సాక్షి, కాకినాడ : ఫలానా సేవకు ఇన్ని రోజుల్లో అందనున్న ప్రతి ఫలం, ఫలానా సేవకు ఇంత ధర నిర్ణయించడం వెరసి మీ సేవలు బహు చక్కగా పని చేస్తున్నాయని భావిస్తున్న అధికారులకు లోపాలు బయటపడ్డాయి. దీంతో శని వారం ఆ విభాగంపై జరిగిన సమీక్షలో స్వయం కృతాపరాధాన్ని తప్పుపడుతూ ఇక ముందు ఇలా జరగకూడదని దిశా నిర్దేశం చేయాల్సి వచ్చింది.
పట్టణాల్లో, గ్రామాల్లో రెవెన్యూ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడనవసరం లేకుండాఆ విభాగం నుంచి పొందే ఓటరు కార్డులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల దరఖాస్తులు తదితర వాటి కోసం మీ సేవకు వెళ్లి పొందే విధంగా ఆన్‌లైన్ చేశారు. ఇలా ఇవ్వగానే అలా అయిపోతున్నాయనుకుంటున్న ఆ సేవలు కాస్తా మీసేవా కేంద్రాల్లో కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే పడకేస్తున్నాయని తేలాయి. రెవెన్యూకి పట్టిన బూజుదులపాల్సిందేనన్న నిర్ణయానికి జాయింటు కలెక్టర్ వచ్చేశారు.
హోలోగ్రామ్‌కు కొరత
ముఖ్యంగా పొందిన కొన్ని సేవలకు గుర్తింపుగా అధీకృతం కావాలంటే హోలోగ్రామ్ స్టిక్కర్ అంటించి ఉంటేనే దానికి ప్రామాణికత వస్తుం ది. ఇవి కలెక్టరేట్‌లో హెచ్- సెక్షన్‌లో అవసరం మేరకు ముద్రించి రెవెన్యూ కార్యాలయాలకు పంపిణీ చేస్తారు. ఇందుకు మీ సేవ చూసే విభాగం ఇండెంటు ఇవ్వాలి. ఇవేమీ లేకుండానే పనులు నడిచిపోవడం మామూలై హోలో గ్రామ్ పంపిణీ అడుగంటింది.
ఉదాహరణకు ఒక మీ సేవా కేంద్రానికి వెయ్యి స్టిక్కర్లు కావాలంటే తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. తీరా వెళితే రెండొందలు తీసుకో అంటూ కుదించి ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల మీ సేవ వినియోగదారుల్లో నూటికి ఇరవై మందికే సేవలందుతున్నాయి. మిగిలిన వారు మీ సేవ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీని వెనుక పెద్ద కథే న డుస్తున్నట్టు ఉన్నతాధికారుల్లో అనుమాన బీజం నాటుకుంది. మీ సేవలో ఎంతకీ రాని ధ్రువీకరణ పత్రం తహశీల్దార్ కార్యాలయానికి వెళితే చిటికెలో అయిపోతుండటంతో ఆపరేటర్లు బిత్తరపోతున్నారు. ఒక్కొక్క సారి దళారీలు బయలుదేరి కట్టలుగా దరఖాస్తులు తీసుకెళ్లి పనులు పూర్తి చేసుకోవడం షరా మామూలవుతోంది.
19 వేల దరఖాస్తుల పెండింగ్
వినియోగదారుడికి ధ్రువీకరణ పత్రం జారీ అయిందో లేదో తెలిసే సాఫ్ట్‌వేర్ మీ సేవల్లో లేదు. అది ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లోనే తెలుసుకునే వెసులు బాటుంది. ఫలితంగా మీ సేవల్లో పనులు కావడం లేదని వినియోగదారులు తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవి భరించలేక మీసేవ నిర్వాహకులు కార్యాలయాలకు వెళ్లి అడుగుతుంటే అసలు ఎన్ని దరఖాస్తులొచ్చాయో రిజిస్టర్లో రాసి వెళ్లమని, చూస్తామని చె ప్పడం అధికారుల వంతవుతోంది.