e-pass policy
-
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఈ–పాస్ అమలు
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా అంతర్రాష్ట్ర కదలికలపై పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద డీజీపీ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతివ్వాలని, 12 గంటల తర్వాత కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి శుభకార్యాలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు, ఆయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు మాస్‌్కలను ధరించాలని, శానిటైజర్‌ను ఉపయోగించాలన్నారు. కరోనా నిబంధనలను, కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని డీజీపీ కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
గుట్టు విప్పుతున్న ఈ–పాస్..!
సాక్షి, వికారాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో అమలులోకి వచ్చిన ఈ–పాస్ విధానం అనర్హుల గుట్టువిప్పుతోంది. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో సుమారు 25 నుంచి 35 శాతం వరకునిందుకు అనర్హులని స్పష్టమవుతోంది. ఏడాదిగా ప్రతి నెల సరుకుల డ్రాకు దూరం ఉంటున్న కుటుంబాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పీడీఎస్ బియ్యం అవసరం లేనివారు సరుకులకు దూరంగా ఉంటోన్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి బియ్యం అవసరం ఉంటుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బియ్యం ధర రూ.50 పైగా పలుకుతోంది. నాణ్యతను బట్టి ధర ఎక్కువగా ఉంటోంది. మార్కెట్ ధర ప్రకారం బియ్యం కొనాలంటే దారిద్యరేఖకు దిగువ నున్న నిరుపేద కుటుంబాలకు పెను భారమే. ప్రభుత్వ చౌకధరల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం ధర కిలో రూ.1 మాత్రమే. కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున ప్రతి నెల రేషన్ కోటా విడుదల చేస్తోంది. అయితే ప్రతి నెల ఆహార భద్రత కార్డు దారుల్లో కొన్ని కుటుంబాలు సరుకులను తీసుకోవడం లేదు. ఒక వేళ స్థానికంగా లేకున్నా రాష్ట్ర, జిల్లా పోర్టబిలిటి విధానంలో ఎక్కడైనా డ్రా చేసుకునే వెసులు బాటు ఉంటుది. అయినా సరుకుల డ్రా కు మాత్రం దూరం పాటిస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధర కంటే 50 రెట్ల తక్కువ ధరకు బియ్యం పంపిణీ చేస్తున్నా పలువురు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన బియ్యాన్నే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నా ఆహార భద్రత కార్డుదారులు మాత్రం బియ్యం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వెసులు బాటుతో... పేదల బియ్యం పక్కదారి పడుతుండటంతో దానికి అడ్డుకట్టవేసేందుకు పౌరసరఫరాల శాఖ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల నుంచి వరసగా సరుకులు డ్రా చేయని కుటుంబాల ఆహార భద్రత కార్డులను ఎట్టి పరిస్ధితిల్లో తొలగించబోమని సరిగ్గా ఏడాది క్రితం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. అప్పటి వరకు కార్డు రద్దవుతుందని కొందరు అప్పుడప్పుడు బియ్యం కొనుగోలు చేస్తుండగా, మరికొందరు బియ్యం కొనుగోలు చేసి కిరాణం, టిఫిన్ సెంటర్లకు రూ.10 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డుదారుల్లో సగానికి పైగా మధ్య తరగతి కుటుంబాలు ఉండటంతో రేషన్ బియాన్ని కేవలం అల్పహార తయారీకి మా త్రమే వినియోగిస్తుంటారు. రేషన్ బియ్యం అవసరం పెద్దగా ఉండదు. సరుకులు డ్రా చేయ కున్నా పర్వాలేదన్న వెసులు బాటుతో ఇక సరుకులు డ్రా చేయడమే నిలిపివేసినట్లు తెలుస్తోంది. అవసరం లేకపోయినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. గతంలో తెల్లరేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు మధ్య తరగతి, ప్రయివేటు ఉద్యోగులు సైతం భారీగా ఆహార భద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం కార్డు దారుడి కుటుంబంలో సభ్యుడు (యూనిట్)కు ఆరు కిలోల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తోంది. మూడేళ్ల క్రితం వరకు మ్యానువల్ పద్దతిలో బియ్యం పంపిణీ కొనసాగేది. గత రెండేళ్ల క్రితం ఈ–పాస్ ద్వారా సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో డీలర్ల చేతివాటానికి అడ్డుకట్ట పడింది. దీంతో రేషన్ బియ్యం అత్యవసరం లేనివారు రెండు మూడు నెలలకోసారి బియ్యం కొనుగోలు చేసి కార్డు రద్దు కాకుండా కాపాడుకుంటున్నారు. బియ్యం తీసుకోకున్నా కార్డులు రద్దు చేయబోమని అధికారులు ప్రకటించడం బియ్యం అవసరం లేని వారికి ఉపశమనం కలిగినట్లయింది. బియ్యం అవసరం లేని మధ్య తరగతి వర్గాలకు ఆహార భద్రత కార్డు అవసరమా,,? అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
ముద్ర పడితేనే ముద్ద!
