ఎండీయూ వాహనాలతో పౌరసరఫరాల సంస్థకు నష్టం
రేషన్ డోర్ డెలివరీపై త్వరలో నిర్ణయం
మంత్రి నాదెండ్ల మనోహర్
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ పంపిణీ మూర్ఖపు నిర్ణయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ పంపిణీ చేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) వల్ల పౌర సరఫరాల సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పౌర సరఫరాల సంస్థకు రూ.1,500 కోట్లు నష్టం కలిగేలా 9,260 ఎండీయూ వాహనాలు కొన్నారని, ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.27 వేలు వెచ్చిస్తున్నామని, ఇంతకన్నా అన్యాయం ఉండదని చెప్పారు.
2027 వరకు వీటితో కాంట్రాక్టు కుదుర్చుకొని కార్పొరేషన్‌కు నష్టం కలిగించేలా మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రేషన్ డోర్ డెలివరీపై త్వరలో స్టేక్ హోల్డర్లతో విస్తృతంగా చర్చించి, నివేదిక రూపొందిస్తామని, కేబినెట్‌లోనూ చర్చిస్తామని చెప్పారు. పౌర సరఫరాల సంస్థను రూ.36,300 కోట్ల అప్పుల పాలు చేశారన్నారు. రూ. 2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇటీవలే చెల్లించామన్నారు.
బియ్యం స్థానంలో నగదు పంపిణీపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రభుత్వంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సూచనలతో ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ఓ మాజీ ఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment