‘డిజిటల్ కీ’తో అక్రమాలకు తెర తీస్తున్న రెవెన్యూ సిబ్బంది, ఆపరేటర్లు
రూ.లక్షలు దండుకుంటున్న వైనం నమ్మకంతోనే ‘కీ’
అప్పగిస్తున్నామంటున్న తహశీల్దార్లు
నిడమానూరుకు చెందిన సుబ్బయ్యకు నాలుగెకరాల సొంత భూమి ఉంది. తాత తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. బ్యాంకు రుణం తీసుకుందామని మీసేవా సెంటర్‌కు వెళ్లి అడంగల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ భూమి పట్టాదారుగా వేరొకరి పేరు వచ్చింది. ల్యాండ్ రికార్డ్సులో పేరు మారిపోయింది.
సత్యనారాయణపురానికి చెందిన నవీన్‌కు అత్యవసరంగా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. మీ సేవా కేంద్రం వద్దకు వెళ్లిన నవీన్ అవసరాన్ని పసిగట్టిన దళారులు రూ.2 వేలు ఇస్తే రెండే నిమిషాల్లో ధ్రువీకరణ పత్రం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. జేబులో డబ్బులు లెక్కించే లోపే ధ్రువీకరణ పత్రం చేతికందింది.
గాంధీనగర్ : దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది రెవెన్యూ శాఖలో డిజిటల్ కీ వ్యవహారం. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. తహశీల్దార్ల ఉద్యోగం కంప్యూటర్ ఆపరేటర్ల గుప్పెట్లో పెట్టినట్టయింది. రెవెన్యూ సేవలను సులభతరం చేయడానికి రికార్డులను కంప్యూటరీకరించి ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నారు. నిత్యం వందలాది సర్టిఫికెట్‌ల జారీకి సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది. దీనికోసం డిజిటల్ సిగ్నేచర్ పరికరం ‘డిజిటల్ కీ’ని తహశీల్దార్లకు ప్రభుత్వం అందజేసింది. ఈ డిజిటల్ ‘కీ’లకంగా మారింది. అడంగల్, 1బి రిజిస్టర్‌ల కాపీలు మీ-సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు కీలకంగా మారాయి. పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో భూమి యజమాని వివరాలు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆ శాఖ నిబంధనలు విధించింది. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. భూమి రికార్డులు ఆన్‌లైన్ చేయడం, మీ సేవా కేంద్రాల ద్వారా అడంగల్, 1బి వంటివి జారీ చేస్తుండడంతో రైతులకు వీఆర్వోల అవసరం అంతగా ఉండడం లేదు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం అంతకంతకూ పెరిగింది. ‘డిజిటల్ కీ’ చేతికందితే చాలు భూమి రికార్డులు తారుమారై క్షణాల్లో సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. ఇవేవీ తహశీల్దార్‌కు తెలియకపోవడం విశేషం.
అధికారులకు తీరిక లేక..
స్మార్ట్‌విలేజ్, టెలికాన్ఫరెన్స్‌ల పేరుతో తహశీల్దార్లకు క్షణం తీరిక ఉండటంలేదు. దీంతో తమ అధీనంలో ఉండాల్సిన ‘డిజిటల్ కీ’ని ఆపరేటర్లకు, కార్యాలయ సిబ్బందికి అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
అక్రమాలు ఇలా జరుగుతున్నాయి..
జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల కార్యాలయ సిబ్బంది ఆ విధులు నిర్వరిస్తున్నారు. వీరికి డిజిటల్ ‘కీ’ చేతికందితే చాలు మండలం భూమి రికార్డులన్నీ గుప్పిట్లో ఉన్నట్లే. ఈ నేపథ్యంలో ఆపరేటర్లే కీలకమన్న విషయం తెలుసుకున్న రియల్టర్లు నేరుగా వారితోనే సంబంధాలు నెరుపుతున్నారు. ఆపరేటర్లకు భారీగా సొమ్ము ఎరచూపుతున్నారు. ఇంకేముంది డిజటల్ టోకెన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. భూమి రికార్డుల్లో పేర్లు మార్చేస్తున్నారు. తహశీల్దార్ ప్రమేయం లేకుండా సర్టిఫికెట్‌లు జారీ చేయడం, రికార్డుల్లో పేర్లు మార్పు, డిజేబుల్ (ఏదైనా సర్వే నంబరు వద్ద ఈ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే, మీసేవ కేంద్రానికి వెళ్లిన వారికి తహశీల్దార్ వెరిఫికేషన్ అని చూపుతుంది) అనే అప్షన్‌ను ఉపయోగించి మీ సేవా కేంద్రాల్లో వివరాలు రాకుండా చేసి రైతులను తహశీల్దార్ కార్యాలయాలకు, వీఆర్వోల వద్దకు రప్పించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ లక్షలు సంపాదించుకుంటున్నారు.
ఇవిగో అక్రమాలకు నిదర్శనాలు..
కానూరు గ్రామంలో ఓ రైతుకు సంబంధించిన రికార్డుల్లో పేర్లు మార్చేశారు. అడంగల్‌లోని పట్టాదారు, అనుభవదారు వరుసలో గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి పేర్లు నమోదు చేశారు. ఇంకేముంది రికార్డుల్లో అక్రమార్కులు చేరిపోయారు. ఆ భూమి యజమాని మీ-సేవ కేంద్రానికి వెళ్లి చూసుకోగా పేర్లు మారిపోవడంతో విస్తుపోయాడు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి.
విజయవాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ప్రమేయం లేకుండా నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. తహశీల్దార్‌కు కొందరు సమాచారం అందించడంతో నిఘా పెట్టారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఆపరేటర్‌గా పని చేస్తున్న మహిళా వీఆర్‌ఏ రోజాపై చర్యలు తీసుకున్నారు.
పశ్చిమ కృష్ణాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏ చేతి వాటం ప్రదర్శించింది. రియల్టర్లతో సంబంధాలు పెట్టుకుని ల్యాండ్ రికార్డుల్లో పేర్లు మార్చి సుమారు రూ.5 లక్షల వరకు అర్జించినట్లు సమాచారం. కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన తహశీల్దార్ సదరు వీఆర్‌ఏను పక్కన బెట్టారు.
నూజివీడు డివిజన్ పరిధిలోని జిల్లా సరిహద్దులో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో ఆపరేటర్‌గా పని చేస్తున్న వ్యక్తి తహశీల్దార్ హోదాలో చెలామణి అవుతున్నాడు. గతంలో పని చేసిన తహశీల్దార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వీఆర్వోలందరినీ శాసించే స్థాయికి చేరాడు.
సిబ్బందిపై నమ్మకంతోనే : ఆర్.శివరావు, అర్బన్ తహశీల్దార్
పని ఒత్తిడి కారణంగా సిబ్బందిపై నమ్మకంతో డిజిటల్ కీ పాస్‌వర్డ్ చెప్పాల్సి వస్తోంది. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
సంతకం సమర్పయామి..
Published Wed, Feb 25 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement