఈ నెల 26 నాటికి, పట్టణాలలో 30నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి గట్టి ఆదేశాలు అందాయి.
పరిశీలనలో ఏమైనా అవకతవకలు జరిగితే దానికి సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలున్నాయి. అయితే ఇన్ని దరఖాస్తులను ఎప్పుడు పూర్తి చేయాలో తెలియక అధికారులు సైతం సతమతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కొత్త ఫించన్లకు సంబంధించి నవంబర్ 2 నుంచి 7 వరకు అర్హతగల వారికి ఉత్తర్వులు ఇచ్చి, 8వ తేదీన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా డబ్బు అందజేయాలని భావిస్తోంది.
17,79,835
Published Tue, Oct 21 2014 2:11 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement