
తినేటోళ్లకు తిన్నంత!
♦ ప్రజా పంపిణీలో ఇష్టారాజ్యం
♦ తప్పుడు తూకాలతో బియ్యం
♦ నొక్కేస్తున్న పలువురు డీలర్లు
♦ ఇతర వస్తువులను బలవంతంగా అంటగడుతున్న వైనం
♦ కిరోసిన్ పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలింపు
♦ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో బలవంతపు వసూళ్లు
♦ నేడు విజిలెన్స్ కమిటీ సమావేశం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో గాడి తప్పింది. కింది స్థాయిలో డీలర్లది ఇష్టారాజ్యంగా మారింది. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కెర, కిరోసిన్ వంటి నిత్యావసరాలను దారి మళ్లిస్తూ జేబులు నింపుకుంటున్నారు. డబ్బాలతో బియ్యం వేస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కడపలో కొన్ని ఎఫ్‌పీ షాపులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇతర సరుకులను వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
డబ్బాలతో తూకాలు
తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం డీలర్లకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఇచ్చింది. కానీ జిల్లాలో పలుచోట్ల ఇప్పటికి డబ్బాలతో తూకాలు వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే డీలర్లు డబ్బాలతో తూకాలు వేస్తున్నారు. శుక్రవారం ‘సాక్షి’ నగరంలోని సాయిపేటలో ఉన్న 117వ ఎఫ్‌పీ షాపును సందర్శించగా అక్కడ డబ్బాలు దర్శనమిచ్చాయి. ఒక్కో డబ్బా కనీసం కిలో బరువు ఉంటుందని తెలుస్తోంది. ఎంతలేదన్నా ఒక క్వింటాలుకు 10 కిలోల బియ్యాన్ని తూకాల ద్వారా డీలర్లు కాజేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున బయట విక్రయించుకున్నా రూ.100 వస్తుంది. ఒక్కొ డీలర్ కనీసం వంద క్వింటాళ్లు బియ్యం పంపిణీ చేసినా 10 వేల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు అడపా దడపా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకోవడం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు.
కిరోసిన్‌లో....
ప్రభుత్వం బియ్యంతోపాటు కిరోసిన్ కూడా ఒకే సమయంలో సరఫరా చేయకపోవడం డీలర్లకు వరంగా మారింది. బియ్యం పంపిణీ అయిపోయిన తర్వాత కిరోసిన్ కేటాయిస్తున్నారు. దీపం, జనరల్ కనెక్షన్ ఉన్న కార్డు దారులకు ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయక గంటల తరబడి క్యూలో నిలబడి బియ్యం తీసుకెళ్లిన చాలామంది వినియోగదారులు లీటరు కిరోసిన్ కోసం పనులు వదులుకొని మళ్లీ ఎఫ్‌పీ షాపులకు రావడం లేదు. మరుసటి నెల బియ్యానికి వచ్చినపుడు డీలర్లు వినియోగదారుల వేలి ముద్రలు తీసుకుని కిరోసిన్ కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రీటైల్ షాపు డీలర్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. అలా కాజేసిన కిరోసిన్ బ్లాకులో లీటరు రూ. 30 చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
నేడు విజిలెన్స్ కమిటీ సమావేశం
ఎట్టకేలకు సుమారు రెండు సంవత్సరాల తర్వాత పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహిస్తున్నారు. ఇంతకు మునుపు జిల్లా ఆహార సలహా సంఘం అన్న పేరును తొలగించి విజిలెన్స్ కమిటీ పేరుతో సభ్యులను నియమించారు.
వంట గ్యాస్‌లో బలవంతపు వసూళ్లు
గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు సిలిండర్ డోర్ డెలివరీ కింద రూ.40 చొప్పున వసూలు చేస్తున్నారు. అయిదు కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా డోర్ డెలివరీ చేయాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఇటీవల నిర్వహించిన గ్యాస్ డీలర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సిలిండర్లు తీసుకెళ్లే బాయిస్ డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేయాలంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి జి.వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పలువురు వంట గ్యాస్ డీలర్లు దొంగ కనెక్షన్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మాల్స్‌ను తలపిస్తున్న వైనం
కడప నగరంలో కొన్ని ఎఫ్‌పీ షాపులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. కొబ్బెర, బెల్లం, ఉప్పు, ఆవాలు, సబ్బులు, వంట నూనెలు, కూల్ డ్రింక్స్ ఇలా అనేక రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిని వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే తక్కువ ధరకు ఇస్తోందని, నాసిరకం వస్తువులు అండగడుతున్నారు. తీసుకోకపోతే ఆ తర్వాత వస్తువులు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటాయని పరోక్షంగా భయపెడుతున్నారు. చౌక దుకాణాలకు వెళ్లి తమకు కావాల్సిన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసే వెసలుబాటు వినియోగదారులకు ఉంది. అయితే అన్ని వస్తువులు కొనకపోతే తర్వాత నెలల్లో ఏమీ ఇవ్వరన్న భయం వినియోగదారుల్లో నెలకొంది. ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేస్తున్న సరుకులను కూడా బయటి నుంచి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
కడప బెల్లం మండివీధిలోని 34వ నెంబరు ఎఫ్‌పీ షాపును ‘సాక్షి’ సందర్శించినపుడు అది ఓ చిన్నపాటి సూపర్‌బజారులా కనిపించడం గమనార్హం. ‘జీతాలు ఇస్తామని, కమీషన్ పెంచుతామని ప్రభుత్వం చెప్పిన హామిలు అమలు కాలేదు. క్వింటాలు బియ్యానికి రూ. 20 కమీషన్ ప్రభుత్వం ఇస్తోంది. గోడౌన్ వద్ద లోడు చేసినందుకు రూ. 2, స్టోరు వద్ద బియ్యం దించుకోవడానికి రూ.6 చొప్పున చెల్లిస్తున్నాం.. దీంతో క్వింటాలుకు ఖర్చులుపోను మాకు మిగులుతోంది రూ.12 మాత్రమే. వంద క్వింటాళ్ల బియ్యం మేము పంపిణీ చేసినా రూ.1200లే దక్కుతోంది. రూము అద్దె, కరెంటు చార్జి, ఇతర ఖర్చులు తీసేస్తే నష్టం తప్ప ఏమి ఉండదు. అందుకే ఇతర సరుకులు అమ్ముకుంటున్నాం’ అని డీలర్లు చెబుతున్నారు.