సాక్షి, అమరావతి: ఈ–పాస్ విధానం అమల్లోకి వచ్చి నాలుగేళ్లయినా చౌక ధరల దుకాణాల్లో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ కారణాలతో వేలి ముద్రలు సరిగా పడని కార్డుదారులకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా వీఆర్వో ధ్రువీకరణ ద్వారా సబ్సిడీ బియాన్ని ఇస్తున్నారు. అయితే ఈ నెల నుంచి ఈ–పాస్ మిషన్‌లో ఈ అవకాశాన్ని తొలగించారు. వేలి ముద్రల సమస్య ఉన్న కార్డుదారులకు రేషన్ ఎప్పుడు, ఎలా ఇవ్వాలనే అంశంపై ఈనెల 15వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పని చేయని ఐరిష్... రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డులుండగా 48.62 లక్షల మంది లబ్ధిదారులకు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. ఈ–పాస్ వీరిని అనుమతించడం లేదు. ఐరిష్ మిషన్లు ఏర్పాటు చేసినా ఆర్నెళ్ల నుంచి పని చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 2015 సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్న ఈ–పాస్ విధానం వల్ల ఇప్పటివరకు రూ.1,850 కోట్ల విలువైన దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఐదు దాటితే అంతే...
* ఈ-పాస్ విధానంతో ఇంకా తప్పని ఇక్కట్లు * రేషన్ పంపిణీలో కొత్త నిబంధనతో కష్టాలు సూళ్లూరుపేట: చౌకడిపో దుకాణాల్లో సరుకులు పొం దేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంతో ఎంతోమంది లబ్ధిదారులకు సరుకులు అందకుండా ఇబ్బందులుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నెలా 5వ తేదీ లోపే సరుకులు పొందాలి అనే నిబంధనను కొత్తగా తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఇచ్చి బియ్యం, కిరోసిన్, కంది పప్పు, చక్కెర తదితర వస్తువులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పండగలు వచ్చినపుడు రాష్ట్రప్రభుత్వం ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పేరుతో మరో ఐదు రకాలు వస్తువులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు ప్రతి నెలా 20వ తేదీవరకు సరుకులు ఇస్తూ వచ్చారు. నకిలీకార్డులు ఏరివేతకు సంబంధించి ఇటీవల ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన సామెతలా తయారైంది పరిస్థితి. నకిలీ కార్డులు పట్టుబడ్డాయో లేదో గాని నిజంగా నిరుపేదలైన వారికి వేలిముద్రలు సరిపోక సరుకులు అందడం లేదు. చాలా మంది బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. ఈ విధంగా లబ్ధిదారులు సతమవుతుంటే ఇప్పుడు మళ్లీ కొత్తవిధానాన్ని తీసుకొచ్చి పేదవాళ్ల కడుపుమీద వాత పెట్టే పనికి ప్రభుత్వం పూనుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెలా ఐదో తేదీలోపు సరుకులు తీసుకోవాలనే నిబంధనను లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాంబట్టు, మేనకూరు, శ్రీసిటీ సెజ్‌ల్లోని పలు కంపెనీలో పనిచేసే కార్మికులు చాలామందికి ఐదో తరువాత నెల జీతాలు వస్తాయి. జిల్లాలో పరిస్థితి కూడా ఇంచుమించుగా ఐదో తేదీలోపు సరుకులు పొందలేని పరిస్థితులున్నా యి. ఐదో తేదీని ఆఖరు తేదీగా పెడితే చౌకడిపో దుకాణాల్లో సరుకులు ఎవరూ తీసుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ-పాస్‌తో రూ.10 కోట్లు ఆదా సరుకుల పంపిణీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ- పాస్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు రూ.10 కోట్లు విలువచేసే సరుకులు ఆదా చేసినట్టుగా అధికారులు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 8.31 లక్షలున్న తెల్ల రేషన్ కార్డులు నేడు 7,70,359కి చేరినట్లు సమాచారం. వీటిని కూడా వడపోసేందుకు సరుకుల పంపిణీని ఐదో తేదీకి కుదించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే సరుకులు ఇంకా మిగిలిపోయే అవకాశంఉంది. మొత్తానికి నూతన విధానలతో ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీని 15 తేదీని ఆఖరు రోజుగా ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
