
ముందే ఓటేసిన ఉద్యోగులు
- నగరవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం
- చొరవ చూపిన సైబరాబాద్ కమిషనర్
- పలుచోట్ల ఓటేసిన 5000 మంది ఉద్యోగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరవ్యాప్తంగా సోమవారం మినీ పోలింగ్ జరిగింది. వివిధ ప్రాంతాల్లో పోలీసులు, పలువురు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ముందే వినియోగించుకున్నారు. ఈ నెల 30న పోలింగ్ సందర్భంగా విధినిర్వహణలో పాలుపంచుకొనే ఉద్యోగుల కోసం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. పోస్టల్ బ్యాలెట్‌ను ఏర్పాటు చేయించారు.
ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సోమవారం సైబరాబాద్‌లో రోడామేస్త్రీ నగర్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, మేడ్చల్, నేరేడ్‌మెట్, చైతన్యపురి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ తదితర పాంతాలలోని ప్రభుత్వ కళాశాలలో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు వరకు కొనసాగింది.
సుమారు 5000 మంది సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటును సీల్డ్‌కవర్‌లో పెట్టి బాక్స్‌లో వేశారు. ఈ బాక్స్‌లను సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ఓట్లు లెక్కించేటపుడు తెరిచి లెక్కిస్తారు. పది సంవత్సరాల నుంచి తాము ఓటు హక్కును వినియోగించుకోలేదని, కమిషనర్ చొరవతో ఈ సారి త్వరగానే ఓటు హక్కును వినియోగించుకోగలిగామని పలువురు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.