ఈ-పోస్.. పెద్ద ఫార్స్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం సర్కారుకు మిగులు చూపుతుండగా, రేషన్ కార్డుదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో ఒక్క మే నెలలోనే రూ.10 కోట్ల రేషన్ మిగిలిందని అధికారులు లెక్కలు చూపుతుండగా, ఈ విధానమే పెద్ద ఫార్స్ అని జనం మండిపడుతున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ సరఫరాలో కోత విధించేందుకు సర్కారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శిస్తున్నారు.
- రోజుకు నాలుగు గంటలు పనిచేయని మిషన్లు
- రేషన్ ముగింపు కటాఫ్ డేట్‌లో మాయ
- సీఎంను త ప్పుదారి పట్టించే నివేదికలు
- ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థలో కృష్ణాజిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం వల్ల ఒక్క మే నెలలో జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల రేషన్ మిగిలింది. ఈ లెక్కన కృష్ణాజిల్లాలో ఏడాదికి రూ. 120 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. ఈ విధానాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అమలు చేస్తే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల రేషన్ దుబారా కాకుండా మిగల్చవచ్చని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో జరిగిన సమీక్షలో రేషన్ సరఫరాపై మాట్లాడారు.
ఈ-పోస్ విధానం ద్వారా రేషన్ కోత విధించే ప్రక్రియ జరుగుతోందని, ఇదంతా పెద్ద ఫార్సు అని సర్వత్వా నిరసన వ్యక్తం అవుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం విస్మయానికి గురిచేస్తోంది. ఇదంతా పచ్చి బూటకమని, రకరకాల కారణాలతో రేషన్ మిగులుతోందని కార్డుదారులు విమర్శిస్తున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
ఈ-పోస్ విధానం వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ప్రరజలు విమర్శిస్తున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ కు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీపై కొత్త విధానం ప్రవేశపెట్టిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేషన్ పొందటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్ సర్వర్లు మొరాయించి గంటల తరబడి నిలబడి వెనక్కి వెళ్లిపోవటం, ఆధార్‌లేని వారికి రేషన్ కోత, వేలిముద్రలు సరిపోక బియ్యం ఎగనామం, కార్డుదారుని కుటంబంలో వారికే సరఫరా చేయడంతో, వృద్ధులు, వికలాంగులకు రేషన్‌కు వెళ్లలేకపోతున్నారు. రేషన్ సరఫరాకు ఆఖరు తేదీ స్పష్టంగా ఉండకపోవటం వంటి కారణాలతో కార్డుదారులకు రేషన్ అందటం లేదని వాపోతున్నారు.
జిల్లాలో మే నెలలో దాదాపు రూ. 10కోట్ల మేరకు రేషన్ మిగిలిపోయిందని, ఆ మొత్తం ప్రభుత్వ బడ్జెట్‌కు ఆదా అయిన ట్లేనని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లాలో 2,158 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో వంద క్వింటాళ్లు పంపిణీ చేసే డిపోలో నెలకు 10 క్వింటాళ్లు మిగిలిపోతున్నాయి. కాగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలు పనిచేయాల్సి ఉండగా రోజుకు నాలుగు గంటలు మిషన్లు పని చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆధార్ నంబర్ లేని వారికి రేషన్ ఇవ్వటం లేదు. జిల్లాలో ఒక శాతం మంది ఆధార్ నమోదు కాని వారు ఉండగా 11 లక్షల కార్డుదారుల్లో సుమారు 11వేల మందికి రేషన్ కట్ అవుతుందని సమాచారం. రేషన్ కోసం ఉపాధి పోగొట్టుకుని వేల కుటుంబాల వారు సరుకులు తీసుకోవడం లేదని చెపుతున్నారు. ప్రతినెలా 1వ తేదీన రేషన్ పంపిణీ ప్రారంభించి చివరి తేదీలో కూడా అధికారులు పథకం ప్రకారం మార్పులు చేస్తున్నారు. ముందుగా 15 తేదీతో రేషన్‌సరఫరా ఆఖరు అని ప్రకటించి, ఆ తరువాత 18, 20వరకు గడువు పొడిగించారు. ఈ విధంగా రేషన్ గడువు ముగింపు తేదీని రకరకాలుగా మార్చి, ఆ తేదీలను ప్రకటించకుండా రేషన్ ఎగవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.