'నాణ్యత లేని సరుకులు ఇస్తే చర్యలు'
కర్నూలు: కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ లను ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ-పాస్ విధానంలో టెక్నికల్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అందరికి చంద్రన్న కానుకలు అందేలా చూస్తామన్నారు. నాణ్యత లేని సరుకులు సరఫరా చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు -
మార్గదర్శకాలు లేని ఉపకారవేతనాలు
కేంద్ర, రాష్ట్ర వైఖరులతో గిరిజన విద్యార్థులకు అవస్థలు సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతలేని వైఖరితో వ్యవహరించడంతో వేలాదిమంది అవస్థలు పడుతున్నారు. దీనిపై సమన్వయం కొరవడి దరఖాస్తు గడువు చేరువవుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంనుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణమని రాష్ట్ర అధికారులు అంటున్నారు. వాస్తవంగా దరాఖాస్తుదారుల్లో 40శాతం మందికే కేంద్రం ఉపకారవేతనాలను తనవంతుగా చెల్లిస్తుంది. అయితే అందుకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంతో కాకుండా కేంద్రమే వీటిని నేరుగా అందించాలన్న భావనతోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రప్రభుత్వాల భూమిక ఎలా ఉండాలన్నది తెలియడం లేదని ఇక్కడి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌మెట్రిక్‌స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల (జూలై) 31 ఆఖరు తేదీ కాగా రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్‌లో ఒక్కశాతంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇక ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దర ఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగా కేంద్రం ప్రకటించింది. 2015-16లో ఈ విద్యార్థులకు నేరుగా స్కాలర్షిప్లను వారి బ్యాంక్‌ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పథకాన్ని ఏ విధంగా అనుసంధానిస్తారనే దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో రాష్ట్రాలకు ఎటూ పాలుపోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్’ ద్వారా www.scholarships.gov.in వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం నిర్దేశించగా, రాష్ట్రంలో 2008 నుంచి, ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించగా తెలంగాణ, ఏపీ నుంచి ఎస్టీశాఖ ఉన్నతాధికారులు హాజరై తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను గురించి వివరించారు. అయితే ఇప్పటికీ కేంద్రంనుంచి ఉపకార వేతనాలపై స్పష్టమైన వైఖరితో ఆదేశాలు లేక గిరిజన విద్యార్థులు కలవరపడుతున్నారు. -
ఈ-పోస్.. పెద్ద ఫార్స్
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం సర్కారుకు మిగులు చూపుతుండగా, రేషన్ కార్డుదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో ఒక్క మే నెలలోనే రూ.10 కోట్ల రేషన్ మిగిలిందని అధికారులు లెక్కలు చూపుతుండగా, ఈ విధానమే పెద్ద ఫార్స్ అని జనం మండిపడుతున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ సరఫరాలో కోత విధించేందుకు సర్కారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శిస్తున్నారు. - రోజుకు నాలుగు గంటలు పనిచేయని మిషన్లు - రేషన్ ముగింపు కటాఫ్ డేట్లో మాయ - సీఎంను త ప్పుదారి పట్టించే నివేదికలు - ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత విజయవాడ : ప్రజాపంపిణీ వ్యవస్థలో కృష్ణాజిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం వల్ల ఒక్క మే నెలలో జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల రేషన్ మిగిలింది. ఈ లెక్కన కృష్ణాజిల్లాలో ఏడాదికి రూ. 