ఈ-పాస్‌తో గుట్టు రట్టు | Ration distribution to e-pass policy | Sakshi
Sakshi News home page

ఈ-పాస్‌తో గుట్టు రట్టు

Published Sat, Feb 28 2015 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

ఈ-పాస్‌తో గుట్టు రట్టు

ఈ-పాస్‌తో గుట్టు రట్టు

రేషన్ పంపిణీకి ఈ-పాస్ విధానం
మార్చి 1 నుంచి మున్సిపాలిటీల్లో అమలు
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఇంకా స్కేల్ కాటాలే
కిరోసిన్‌కు ఈ-పాస్ ఇప్పట్లో లేనట్లే
ఆర్వోలు ఎవరు రాయాలో తెలియని సందిగ్ధత
కమీషన్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లేందుకు రేషన్ డీలర్ల సన్నద్ధం

ఒంగోలు: రేషన్ పంపిణీలో అక్రమాలకు ఈ-పాస్ విధానంతో అడ్డుకట్ట పడనుంది.

ఇప్పటికే రేషన్‌కార్డులకు, డీలర్ల లెసైన్సులకు డీలర్ ఆధార్ అనుసంధానం చేయడంతో బినామీలకు చెక్ పడింది. ఈ-పాస్ విధానంతో రేషన్ డీలర్లకు మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. ఏది ఏమైనా జిల్లాలోని మున్సిపాలిటీల్లో మార్చి 1వ తేదీ నుంచి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయాల్సిందేన ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బినామీ డీలర్ల వ్యవహారం అధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది.
 
ఆధార్‌తో అక్రమాలకు చెక్:
రేషన్ సరుకులు అర్హులైన వారికే అందాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఆధార్ ప్రక్రియను పౌరసరఫరాల శాఖలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కార్డులో ఎవరి పేర్లు ఉన్నాయో వారే వచ్చి ఈపాస్ మెషీన్లలో వేలిముద్ర ఉంచితే తప్ప డీలర్ సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉండదు. ఈ ప్రక్రియలో అక్రమాలు అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ వ్యవహారంలో కార్డుదారుల ఆధార్‌ను మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసంధానం చేస్తూ వచ్చింది. తాజాగా డీలర్ ఆధార్ కూడా తప్పనిసరి అని చెప్పడంతో వారినోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.  
 
తొలి విడతలో పది శాతం దుకాణాలకే ఈ-పాస్:
ఇటీవల డీలర్లకు ఈ-పాస్ మెషీన్లు తప్పనిసరి చేశారు. వీటితో పాటు వేయింగ్ మెషీన్లను కూడా ఇస్తున్నారు. వాటితో పాటు కరెంటు లేకున్నా నాలుగు గంటల పాటు చార్జింగ్‌తో నడిచేలా వాటికి బ్యాటరీలు ఏర్పాటు చేశారు. జిల్లాకు దాదాపు 2,500 వరకు ఈ-పాస్ మెషీన్లు అవసరం కానున్నాయి. కేవలం బియ్యం డీలర్ల వరకు మాత్రమే పరిశీలిస్తే 2118 ఈపాస్ మెషీన్లు అవసరం.

తొలి విడతలో జిల్లాకు 220 మెషీన్లు మంజూరయ్యాయి. అంటే పదోవంతు అన్నమాట. వీటిలో బుధవారం నాటికి జిల్లాకు చేరిన మెషీన్లు కేవలం 91. మిగిలిన 129 మెషీన్లు కూడా రెండు మూడురోజుల్లోనే రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చిన వాటిని ఒంగోలు నగర పంచాయతీ, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీలతోపాటు మరో రెండు నగర పంచాయతీలు లేదా మండలాల్లో అమర్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
 
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో స్కేల్ కాటాలే:

రేషన్ డీలర్ల వద్ద ఈ వెయ్యింగ్ మెషీన్లు తప్పనిసరి అంటున్న ప్రభుత్వం, మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల(ఎంఎల్‌ఎస్ పాయింట్లు) వద్ద మాత్రం స్కేల్ కాటాలే ఉంచడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు పంపిణీ అయ్యే సరుకులో చేతివాటం బాగా కనిపించేది. దీనిపై ప్రశ్నించే సాహసం చేయకుండా తమ వంతు చేతివాటం ప్రదర్శిస్తూ అనేకమంది డీలర్లు నెట్టుకొస్తున్నారు.

కానీ తాజాగా రేషన్ డీలర్ తప్పనిసరిగా ఈ పాస్ మెషీన్ వినియోగించాల్సి రావడంతో వారు బెంబేలెత్తుతున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం లేకపోతే తాము ఎలా సక్రమంగా తూకం ఇవ్వగలమనేది వారి వాదన. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో సరిపోదని, డెలివరీ ఇచ్చే సమయంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన ఈ వెయ్యింగ్ మెషీన్ మీద తూకం వేసుకొని సరుకు తీసుకోవాలని డీలర్లు భావిస్తున్నారు. ఇదే జరిగితే రేషన్ డీలర్లకు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల అధికారులకు మధ్య చిచ్చు రగిలినట్లే.
 
నామినీ పేరుతో నాటకాలు:
రేషన్ డీలర్ లెసైన్స్‌లకు డీలర్ ఆధార్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా ఈ-పాస్ మెషీన్లు ఏర్పాటు చేసేందుకు వెళ్లిన అధికారులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. అసలు డీలర్ కనిపించకుండా అతని కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ప్రత్యక్షం అవుతున్నారు. తప్పకుండా డీలర్ రావాల్సిందేనని, వారి ఆధార్ ఫీడ్ చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు అతని వేలిముద్రను కూడా ఈపాస్ మెషీన్‌కు అనుసంధానం చేయాలని సూచిస్తున్నారు.

బినామీ డీలర్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టారు. ఒంగోలు నగరంలోనే దాదాపు 15 మంది బినామీల చేతుల్లో డీలర్ షాపులున్నట్లు సమాచారం. అయితే అసలు డీలర్ ఎక్కడ ఉన్నారనేది అర్థం కాకుండా ఉంది. లెసైన్స్ పొందిన డీలర్ దానిని మరొకరికి ఎంతో కొంతకు విక్రయించేసి ఉండడమో లేక, అత ను మృత్యువాత పడడమో లేక మరో ఇతర కారణం చే తో అతనికి బదులుగా బినామీలు నడుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నామినీగా చెప్పుకుంటున్న వాటిలో కూడా ఒక రేషన్ షాపునకు ప్రభుత్వ ఉద్యోగి పేరు ఉందనే ఆరోపణలు అధికారుల దృష్టికి చేరాయి. ఆ ఉద్యోగి ఏ డిపార్టుమెంట్‌లో పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు.  
 
కిరోసిన్‌కు మాత్రం ఇప్పట్లో లేనట్లే:
తొలి విడత కేవలం పది శాతం దుకాణాలకు మాత్రమే ఈ-పాస్ మెషీన్లను సప్లయ్ చేస్తున్నందున కిరోసిన్ హాకర్లకు సంబంధించి ఇప్పట్లో ఈ పాస్ లేనట్లే అని స్పష్టమవుతోంది. కిరోసిన్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దానిని కిరోసిన్ హాకర్లు క్యాష్ చేసుకుంటున్నారు.  దీనికి కూడా ఈపాస్ ఏర్పాటుచేస్తే భారీ మొత్తంలోనే కిరోసిన్ విక్రయాలు పడిపోతాయి. లేదంటే హాకర్లు నేరుగా సంబంధిత కార్డుదారుడ్ని బతిమలాడుకొని అతని చేత వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం 90 శాతం సాధ్యం కాని పని.  
 
కమీషన్ వ్యవహారంపై కోర్టుకెళ్లే యోచనలో డీలర్లు:
రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న సరుకుల రకాలు తగ్గిపోయాయి. ఈ-పాస్ మెషీన్లంటూ రేషన్ డీలర్లను జవాబుదారీ చేస్తున్నారు. కానీ వారు కోరుతున్నట్లు కనీస వేతనాల సమస్యపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. దానికితోడు కమీషన్‌ను సైతం పెంచేందుకు ప్రభుత్వం దాటవేత వైఖరి ప్రదర్శిస్తోంది. తమకు నెలకు కనీస వేతనం కాదు కదా దుకాణం అద్దె, అందులో పనిచేసే హెల్పర్‌కు జీతాన్ని సైతం ఇచ్చే పరిస్థితి ఉండదని డీలర్లంటున్నారు.  

అందువల్ల ఈ పాస్ విధానం అమలు కాకముందే హైకోర్టును ఆశ్రయించాలని పలువురు డీలర్లు భావిస్తున్నారు. అయితే డీలర్ల సంఘం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సంఘీభావం దక్కడం లేదు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా అటువంటి వ్యవహారాల జోలికి వెళ్లొద్దని...అదే జరిగితే డీలర్‌షిప్‌లు వదులుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.
 
ఆర్‌వోల వ్యవహారంపైనా కొనసాగుతున్న సందిగ్ధత:
డీలర్లు డీడీలు కట్టగానే కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయానికి అలాట్‌మెంట్ ఉత్తర్వులు వస్తాయి. అవి రాగానే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తహ శీల్దారులకు మండలాల వారీగా అలాట్‌మెంట్ ఉత్తర్వులు రిలీజ్ చేస్తారు. వాటిని తహశీల్దారు డీలర్‌వారీగా కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ పాస్ విధానం ప్రకారం తహ శీల్దారుకు సంబంధం లేకుండానే అంటే ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే నేరుగా డీలర్‌కు సరుకు చేరాలి. అదే జరిగితే రిలీజింగ్ ఆర్డర్లు(ఆర్‌వో)లు ఎవరు రాయాలనే సందిగ్ధత ప్రస్తుతం నెలకొంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లలోని అధికారులు ఆర్‌వోలు జారీ చేస్తారా లేక తహ శీల్దారులే వాటిని విడుదల చేయాలా అనేది అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement