mini truck
-
రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం
అహ్మదాబాద్: ఆగి ఉన్న వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది చనిపోగా మరో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోర ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖేడా జిల్లా కపడ్వంజ్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 23 మంది సురేంద్రనగర్ జిల్లా చోటిలాలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బగోదర సమీపంలో రాజ్‌కోట్–అహ్మదాబాద్ హైవేపై రోడ్డు పక్క ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది గాయపడినట్లు ఎస్పీ అమిత్ వాసవ తెలిపారు. ఘోర ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. -
టాటా ఏస్ ఎలక్ట్రిక్ డెలివరీలు షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏస్ ఎలక్ట్రిక్ మినీ ట్రక్ డెలివరీలు ప్రారంభించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.9.99 లక్షల నుంచి మొదలు. ముందుగా 10 నగరాల్లో డెలివరీలను చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలో ఉన్నాయని వెల్లడించింది. ఈవీజెన్ పవర్‌ట్రైయిన్‌తో టాటా నుంచి తొలిసారిగా ఇది రూపుదిద్దుకుంది. 130 ఎన్ఎం గరిష్ట టార్క్‌తో 27 కిలోవాట్ పవర్ మోటార్ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో ఏస్ ఎలక్ట్రిక్‌ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఆ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, సిటీలింక్, డీవోటీ, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ తదితర కంపెనీలతో మొత్తం 39,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ఏస్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. కాగా, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలోనూ ఇది లభిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో 20 లక్షల పైచిలుకు ఏస్ వాహనాలు రోడ్డెక్కాయి. -
ప్రజా పంపిణీలోనూ యువతకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన మొబైల్ మినీ వ్యాన్‌తో తనకు చక్కటి ఉపాధి లభించిందని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జంపాన కృష్ణచైతన్య గర్వంగా చెబుతున్నాడు. రూ.5,81,190 విలువైన మినీ వ్యాన్, వేయింగ్ మెషిన్‌కు తన వాటాగా కేవలం 10 శాతం మాత్రమే తాను చెల్లించానని తెలిపాడు. మిగిలిన 90 శాతాన్ని ప్రభుత్వమే సబ్సిడీ కింద బ్యాంకుకు వాయిదాల్లో చెల్లిస్తోందన్నాడు. వ్యాన్‌తో తనకు నెలకు రూ.18 వేలు వేతనం కూడా వస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. పేద ప్రజలకు ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించే కార్యక్రమంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందంటున్నాడు.. శ్రీకాకుళం జిల్లా ఆత్మకూరుకు చెందిన పులిచర్ల ఈళ్లయ్య. ప్రభుత్వం మొబైల్ మినీ ట్రక్కులను సబ్సిడీపై అందిస్తుండటంతో గతేడాది దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు. ప్రతి నెలా 1న రూ.18 వేలు వేతనం పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో మొబైల్ మినీ ట్రక్కుల ద్వారా ఉపాధి పొందుతున్న ఏ ఒక్క యువకుడిని పలకరించినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రక్రియ సత్ఫలితాలనిస్తోందని అర్థమవుతోంది. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే రేషన్ అందించే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఫిబ్రవరి 1తో ఏడాది పూర్తయ్యింది. ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్న ఈ కొత్త ఒరవడిలోనూ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడం మరో విశేషం. రాష్ట్రంలోని ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 1న 9,260 మొబైల్ వాహనాలను అందించింది. వాటి ద్వారా రోజుకు కనీసం 90 కార్డుదారులకు తగ్గకుండా వారి ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందించేలా చర్యలు చేపట్టింది. 90 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా వేతనం ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీ సంస్థ ద్వారా అందించిన ఈ వాహనాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మొత్తాన్ని సమకూర్చింది. రేషన్ సరఫరా కోసం అందించిన నాలుగు చక్రాల మొబైల్ మినీ ట్రక్కు (ఒక్కొక్క వాహనం) రూ.5,72,539, బరువు తూచే యంత్రం రూ.8,651 మొత్తం ధర రూ.5,81,190. ఈ మొత్తంలో పది శాతాన్ని లబ్ధిదారుడు చెల్లించాడు. మిగిలిన 90 శాతంలో 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ, మరో 30 శాతం లబ్ధిదారులకు వాయిదాల పద్ధతిలో రుణం ఇచ్చిన బ్యాంకులకు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే లబ్ధిదారుడు తొలుత చెల్లించిన 10 శాతం మినహా మొత్తం 90 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించేలా గతేడాది జూలైలో నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా 72 వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. దీంతో ట్రక్కులు నిర్వహిస్తున్న యువతకు మరింత భరోసా లభించింది. అంతేకాకుండా ప్రతి నెలా వారికి వేతనం కూడా అందుతోంది. -