120 కోట్ల బడ్జెట్ మిగులుతుంది. ఈ విధానాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అమలు చేస్తే ఏడాదికి రూ. వెయ్యి కోట్ల రేషన్ దుబారా కాకుండా మిగల్చవచ్చని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో జరిగిన సమీక్షలో రేషన్ సరఫరాపై మాట్లాడారు. ఈ-పోస్ విధానం ద్వారా రేషన్ కోత విధించే ప్రక్రియ జరుగుతోందని, ఇదంతా పెద్ద ఫార్సు అని సర్వత్వా నిరసన వ్యక్తం అవుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం విస్మయానికి గురిచేస్తోంది. ఇదంతా పచ్చి బూటకమని, రకరకాల కారణాలతో రేషన్ మిగులుతోందని కార్డుదారులు విమర్శిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం ఈ-పోస్ విధానం వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ప్రరజలు విమర్శిస్తున్నారు. రకరకాల గిమ్మిక్కులతో రేషన్ కు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీపై కొత్త విధానం ప్రవేశపెట్టిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేషన్ పొందటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ సర్వర్లు మొరాయించి గంటల తరబడి నిలబడి వెనక్కి వెళ్లిపోవటం, ఆధార్‌లేని వారికి రేషన్ కోత, వేలిముద్రలు సరిపోక బియ్యం ఎగనామం, కార్డుదారుని కుటంబంలో వారికే సరఫరా చేయడంతో, వృద్ధులు, వికలాంగులకు రేషన్‌కు వెళ్లలేకపోతున్నారు. రేషన్ సరఫరాకు ఆఖరు తేదీ స్పష్టంగా ఉండకపోవటం వంటి కారణాలతో కార్డుదారులకు రేషన్ అందటం లేదని వాపోతున్నారు. జిల్లాలో మే నెలలో దాదాపు రూ. 10కోట్ల మేరకు రేషన్ మిగిలిపోయిందని, ఆ మొత్తం ప్రభుత్వ బడ్జెట్‌కు ఆదా అయిన ట్లేనని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. జిల్లాలో 2,158 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో వంద క్వింటాళ్లు పంపిణీ చేసే డిపోలో నెలకు 10 క్వింటాళ్లు మిగిలిపోతున్నాయి. కాగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలు పనిచేయాల్సి ఉండగా రోజుకు నాలుగు గంటలు మిషన్లు పని చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆధార్ నంబర్ లేని వారికి రేషన్ ఇవ్వటం లేదు. జిల్లాలో ఒక శాతం మంది ఆధార్ నమోదు కాని వారు ఉండగా 11 లక్షల కార్డుదారుల్లో సుమారు 11వేల మందికి రేషన్ కట్ అవుతుందని సమాచారం. రేషన్ కోసం ఉపాధి పోగొట్టుకుని వేల కుటుంబాల వారు సరుకులు తీసుకోవడం లేదని చెపుతున్నారు. ప్రతినెలా 1వ తేదీన రేషన్ పంపిణీ ప్రారంభించి చివరి తేదీలో కూడా అధికారులు పథకం ప్రకారం మార్పులు చేస్తున్నారు. ముందుగా 15 తేదీతో రేషన్సరఫరా ఆఖరు అని ప్రకటించి, ఆ తరువాత 18, 20వరకు గడువు పొడిగించారు. ఈ విధంగా రేషన్ గడువు ముగింపు తేదీని రకరకాలుగా మార్చి, ఆ తేదీలను ప్రకటించకుండా రేషన్ ఎగవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఈ-పాస్‌తో గుట్టు రట్టు
రేషన్ పంపిణీకి ఈ-పాస్ విధానం ⇒ మార్చి 1 నుంచి మున్సిపాలిటీల్లో అమలు ⇒ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఇంకా స్కేల్ కాటాలే ⇒ కిరోసిన్‌కు ఈ-పాస్ ఇప్పట్లో లేనట్లే ⇒ ఆర్వోలు ఎవరు రాయాలో తెలియని సందిగ్ధత ⇒ కమీషన్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లేందుకు రేషన్ డీలర్ల సన్నద్ధం ఒంగోలు: రేషన్ పంపిణీలో అక్రమాలకు ఈ-పాస్ విధానంతో అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే రేషన్‌కార్డులకు, డీలర్ల లెసైన్సులకు