మీసేవల్లో అపకీర్తి..!
ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు వేలల్లో వసూళ్లు
- కులం, నివాస సర్టిఫికెట్ల జారీలోనూ...
- మీసేవ నిర్వాహకులతో రెవెన్యూ సిబ్బంది మిలాఖత్
- సామాన్య ప్రజలకు తప్పని తిప్పలు
కలెక్టరేట్ : విద్యార్థులు, తలిదండ్రుల అవసరాలను ఆసరాగా తీసుకుని కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల పత్రాలు జత చేసి దరఖాస్తు చేసినా... కొర్రీలు పెట్టి మరీ తోసిపుచ్చుతున్నారు. ప్రస్తు తం కళాశాలలు ప్రారంభం కావడం, కౌన్సిలిం గ్ తేదీలు వెల్లడైన నేపథ్యంలో విద్యార్థులకు కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అవసరంగా మారాయి. ఇదే అదనుగా భావించిన ఒకరిద్దరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు.
రెవెన్యూ సిబ్బంది చేతివాటం
జిల్లాలో ఎక్కువగా ధ్రువీకరణ పత్రాల తాకిడి ఉన్నది హన్మకొండ మండలానికే. దీంతో నగరంలోని కొన్ని మీ సేవ కేంద్రాల సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మిలాఖత్ అయి దర ఖాస్తుదారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.30 చెల్లించాల్సి ఉండగా... అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు.
అదనంగా చెల్లించిన వారికి 24 గంటల్లో పత్రాలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా వసూలు చేసిన డబ్బుల్లో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందని కలెక్టరేట్ సమీపంలోని పలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.
ప్రభుత్వ ఉద్యోగులకూ ఆదాయ పత్రాలు
దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువుల నిమిత్తం ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిన ఆసరాగా చేసుకున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే విధంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ప్రభుత్వం నుంచి ఫీజులు పొందుతున్నారు.
గతంలో అధికారులు చేపట్టిన విచారణలో ఈ తతంగం బహిర్గతమైంది. ఈ దందాలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నారుు. ఇక అన్ని సక్రమంగా ఉన్నా.. ఉద్దేశపూర్వకంగా తోసిపుచ్చుతున్న దరఖాస్తుల విషయంలో బాధితుల గోడు వర్ణనాతీతం. తమ బాధను అధికారులు సైతం వినే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం
రెవెన్యూ కార్యాలయంలో ఒకరిద్దరు చేస్తున్న అక్రమ వ్యవహారం వల్ల అందరికీ అపకీర్తి వస్తోంది. ఇదే విషయంపై ఇటీవల సిబ్బం దితో సమావేశమైన తహసీల్దార్ డాక్టర్ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలి సింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని పరోక్షంగా సదరు సిబ్బందిని హెచ్చరిం చినట్లు సమాచారం. కాగా, అనర్హులకు జారీ చేస్తున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సంతకం ఉంటోందా...లేక ఇష్టారాజ్యంగా చేస్తున్నారా.. అన్న విషయంలో అధికారులు విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.