ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. పారదర్శకంగా సరుకులు పంపిణీ చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు నుంచి ఈ-రేషన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ భావిస్తోంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈపీడీఎస్) డాటా బేస్‌లో ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తున్నారు.
ఈపీడీఎస్‌లో ఉన్న కార్డుదారులకు మాత్రమే సరుకులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అనుసంధానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ విధానం అమలైతే బోగస్‌కార్డులకు అడ్డుకట్ట వేయడంతోపాటు రూ.కోట్ల నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా ఉంటాయి. అయితే సరుకులు పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) విధానం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడనున్నారు. ప్రతీ రేషన్ దుకాణాల్లో యంత్రాలు అమర్చి నెట్ సౌకర్యం కల్పిస్తారు. నెట్‌వర్క్ సహాయంతో ఈ యంత్రాలు పనిచేస్తాయి. ఈ విధానం అమలైతే ఈపీడీఎస్‌తో నేరుగా కమిషనరేట్ నుంచి సరుకుల కేటాయింపు జరుగుతుంది.
5.10 లక్షల కార్డులు అనుసంధానం
జిల్లాలో 6,72,011 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 23,81,015 మంది (యూనిట్లు) ఉన్నారు. ఇప్పటి వరకు ఈపీడీఎస్ డాటాబేస్ 5,10,728 రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇంకా 1,61,283 రేషన్ కార్డులను అనుసంధానించాల్సి ఉంది. రేషన్‌కార్డులోని కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటిదాక 16,92,657 మంది తమ ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 6,88,358 మంది ఆధార్ నంబర్లతో అనుసందానం చేయాలి.
5,57,211 మంది వివరాలు అనుసంధానం చేయుటకు అధికారుల వద్ద పెండింగ్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,72,011 తెల్లరేషన్ కార్డులకు, 42,251 రచ్చబండ కూపన్లకు, 1695 అన్నపూర్ణ కార్డులకు, 66,483 అంత్యోదయ కార్డులకు సరుకులు సరఫరా అవుతున్నాయి. రేషన్‌కు ఆధార్ అనుసంధానంతో ఇప్పటి వరకు 24 వేల రేషన్‌కార్డులు బోగస్‌గా తేల్చారు. ప్రస్తుతమున్న కార్డులకు ప్రతి నెల కోటా కింద 10 వేల మెట్రిక్ టన్నుల బి య్యం, 350 క్వింటాళ్ల చక్కెర పంపిణీ అవుతోంది. ఆధార్ అనుసంధానం పూర్తయితే ఈ-రేషన్ అమలుకానుంది.
నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు - వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌర సరఫరాల అధికారి
రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈపీడీఎస్‌లో అనుసంధానం 76 శాతం పూర్తి చేశాం. నిత్యావసరాలు నూతన పీవోఎస్ విధానంతో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఒకేసారి ఈ విధానాన్ని ప్రారంభించవచ్చు. కమిషనరేట్ నుంచి ఆదేశాలు వస్తే ఆగస్టులో ప్రారంభిస్తాం.
ఇక ఈ-రేషన్
Published Fri, Jul 25 2014 1:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement