ఆదాయం, కులం, ఆహార భద్రత, పింఛన్ల దరఖాస్తులకు ఆధార్ సంఖ్య తప్పనిసరి చేయడంతో జనం మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
జనగామ : ఆదాయం, కులం, ఆహార భద్రత, పింఛన్ల దరఖాస్తులకు ఆధార్ సంఖ్య తప్పనిసరి చేయడంతో జనం మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 90 శాతం జనాభా ఆధార్ ఫొటోలు దిగినట్లు ఉన్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంకా చాలామందికి ఆధార్ సంఖ్య లేకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణణాతీతంగా మారారుు. మీ సేవ కేంద్రాల్లో ఒక రోజు 60 మందికి ఫొటోలు దించడమేగా గగనంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఒక్కసారిగా వందలాది మంది ఆధార్ ఫొటో దిగేందుకు ఎగబడడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది.
వసూళ్లే వసూళ్లు..
గత మూడేళ్లుగా ఆధార్ కేంద్ర నిర్వాహకులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ సొమ్ము విడుదలలో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వారు తమదైన శైలిలో వాడుకుంటున్నారు. ఒక్కొక్కరి ఫొటో దింపేందుకు రూ.100 నుంచిరూ.200 పైనే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫొటోలు దిగేందుకు వచ్చే ప్రజలతో జనగామ మునిసిపల్ కార్యాలయం సమీపంలోని ఆధార్ సెంటర్ కిక్కిరిసిపోతుండడంతో ఇద్దరు పోలీసులతోపాటు వీఆర్‌ఓ రాజయ్య మీ సేవా కేంద్రం వద్దే ఉండి ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
రద్దీ నేపథ్యంలో జనగామ పట్టణ వాసులను మాత్రమే ఆధార్ కార్డుల ఫొటోలు దింపుతామని నిర్వాహకులు బోర్డు తగిలించడంతో గ్రామీణ ప్రజ లు ఆందోళనకు గురవుతున్నారు. అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సదరు నిర్వాహకులు మంగళవారం సాయంత్రం ఏకంగా కేంద్రాన్ని మూసివేయడంతో జనం ఆందోళనకు దిగారు.
విద్యార్థులకు నోటరీ ఇబ్బందులు
ఫాస్ట్ పథకానికి దరఖాస్తు చేసే విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈధ్రువీకరణ పత్రం పొందడానికి నోటరీ అఫిడవిట్ సమర్పించాలన్నా నిబంధన ఉంది. సాధారణ సమయాల్లో రూ.50లోపు తీసుకుని నోటరీ ఇచ్చేవారని, ఇప్పుడు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక జిరాక్స్ సెంటర్ల తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ కోత లు కూడా వీరికి కలిసొస్తున్నాయి. జనరేటర్, ఇన్వర్టర్ల పేరు చెప్పి ఏకంగా ఒక్కో పేజీ రూ.5 నుంచి 10 వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.