రేషన్ షాపులు ద్వారానే పంపిణీ
అరకు కాఫీ అవుట్‌లెట్ల విస్తరణ
గిరిజన విద్యాలయాల్లో బాలికల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వెల్లడి
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ఇకపై ఇంటి వద్దకు రేషన్ సరకులు రావు. గిరిజనులు రేషన్ షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ విషయం వెల్లడించారు. మంత్రి మంగళవారం గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తామని, ఇకపై రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు (ఎండీయూ) వల్ల సమస్యలు ఉన్నాయన్నారు.
అందువల్ల గిరిజనుల సౌలభ్యం కోసం ఏజెన్సీలోని 962 రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీ అవుట్‌లెట్‌లను పెద్ద ఎత్తున విస్తరించి, డిమాండ్‌ను మరింతగా పెంచుతామన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అందించే తేనె, ఇతర ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెడతామని చెప్పారు. జీసీసీ పరిధిలోని 16 పెట్రోల్ బంకులు, 18 గ్యాస్ డిపోలు, 12 సూపర్ మార్కెట్‌ల ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు వస్తున్నాయని, వాటిలో 2 వేలకుపైగా పోస్టులు గిరిజన ప్రాంతాల్లో భర్తీ అవుతాయని చెప్పారు. దీంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందన్నారు. గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం 554 ఏఎన్‌ఎంలను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నట్టు తెలిపారు. గిరిజన వసతి గృహాల్లో స్డడీ అవర్స్ పెడతామన్నారు. గిరిజన విద్యాలయాల్లో బాలికల రక్షణ కోసం ఫిర్యాదుల బాక్స్ పెడతామన్నారు.
ఫిర్యాదు చేసిన విద్యారి్థని పేరు గోప్యంగా ఉంచుతామని, వేరే ప్రాంత అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు. గిరి శిఖర గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సేవల కోసం ఫీడర్ అంబులెన్స్‌లు, ప్రసవం అనంతరం సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment