YS Jagan: నెలాఖరు దాకా కర్ఫ్యూ | YS Jagan key decisions in high-level review on covid, vaccination | Sakshi
Sakshi News home page

YS Jagan: నెలాఖరు దాకా కర్ఫ్యూ

Published Tue, May 18 2021 2:50 AM | Last Updated on Tue, May 18 2021 12:52 PM

YS Jagan key decisions in high-level review on covid, vaccination - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడిలో భాగంగా విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 5వతేదీ నుంచి 18 వరకు కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించారు. మెరుగైన ఫలితాలు కనిపించాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమల్లో ఉండాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయం, నిబంధనలను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

బ్లాక్‌ ఫంగస్‌కు ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స
కోవిడ్‌ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారినపడ్డ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ సిద్ధం చేయాలని నిర్దేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం వెంటనే అనుమతులు ఇచ్చేలా ప్రోటోకాల్‌ రూపొందించాలని సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించాలని ఆదేశించారు. నియంత్రణలోని లేని డయాబెటిస్, విపరీతంగా స్టెరాయిడ్స్‌ వాడకం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని అధికారులు తెలియచేయడంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు 

ఫీవర్‌ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు..
ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేలో లక్షణాలు గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరీక్షల్లో వైరస్‌ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు మందులు కూడా అందించాలన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు.

పల్లెల్లో కేసులు పెరగకుండా చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు పెరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా  వినియోగించుకోవాలని సూచించారు. 

కోవిడ్‌ పరిస్థితి – వైద్య సదుపాయాలు
ఆరోగ్యశ్రీ చికిత్సలో 25,539 మంది 
రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితి, వైద్య సదుపాయాలను సమీక్షలో అధికారులు వివరించారు. 625 కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రుల్లో 47,825 బెడ్లు ఉండగా 38,492 పడకలు నిండాయని, వీరిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రులలో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు, 23,463 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్లు, 17,246 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సిజన్‌ బెడ్లు, 3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 115 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 52,471 బెడ్లలో 17,417 పడకలు ఆక్యుపై అయినట్లు వివరించారు.

ఆక్సిజన్‌ సరఫరా..
రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా ప్రభుత్వ, ప్రైవేట్‌  ఆస్పత్రులన్నింటిలో కలిపి రోజూ 590 – 610 మెట్రిక్‌ టన్నుల వరకు డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఒక ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను 80 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జామ్‌నగర్‌ నుంచి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, బళ్లారి నుంచి కూడా రోజూ కనీసం 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ 8 ఐఎస్‌ఓ కంటైనర్లు రాగా మరో రెండు కూడా వస్తున్నాయని వెల్లడించారు.

మాస్కులు – ఇంజక్షన్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 7,32,542 ఎన్‌–95 మాస్కులు, 7,55,395 పీపీఈ కిట్లు, 44,11,353 సర్జికల్‌ మాస్కులతో పాటు 23,382 రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు స్టాక్‌ ఉన్నాయని అధికారులు వివరించారు. ఇంకా 8 లక్షల ఇంజక్షన్లు మైలాన్‌ నుంచి, మరో 50 వేలు రెడ్డి ల్యాబ్స్‌ నుంచి సేకరించేందుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెప్పారు.

కోవిడ్‌ వ్యాక్సిన్లు..
కేంద్రం నుంచి ఇప్పటివరకు మొత్తం 75,99,960 వ్యాక్సిన్‌ డోస్‌లు రాగా వాటిలో కోవిషీల్డ్‌ 62,60,400, కోవ్యాగ్జిన్‌ 13,39,560 అని అధికారులు వెల్లడించారు. ఈనెల 15వతేదీ నాటికి రాష్ట్రానికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు 6,90,360 కేటాయించగా అంతకంటే ఎక్కువగా 8,90,360 డోస్‌లు సేకరించామని తెలిపారు. కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు 2,27,490 కేటాయించగా కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని అధికారులు పేర్కొన్నారు.

సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement