ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం
ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు పన్నులు విధిచండం.. పన్నుల్లో మార్పులు, అనధికారిక భవనాలకు విధించే పన్నులు.. తదితర పనుల్లో రెవెన్యూ విభాగం ఆర్‌ఐలు, రెవెన్యూ విభాగం బాధ్యతలు చూస్తున్న అసిస్టెంట్ కమిషనర్, ఇతర సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైసలివ్వందే ఫైలు కదిలే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఆదాయాలే లక్ష్యంగా రెవెన్యూ విభాగం సిబ్బంది నగరపాలక ఖజానాకు గండి కొడుతున్నారు. గజిట్ ప్రకారం కేటాయించిన జోన్‌ల్లో ఇష్టానుసారంగా బహుళ అంతస్థులకు కొలతల్లో అవకతవకలు చేసి భారీగా తగ్గించి పన్నులు విధిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కుళాయి కనెక్షన్లు, కరెంటు కనెక్షన్ల కోసం క్రయ విక్రయాలు జరిపిన డీకే పట్టాలకు ఎటువంటి ఆస్తి హక్కు కల్పించకుండా మౌలిక వసతుల కోసం విధించాల్సిన సూపర్‌స్ట్రెక్చర్ (ఎస్‌ఎస్) ట్యాక్సుల సైతం నిలిచిపోతున్నాయి.
అసిస్టెంట్ కమిషనర్ చాంబర్‌లో వందల కొద్ది దస్త్రాలు పేరుకుపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ పనితీరుపై కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. భవన అనుమతులు పొందిన భనాలకు సంబంధించి నిర్మించిన ఎక్స్‌ట్రా ఫ్లోర్లకు సైతం పన్నులు విధించకుండా పక్కన పెడుతున్నారు. ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాలైనా, అనుమతులు మీరి నిర్మించిన భవనాలకైనా నూరుశాతం పన్ను అదనంగా విధించాలి. అయితే మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ విభాగం పన్నుల విధింపులో తమ చేతివాటం చూపుతూ నగరపాలక ఖజానాకు నష్టం తెస్తున్నారు. రెవెన్యూ విభాగం సిబ్బంది అధికార పార్టీ వారికి, డబ్బు ఉన్న వాళ్లకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఎన్నో బహుళ అంతస్థుల భవనాలు, వ్యాపార సముదాయాలకు రూ.లక్షల్లో మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పెద్ద పెద్ద భవనాలకు పన్ను విధించేటప్పుడు పరిశీలించాల్సిన ఓఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖజానాకు గండిపడుతున్నా ఓఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారులు కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ఆర్‌ఐలు విధించిన పన్నులపై పూర్తి పరిశీలన చేస్తే అక్రమ పన్నులు బట్టబయలు అవుతాయని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు.
టీడీపీ నేతల అండదండలతోనే..
అధికార పార్టీ నాయకులు నగరంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, అవినీతి పన్నులు, అక్రమార్కులకు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అక్రమాలకు అండగా ఉంటూ అధికారులతో సంప్రదింపులు చేస్తూ తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికారిక కట్టడాలు, అక్రమ పన్నులు, భవన నిర్మాణ అనుమతులు, సివిల్ పనుల టెండర్లు ఇలా ప్రతి పనిలో అధికార పార్టీ చోటామోటా నాయకుల హవా కొనసాగడం గమనార్హం.
ఇప్పటికైనా సామాన్య ప్రజలకు ఒక న్యాయం, డబ్బు, హోదా, అండదండలు ఉన్న పర్గాలకు మరో న్యాయం పాటించకుండా సమన్యాయం పాటించి నగరపాలక సంస్థకు నష్టం జరగకుండా సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. పన్నుల విధింపులు, వసూలు సక్రమంగా జరిగితే వచ్చే ఆదాయంతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment