తెలంగాణలో తొలిప్రభుత్వం కాంగ్రెస్‌దే..
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్, తెలంగాణ రాష్ట్రంలో తొలిప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని ఆపార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానికంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 8 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు విజ యఢంకా మోగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశా రు. ఒక వేళ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, సినీనటుడు పవన్‌కళ్యాణ్, బీజేపీ నేత మోడీ .. బహిరంగ సభల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఏవైనా ఘటనలు జరిగితే ఆ ముగ్గురే బాధ్యత వహిం చాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ ప్రకటిం చిన ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులతో పాటు ఇతర కాల్వల పనులను పూర్తి చేయించి రైతులకు సాగునీరందిస్తామన్నారు. నల్లగొండ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాంగ్రెస్‌ను ఆదరించాలి: గుత్తా
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని అందువల్ల ఉద్యోగులు, సంఘాలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాంగ్రెస్‌ను ఆదరించాలని ఆ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ఎల్లవేళలా వారికి అండగా ఉంటామన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా సినీనటుడు పవన్‌కళ్యాణ్, టీడీపీ అధినేత బాబు, బీజేపీనేత మోడీలు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా చేశారన్నారు. ఎవరు రెచ్చగొట్టినా ఇరు ప్రాంతాల ప్రజలు సోదరభావంతోనే ఉంటారన్నారు. రాహుల్‌గాంధీ.. ఎన్నికల ప్రచార సభలో రైతులకు ప్రకటించిన 2 లక్షల రుణ మాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.