* ఈ-పాస్ విధానంతో ఇంకా తప్పని ఇక్కట్లు
* రేషన్ పంపిణీలో కొత్త నిబంధనతో కష్టాలు
సూళ్లూరుపేట: చౌకడిపో దుకాణాల్లో సరుకులు పొం దేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంతో ఎంతోమంది లబ్ధిదారులకు సరుకులు అందకుండా ఇబ్బందులుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నెలా 5వ తేదీ లోపే సరుకులు పొందాలి అనే నిబంధనను కొత్తగా తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఇచ్చి బియ్యం, కిరోసిన్, కంది పప్పు, చక్కెర తదితర వస్తువులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పండగలు వచ్చినపుడు రాష్ట్రప్రభుత్వం ఉనికిని చాటుకునేందుకు చంద్రన్న కానుక పేరుతో మరో ఐదు రకాలు వస్తువులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకు ప్రతి నెలా 20వ తేదీవరకు సరుకులు ఇస్తూ వచ్చారు. నకిలీకార్డులు ఏరివేతకు సంబంధించి ఇటీవల ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన సామెతలా తయారైంది పరిస్థితి. నకిలీ కార్డులు పట్టుబడ్డాయో లేదో గాని నిజంగా నిరుపేదలైన వారికి వేలిముద్రలు సరిపోక సరుకులు అందడం లేదు. చాలా మంది బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు.
ఈ విధంగా లబ్ధిదారులు సతమవుతుంటే ఇప్పుడు మళ్లీ కొత్తవిధానాన్ని తీసుకొచ్చి పేదవాళ్ల కడుపుమీద వాత పెట్టే పనికి ప్రభుత్వం పూనుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెలా ఐదో తేదీలోపు సరుకులు తీసుకోవాలనే నిబంధనను లబ్ధిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సూళ్లూరుపేట నియోజకవర్గంలో మాంబట్టు, మేనకూరు, శ్రీసిటీ సెజ్‌ల్లోని పలు కంపెనీలో పనిచేసే కార్మికులు చాలామందికి ఐదో తరువాత నెల జీతాలు వస్తాయి. జిల్లాలో పరిస్థితి కూడా ఇంచుమించుగా ఐదో తేదీలోపు సరుకులు పొందలేని పరిస్థితులున్నా యి. ఐదో తేదీని ఆఖరు తేదీగా పెడితే చౌకడిపో దుకాణాల్లో సరుకులు ఎవరూ తీసుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ-పాస్‌తో రూ.10 కోట్లు ఆదా
సరుకుల పంపిణీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ- పాస్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు రూ.10 కోట్లు విలువచేసే సరుకులు ఆదా చేసినట్టుగా అధికారులు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 8.31 లక్షలున్న తెల్ల రేషన్ కార్డులు నేడు 7,70,359కి చేరినట్లు సమాచారం. వీటిని కూడా వడపోసేందుకు సరుకుల పంపిణీని ఐదో తేదీకి కుదించింది.
ఈ విధానాన్ని అమలు చేస్తే సరుకులు ఇంకా మిగిలిపోయే అవకాశంఉంది. మొత్తానికి నూతన విధానలతో ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు పంపిణీని 15 తేదీని ఆఖరు రోజుగా ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఐదు దాటితే అంతే...
Published Wed, Feb 24 2016 6:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement
Advertisement