సబ్సిడీపై 5,600 మినీ ట్రక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీలకు 3,800 మినీ ట్రక్కులు, ఈబీసీలకు 1,800 మినీ ట్రక్కులు.. మొత్తం 5,600 మినీ ట్రక్కులను సబ్సిడీపై ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వారి (ఈబీసీ) అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)లను మంజూరు చేసింది. బీసీలు, ఈబీసీల సంక్షేమం, స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము జారీ చేశారు. మొత్తం యూనిట్ (మినీ ట్రక్కు) వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతాన్ని ఎంపిక చేసిన బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. 90 శాతం అప్పులో లబ్ధిదారుడు 60 శాతం సబ్సిడీగా పోనూ మిగిలిన 30 శాతాన్ని 72 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించాలి. కాగా, ఇప్పటి వరకు లబ్ధిదారుడికి ఇస్తున్న 30 శాతం సబ్సిడీని 60 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లబ్ధిదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. లబ్ధిదారుడికి సబ్సిడీగా ఇచ్చిన 60 శాతాన్ని రాష్ట్ర ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
వంద శాతం రుణంతో మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్స్
Mahindra Supro Profit Truck హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో ప్రాఫిట్ ట్రక్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర ముంబై ఎక్స్ షోరూంలో మినీ రూ.5.4 లక్షల నుంచి, మ్యాక్సీ రూ.6.22 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. సుప్రో ప్లాట్‌ఫాంపై ఇవి రూపొందాయి. కొనుగోలుదార్లు అయిదేళ్ల కాలపరిమితితో 100 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ‘సామర్థ్యం, ఇంజినీరింగ్ కారణంగా కస్టమర్లు ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనంగా సుప్రోకు ప్రాధాన్యత ఉంది. వినియోగదార్ల లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చాం’ అని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈవో విజయ్ నక్రా తెలిపారు. -
ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం
అగర్తల: ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన త్రిపురలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపురలోని నూతన్‌బజార్‌కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
టాటా ఏస్ గోల్డ్.. ధర ఎంతంటే.
సాక్షి, ముంబై: దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్ టన్ను మినీ ట్రక్ విభాగంలో కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. టన్ను కెపాసిటీ మినీ ట్రక్కు విభాగంలో మేజర్ వాటాను దక్కించుకున్న సంస్థ తాజాగా తొలి నాలుగు చక్రాల మినీ ట్రక్కును విడుదల చేసింది. టాటా మోటర్స్ అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా త్వరలోనే అమ్మకానికి అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా ఏస్ గోల్డ్ పేరుతో లాంచ్ చేసిన దీని ధరను 3.75లక్షల రూపాయలుగా నిర్ణయించింది. టాటా ఏస్ గోల్డ్ వాహనంలో మెరుగుపర్చిన ఫీచర్లను ప్రవేశపెడుతున్నామని టాటా మోటార్స్ వాణిజ్య వాహన వ్యాపార శాఖ అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. తద్వారా తమ వినియోగదారులను మరింత ఆకట్టుకోనున్నట్టు అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు 24గంటలూ మరమ్మత్తు సేవలను , ఉచిత బీమా, సమయానికి రిపేర్ కమిట్మెంట్ లాంటి ఇతర విలువైన సేవలను ఏస్ గోల్డ్ కస్టమర్లకు అందించ నున్నామని పేర్కొన్నారు. కాగా 2005 లో విడుదల చేసిన టాటా ఏస్ 'ఛోటా హాథీ' గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మిని ట్రక్ సెగ్మెంట్లో 68 శాతం వాటాతో గత13 ఏళ్లుగా 20లక్షల యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. -
గగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో
సాక్షి, గాంధీనగర్ : ఆ యాక్సిడెంట్ వీడియో చూసిన ఎవరైనా సరే.. వారు కచ్చితంగా చనిపోయి ఉంటారనే అనుకుంటారు. అంత ఘోరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఆ యాక్సిడెంట్ జరిగింది. అయితే, అదృష్టం కొద్ది వారు ప్రాణాలతో బయటపడ్డారు. సీసీటీవీలో రికార్డు అయిన ఆ రోడ్డు ప్రమాదం గుజరాత్‌లోని ఏడారి ప్రాంతమైన బనస్కాంతలో చోటుచేసుకుంది. సరిగ్గా ప్రేమికుల రోజున తన కూతురు, భార్యతో మోటారు వాహనంపై వెళుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ ట్రక్కు వారిని అమాంతం ఢీకొట్టింది. దీంతో వారి వాహనం వారు ముగ్గురు తలా ఓ దిక్కున విసిరి వేసినట్లుగా పడ్డారు. అదృష్టం కొద్ది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. -
ఒళ్లు గగొర్పుడిచేలా యాక్సిడెంట్
-
ఒడిశాలో ఘోర ప్రమాదం, 11మంది మృతి
భువనేశ్వర్ : ఒడిశాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవరంగ్ పూర్ జిల్లా జరిగావ్ వద్ద ఓ మినీ ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొని... లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 11మంది కళాకారులు దుర్మరణం చెందగా, మరో 40మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సుమారు 50మందిపైనే ఉన్నట్లు పోలీసు అధికారి మణిపాత్రో తెలిపారు. వీరంతా ఓ ప్రదర్శన నిమిత్తం వెళుతున్నట్లు చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.