డీలర్ ఆధార్ అనుసంధానం చేయడంతో బినామీలకు చెక్ పడింది. ఈ-పాస్ విధానంతో రేషన్ డీలర్లకు మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. ఏది ఏమైనా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మార్చి 1వ తేదీ నుంచి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయాల్సిందేన ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బినామీ డీలర్ల వ్యవహారం అధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఆధార్‌తో అక్రమాలకు చెక్: రేషన్ సరుకులు అర్హులైన వారికే అందాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఆధార్ ప్రక్రియను పౌరసరఫరాల శాఖలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కార్డులో ఎవరి పేర్లు ఉన్నాయో వారే వచ్చి ఈపాస్ మెషీన్లలో వేలిముద్ర ఉంచితే తప్ప డీలర్ సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియలో అక్రమాలు అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ వ్యవహారంలో కార్డుదారుల ఆధార్‌ను మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసంధానం చేస్తూ వచ్చింది. తాజాగా డీలర్ ఆధార్ కూడా తప్పనిసరి అని చెప్పడంతో వారినోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తొలి విడతలో పది శాతం దుకాణాలకే ఈ-పాస్: ఇటీవల డీలర్లకు ఈ-పాస్ మెషీన్లు తప్పనిసరి చేశారు. వీటితో పాటు వేయింగ్ మెషీన్లను కూడా ఇస్తున్నారు. వాటితో పాటు కరెంటు లేకున్నా నాలుగు గంటల పాటు చార్జింగ్‌తో నడిచేలా వాటికి బ్యాటరీలు ఏర్పాటు చేశారు. జిల్లాకు దాదాపు 2,500 వరకు ఈ-పాస్ మెషీన్లు అవసరం కానున్నాయి. కేవలం బియ్యం డీలర్ల వరకు మాత్రమే పరిశీలిస్తే 2118 ఈపాస్ మెషీన్లు అవసరం. తొలి విడతలో జిల్లాకు 220 మెషీన్లు మంజూరయ్యాయి. అంటే పదోవంతు అన్నమాట. వీటిలో బుధవారం నాటికి జిల్లాకు చేరిన మెషీన్లు కేవలం 91. మిగిలిన 129 మెషీన్లు కూడా రెండు మూడురోజుల్లోనే రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చిన వాటిని ఒంగోలు నగర పంచాయతీ, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీలతోపాటు మరో రెండు నగర పంచాయతీలు లేదా మండలాల్లో అమర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో స్కేల్ కాటాలే: రేషన్ డీలర్ల వద్ద ఈ వెయ్యింగ్ మెషీన్లు తప్పనిసరి అంటున్న ప్రభుత్వం, మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల(ఎంఎల్ఎస్ పాయింట్లు) వద్ద మాత్రం స్కేల్ కాటాలే ఉంచడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు పంపిణీ అయ్యే సరుకులో చేతివాటం బాగా కనిపించేది. దీనిపై ప్రశ్నించే సాహసం చేయకుండా తమ వంతు చేతివాటం ప్రదర్శిస్తూ అనేకమంది డీలర్లు నెట్టుకొస్తున్నారు. కానీ తాజాగా రేషన్ డీలర్ తప్పనిసరిగా ఈ పాస్ మెషీన్ వినియోగించాల్సి రావడంతో వారు బెంబేలెత్తుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం లేకపోతే తాము ఎలా సక్రమంగా తూకం ఇవ్వగలమనేది వారి వాదన. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో సరిపోదని, డెలివరీ ఇచ్చే సమయంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన ఈ వెయ్యింగ్ మెషీన్ మీద తూకం వేసుకొని సరుకు తీసుకోవాలని డీలర్లు భావిస్తున్నారు. ఇదే జరిగితే రేషన్ డీలర్లకు, ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులకు మధ్య చిచ్చు రగిలినట్లే. నామినీ పేరుతో నాటకాలు: రేషన్ డీలర్ లెసైన్స్‌లకు డీలర్ ఆధార్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా ఈ-పాస్ మెషీన్లు ఏర్పాటు చేసేందుకు వెళ్లిన అధికారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. అసలు డీలర్ కనిపించకుండా అతని కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ప్రత్యక్షం అవుతున్నారు. తప్పకుండా డీలర్ రావాల్సిందేనని, వారి ఆధార్ ఫీడ్ చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు అతని వేలిముద్రను కూడా ఈపాస్ మెషీన్‌కు అనుసంధానం చేయాలని సూచిస్తున్నారు. బినామీ డీలర్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టారు. ఒంగోలు నగరంలోనే దాదాపు 15 మంది బినామీల చేతుల్లో డీలర్ షాపులున్నట్లు సమాచారం. అయితే అసలు డీలర్ ఎక్కడ ఉన్నారనేది అర్థం కాకుండా ఉంది. లెసైన్స్ పొందిన డీలర్ దానిని మరొకరికి ఎంతో కొంతకు విక్రయించేసి ఉండడమో లేక, అత ను మృత్యువాత పడడమో లేక మరో ఇతర కారణం చే తో అతనికి బదులుగా బినామీలు నడుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నామినీగా చెప్పుకుంటున్న వాటిలో కూడా ఒక రేషన్ షాపునకు ప్రభుత్వ ఉద్యోగి పేరు ఉందనే ఆరోపణలు అధికారుల దృష్టికి చేరాయి. ఆ ఉద్యోగి ఏ డిపార్టుమెంట్లో పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. కిరోసిన్‌కు మాత్రం ఇప్పట్లో లేనట్లే: తొలి విడత కేవలం పది శాతం దుకాణాలకు మాత్రమే ఈ-పాస్ మెషీన్లను సప్లయ్ చేస్తున్నందున కిరోసిన్ హాకర్లకు సంబంధించి ఇప్పట్లో ఈ పాస్ లేనట్లే అని స్పష్టమవుతోంది. కిరోసిన్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దానిని కిరోసిన్ హాకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. దీనికి కూడా ఈపాస్ ఏర్పాటుచేస్తే భారీ మొత్తంలోనే కిరోసిన్ విక్రయాలు పడిపోతాయి. లేదంటే హాకర్లు నేరుగా సంబంధిత కార్డుదారుడ్ని బతిమలాడుకొని అతని చేత వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం 90 శాతం సాధ్యం కాని పని. కమీషన్ వ్యవహారంపై కోర్టుకెళ్లే యోచనలో డీలర్లు: రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న సరుకుల రకాలు తగ్గిపోయాయి. ఈ-పాస్ మెషీన్లంటూ రేషన్ డీలర్లను జవాబుదారీ చేస్తున్నారు. కానీ వారు కోరుతున్నట్లు కనీస వేతనాల సమస్యపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. దానికితోడు కమీషన్‌ను సైతం పెంచేందుకు ప్రభుత్వం దాటవేత వైఖరి ప్రదర్శిస్తోంది. తమకు నెలకు కనీస వేతనం కాదు కదా దుకాణం అద్దె, అందులో పనిచేసే హెల్పర్‌కు జీతాన్ని సైతం ఇచ్చే పరిస్థితి ఉండదని డీలర్లంటున్నారు. అందువల్ల ఈ పాస్ విధానం అమలు కాకముందే హైకోర్టును ఆశ్రయించాలని పలువురు డీలర్లు భావిస్తున్నారు. అయితే డీలర్ల సంఘం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సంఘీభావం దక్కడం లేదు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా అటువంటి వ్యవహారాల జోలికి వెళ్లొద్దని...అదే జరిగితే డీలర్‌షిప్‌లు వదులుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్వోల వ్యవహారంపైనా కొనసాగుతున్న సందిగ్ధత: డీలర్లు డీడీలు కట్టగానే కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయానికి అలాట్మెంట్ ఉత్తర్వులు వస్తాయి. అవి రాగానే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తహ శీల్దారులకు మండలాల వారీగా అలాట్మెంట్ ఉత్తర్వులు రిలీజ్ చేస్తారు. వాటిని తహశీల్దారు డీలర్వారీగా కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ పాస్ విధానం ప్రకారం తహ శీల్దారుకు సంబంధం లేకుండానే అంటే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే నేరుగా డీలర్‌కు సరుకు చేరాలి. అదే జరిగితే రిలీజింగ్ ఆర్డర్లు(ఆర్వో)లు ఎవరు రాయాలనే సందిగ్ధత ప్రస్తుతం నెలకొంది. ఎంఎల్ఎస్ పాయింట్లలోని అధికారులు ఆర్వోలు జారీ చేస్తారా లేక తహ శీల్దారులే వాటిని విడుదల చేయాలా అనేది అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.