సాక్షి, అమరావతి: నిత్యం విషపు రాతలు రాసే రామోజీకి వాస్తవం ఏదైనా విరోధే. అధికారంలో మనవాడు ఉంటే అప్పు చేసినా అది లోకకల్యాణం కోసమే.. వేరొకరు అధికారంలో ఉండి అప్పు చేస్తే పెను భూతం.. ఇదే రామోజీ పత్రికా ఫిలాసఫీ. అందుకే గురువారం ‘నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ’ శీర్షికతో ఈనాడు పత్రిక పౌర సరఫరాల పైనే పనికిమాలిన ఏడుపు కథనం అచ్చేసింది.
అసత్యాల కథనాలు అల్లింది. రాష్ట్ర విభజన తర్వాతి లెక్కతో మొదలెట్టి.. మధ్యలోని టీడీపీ కాలం నాటి లెక్కల ఎక్కాలను ఎగ్గొట్టి.. ప్రస్తుతం అప్పుల భారం పెరిగిందంటూ.. ప్రతి పేద ఇంటికీ నాణ్యమైన రేషన్ అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ‘అప్పుల’ పేరుతో ఈనాడు రాసిన ‘తప్పుడు రాతల’ పురాణంలో వాస్తవాలేమిటో చూద్దాం..
ఆరోపణ: పౌర సరఫరాల సంస్థ రుణ భారం పెరిగిపోతోంది
వాస్తవం: 2014–15లో పౌర సరఫరాల సంస్థ అప్పు రూ.6,042 కోట్లు. ప్రస్తుతం అది రూ.31,600. ఇందులో రూ.20 వేల కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గ్యారెంటీలతో చేసిన అప్పు. అందులో బ్యాంకులకు తిరిగి చెల్లించింది. రూ.300 కోట్లు మాత్రమే. ప్రస్తుతం.. ప్రభుత్వ గ్యారంటీలతో పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రూ.23,950 కోట్లు అప్పు తీసుకుంటే అందులో రూ.11,800 కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లించింది. వీటిల్లో టీడీపీ హయాంలో తీసుకున్న రుణాలకు రూ.2వేల కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించడం విశేషం.
ఈనాడు రాతల్లో చేసిన అప్పు కనిపిస్తోంది తప్ప.. తిరిగి తీర్చింది చెప్పట్లేదు. వాస్తవానికి పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొంటుంది. దానిని మరాడించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ఇస్తుంది. ఇదంతా జరిగి సబ్సిడీ మొత్తం రాష్ట్రానికి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండేందుకు బ్యాంకు రుణాలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి రావాలి్సన మొత్తం వచ్చిన వెంటనే బ్యాంకులకు తిరిగి చెల్లిస్తోంది.
ఆరోపణ: ప్రభుత్వ గ్యారెంటీలు రూ.42 వేల కోట్లకు చేరాయి
వాస్తవం: పౌర సరఫరాల సంస్థ ప్రస్తుత రుణం రూ.31,600 కోట్లు. వాస్తవానికి రుణాల సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీలు రూ.37 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ అనుమతించిన దానికంటే తీసుకున్న రుణం తక్కువగా ఉంది. ఈనాడు మాత్రం రూ.37 వేల కోట్ల రుణ అనుమతులు ఉండగా.. ప్రభుత్వం కొత్తగా మరో రూ.5 వేల కోట్లకు అనుమతులు ఇవ్వడంతో రూ.42 వేల కోట్లకు చేరాయని రాసుకొచ్చింది.
ఇక్కడ కార్పొరేషన్ రుణం కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఏడాదిలో వినియోగించుకోకుంటే గడువు ముగిసిపోతుంది. ఆ తర్వాత పౌర సరఫరాల సంస్థ తనకు రుణం కావాల్సి వస్తే.. ప్రభుత్వం పాత గ్యారెంటీల్లో నుంచే ఆ మొత్తాన్ని తీసుకుంటుంది. తాజాగా పౌరసరఫరాల సంస్థలో ప్రభుత్వం అలానే రూ.5 వేల కోట్ల రుణ అనుమతులను తీసుకుంది. దీనిని వక్రీకరిస్తూ ఈనాడు రూ.42 వేల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్పింది.
ఆరోపణ: ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయట్లేదు. రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు ఉంటే రూ.900 కోట్లతో సర్దుకోమన్నారు
వాస్తవం: ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు నాలుగేళ్లలో పంచదార, కందిపప్పు, బియ్యానికి రూ.8,766.83 కోట్ల సబ్సిడీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఒకేసారి రూ.7 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈనాడు మాత్రం 2019–20, 2020–21, 2021–22 లెక్కలను మాత్రమే చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు రాబట్టలేని రూ.1,756.57 కోట్లు మొత్తాన్ని తెలంగాణ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా రూ.31,197 కోట్ల సబ్సిడీని ఏపీకి చెల్లించింది.
ఆరోపణ: ధాన్యం బకాయిల కోసం అప్పలు చేస్తోంది. అయినా సమయానికి రైతులకు డబ్బులు చెల్లించట్లేదు
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఆర్బీకేల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ప్రతి పైసా రైతుకు మద్దతు ధర కల్పించేందుకే ఖర్చు చేస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.10,001.43 కోట్లు పౌర సరఫరాల సంస్థ సొమ్మును వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించింది.
అందులో 2019 ఎన్నికలకు ముందు రూ.4 వేల కోట్లు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. పౌర సరఫరాల సంస్థ లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వానికి అవసరం లేకుండాపోయింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4,800 కోట్లు బకాయిలు పెట్టిపోయింది. వీటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని తిరిగి పౌర సరఫరాల సంస్థకు చెల్లించింది. తద్వారా సంస్థ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసింది.
ఇవన్నీ ఈనాడుకు కనిపించవా?
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించేందుకు రూ.58,728.77 కోట్లు ఖర్చు చేసింది. 32, 75,790 మంది రైతుల నుంచి 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇదే టీడీపీ హయాంలో చూస్తే కేవలం 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాస్తవంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎక్కువ మంది ధాన్యం రైతులకు మద్దతు అందించడం విశేషం.
మద్దతు ధరతో పాటే ప్రతి ఖరీఫ్ సీజన్‌లో రూ.400 కోట్లు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చుల కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వీటితో పాటు కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రంలోని రైస్ కార్డుదారులకు ఏప్రి ల్ 2019 నుంచి సెప్టెంబర్ 2022 వర కు ఉచిత బియ్యం పంపిణీ కోసం ఏకంగా రూ.6,329.20 కోట్లు అదనంగా ఖర్చు చేసి పేదలను ఆదుకుంది.
చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?
వీటితో పాటు ప్రతి నెలా నాణ్యమైన బియ్యం ఇంటింటికీ పంపిణీ కోసం రూ.1,146 కోట్లు, బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, పంచదార ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలోనూ వాటిని సబ్సిడీపై అందించినందుకు రూ.2,727.82 కోట్లు, వంట నూనె పంపిణీకి రూ.126 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ సెంటర్లు, పాఠశాలలకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తోంది. వీటన్నింటికీ కలిపి సుమారు రూ.10,329.02 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది.
ఇంత పెద్ద ఎత్తున రైతులకు, పేదల సంక్షేమానికి పని చేస్తున్న ఏపీ ప్రభుత్వంలోని పౌర సరఫరాల సంస్థ రుణ భారం రూ.31,600 కోట్లు ఉంటే... ఇలాంటి సంస్కరణలు లేని.. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అప్పు ఏకంగా రూ.49 వేల కోట్లు ఉండటం గమనార్హం. తెలంగాణలోనూ ఈనాడు పత్రికను నడిపిస్తున్న రామోజీ.. అక్కడ నోరెత్తకుండా.. ఏపీలో మాత్రం గుండెలు బాదుకోవడం ఎల్లో ఏడుపునకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment