రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన మొబైల్ మినీ వ్యాన్‌తో తనకు చక్కటి ఉపాధి లభించిందని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జంపాన కృష్ణచైతన్య గర్వంగా చెబుతున్నాడు. రూ.5,81,190 విలువైన మినీ వ్యాన్, వేయింగ్ మెషిన్‌కు తన వాటాగా కేవలం 10 శాతం మాత్రమే తాను చెల్లించానని తెలిపాడు. మిగిలిన 90 శాతాన్ని ప్రభుత్వమే సబ్సిడీ కింద బ్యాంకుకు వాయిదాల్లో చెల్లిస్తోందన్నాడు. వ్యాన్‌తో తనకు నెలకు రూ.18 వేలు వేతనం కూడా వస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు.
పేద ప్రజలకు ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించే కార్యక్రమంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందంటున్నాడు.. శ్రీకాకుళం జిల్లా ఆత్మకూరుకు చెందిన పులిచర్ల ఈళ్లయ్య. ప్రభుత్వం మొబైల్ మినీ ట్రక్కులను సబ్సిడీపై అందిస్తుండటంతో గతేడాది దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు. ప్రతి నెలా 1న రూ.18 వేలు వేతనం పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు.
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో మొబైల్ మినీ ట్రక్కుల ద్వారా ఉపాధి పొందుతున్న ఏ ఒక్క యువకుడిని పలకరించినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రక్రియ సత్ఫలితాలనిస్తోందని అర్థమవుతోంది. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే రేషన్ అందించే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఫిబ్రవరి 1తో ఏడాది పూర్తయ్యింది. ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్న ఈ కొత్త ఒరవడిలోనూ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడం మరో విశేషం. రాష్ట్రంలోని ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 1న 9,260 మొబైల్ వాహనాలను అందించింది. వాటి ద్వారా రోజుకు కనీసం 90 కార్డుదారులకు తగ్గకుండా వారి ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందించేలా చర్యలు చేపట్టింది.
90 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా వేతనం
ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీ సంస్థ ద్వారా అందించిన ఈ వాహనాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మొత్తాన్ని సమకూర్చింది. రేషన్ సరఫరా కోసం అందించిన నాలుగు చక్రాల మొబైల్ మినీ ట్రక్కు (ఒక్కొక్క వాహనం) రూ.5,72,539, బరువు తూచే యంత్రం రూ.8,651 మొత్తం ధర రూ.5,81,190. ఈ మొత్తంలో పది శాతాన్ని లబ్ధిదారుడు చెల్లించాడు. మిగిలిన 90 శాతంలో 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ, మరో 30 శాతం లబ్ధిదారులకు వాయిదాల పద్ధతిలో రుణం ఇచ్చిన బ్యాంకులకు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే లబ్ధిదారుడు తొలుత చెల్లించిన 10 శాతం మినహా మొత్తం 90 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించేలా గతేడాది జూలైలో నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్‌ల ద్వారా 72 వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. దీంతో ట్రక్కులు నిర్వహిస్తున్న యువతకు మరింత భరోసా లభించింది. అంతేకాకుండా ప్రతి నెలా వారికి వేతనం కూడా అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment