సాక్షి, అమరావతి: కరోనా కారణంగా అంతర్రాష్ట్ర కదలికలపై పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద డీజీపీ మీడియాతో మాట్లాడారు.
అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతివ్వాలని, 12 గంటల తర్వాత కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
ముందస్తు అనుమతులు తప్పనిసరి
శుభకార్యాలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు, ఆయోమయానికి గురిచేయడం సరికాదన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు మాస్‌్కలను ధరించాలని, శానిటైజర్‌ను ఉపయోగించాలన్నారు. కరోనా నిబంధనలను, కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని డీజీపీ కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment