చౌకగా దొరికే రేషన్ బియ్యాన్ని వండుకుని ఆకలి తీర్చుకుంటూంటారు నిరుపేద వర్గాల వారు. అది వారి నిత్యావసరం కూడా. అలాంటి వారి కడుపు కొట్టాలనే ఆలోచన ఎంతటి కఠిన హృదయం ఉన్న వారికి కూడా కలగదు. కానీ.. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అంతకంటే మించిపోయారు. రేషన్‌బియ్యం, కిరోసిన్‌ను బొక్కి, జేబులు నింపుకోవాలనేది వారి దురాలోచన. అంతటితో ఆగ కుండా రేషన్ డీలర్లతో ‘చీకటి ఒప్పందాలు’ కూడా చేసేసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థనే తమ దుకాణంలా మార్చుకుని, పేదల బతుకులను అపహాస్యం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో విజయవంతమైన బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసి ప్రజా పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు గొప్పగా చెబుతారు. అయితే ఆయన పార్టీకే చెందిన, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రం చౌకధరల దుకాణాలపై పడి పైసలేరుకునే చీకటి ఒప్పందాలతో ప్రజాపంపిణీని అవినీతిమయం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా జరిగే ప్రజాపంపిణీలో అవినీతికి ఆస్కారం ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు పూర్తిగా రేషన్‌షాపు డీలర్లనే తప్పు పట్టలేం. కార్డుదారులు కూడా బాధ్యులే. అటువంటి వ్యవస్థ ఆసరాగా చేసుకుని కొందరు ప్రజాప్రతినిధులు తమకున్న ‘అధికార బలం’తో నెలవారీ మామూళ్లకు బరి తెగిస్తున్నారు. చౌకధరల దుకాణాల నిర్వాహకులు కూడా ఎంతో కొంత సర్దుబాటు చేసుకుంటే చాలనే ముందుచూపుతో వారి ఆదేశాలకు జీ హుజూర్ అంటున్నారు.
జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, దాంతో కలిసి ఉండే కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రహస్య ఒప్పందాలు ఖరారై, వసూళ్ల పర్వానికి తెర లేచింది. కాకినాడ నగరంలో 117, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 111 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి నిర్వాహకులు, నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య మూడు దఫాలు జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో వసూళ్ల పర్వం ప్రారంభమైంది. ఇందులో రెండు రకాల ఒప్పందాలు జరిగాయి. నెలకు ఒక నియోజకవర్గం నుంచి నగదు రూపంలో కొంత, మిగులు బియ్యం అమ్మకాలుగా కొంత.
ఉదాహరణకు కాకినాడ నగరంలోని దుకాణాల నుంచి నెలకు రూ.1.20 లక్షలు, 23 క్వింటాళ్ల బియ్యం, కాకినాడ రూరల్‌లో రూ.90 వేలు, 22 క్వింటాళ్ల బియ్యం ముట్టజెప్పాలనేది వీరి మధ్య కుదిరిన ఒప్పందం. ఇది ఈ నెల నుంచి ప్రారంభం కావాలనే అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఈ ఒప్పందం ప్రతి నెలా పక్కాగా అమలు జరిపేందుకు ఒక్కో దుకాణం నిర్వాహకుడు రూ.1000 నుంచి రూ.1300 వంతున భరించేలా నిర్ణయించారని తెలియవచ్చింది.
ఈ రెండు ఒప్పందాలు కాకుండా మరో కీలకమైన ఒప్పందం మరింత విస్మయాన్ని కలిగిస్తోంది. కొందరు డీలర్లు కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.13, కిరోసిన్ రూ.24కు కొనుగోలు చేయడం పరిపాటి. బహిరంగ మార్కెట్లో బియ్యం రూ.16, కిరోసిన్ రూ.30 వంతున అమ్ముకుంటూ ‘నాలుగు పైసలు’ వెనకేసుకుంటున్నారు. ఆ సొమ్ము నుంచే అన్ని స్థాయిల వారికి ముట్టజెప్పుకొనే పరిస్థితి. నెలాఖరున ఒకటి, రెండు క్వింటాళ్ల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ మిగులుతున్నట్టు చూపుతూ, సంచుల అమ్మకాలు సహా మిగిలిన సర్దుబాట్లతో డీలర్లు గట్టెక్కుతున్నారు. ఇక ముందు వాటిని కూడా అధికారులకు చూపించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఎదురైతే తాము చూసుకుంటామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారని తెలిసింది. ఇక్కడ మరో తిరకాసు కూడా ఉంది.
మిగులు బియ్యం, కిరోసిన్ కూడా తాము సూచించే తమ వారికి మాత్రమే, అది కూడా వారు చెప్పే ధరకే విక్రయించాలనే షరతు అమలుచేస్తున్నారు. ఇందుకు సమ్మతించకుంటే మిగులు బియ్యం మార్కెట్‌లో విక్రయించే చర్యలపై ఉక్కుపాదం మోపుతామనే హెచ్చరికలతో నిర్వాహకులు దిగివచ్చి ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో పీడీఎస్ బియ్యం కిలో రూ.16, కిరోసిన్ లీటరు రూ.30 వరకు అమ్ముకుంటున్నట్టుగానే అనుమతించాలన్న నిర్వాహకుల ప్రతిపాదనను ప్రజాప్రతినిధులు తిరస్కరించారని సమాచారం.
నిర్వహణ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాం, ఆ ప్రతిపాదన కష్టసాధ్యమని చేతులెత్తేయగా కాకినాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త రంగంలోకి దిగి ఉభయుల మధ్య సమన్వయం సాధించారని సమాచారం. చివరకు కిలో బియ్యం రూ.14, కిరోసిన్ లీటరు రూ.25 వంతున ప్రజాప్రతినిధులు నిర్ణయించిన వారికే విక్రయించాలనే ఒప్పందానికి వచ్చారు. ఈ రకంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు బరితెగింపు ఆనోటా, ఈనోటా బయటకు పొక్కడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
పెద్దోళ్ల ‘చౌక’ దందా
Published Sat, Sep 6 2014 12:06 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement