న్యూఢిల్లీ: ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్‌లో ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించడం నేరమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి ఓ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసేందుకు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నజీర్‌ల బెంచ్ నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం నిమ్నవర్గాల వారిని బహిరంగ ప్రదేశాల్లో కులం పేరుతో దూషించడం నేరం. ఇందుకు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి గతంలో నిమ్న వర్గానికి చెందిన ఓ మహిళను కులం పేరుతో దూషించాడు. అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఊళ్లలో ఉన్నపుడు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం ఫోన్ సంభాషణ ‘బహిరంగ ప్రదేశం’ నిర్వచనం కిందకు రాదనీ, కాబట్టి కేసును కొట్టేసి, విచారణను నిలిపివేయాలని నిందితుడు కోర్టును కోరారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి నిందితుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడిపై విచారణ జరపాల్సిందేనని హైకోర్టు గత ఆగస్టు 17న స్పష్టం చేసింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ ఫోన్ సంభాషణను బహిరంగ ప్రదేశంలో మాట్లాడినట్లుగా పరిగణించకూడదనీ, కేసును కొట్టేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరిస్తూ, ఫోన్‌లో మాట్లాడిన సమయంలో నిందితుడు బహిరంగ ప్రదేశంలో లేడని నిరూపించుకోవాలంది.
Comments
Please login to add a commentAdd a comment